- రాబోయే నాలుగేళ్లకు అభివృద్ధి ప్రణాళికను రూపొందించండి
- రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలి
- పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి
- గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు నరేగాను ఉపయోగించుకోవాలి
- నరేగా అమలులో దేశంలో మనమే నం.1
- తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలి
- మంత్రులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
- కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహణ
రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలనీ, దానికి అనుగుణంగానే పనులు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలనీ, అందుకు అవసరమైన నిధులు, కావాల్సినంత మంది అధికారులు, పాలనా సౌలభ్యం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మంత్రులు,
రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఉపాధి కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, కొరోనా తీవ్రతపై •సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అన్ని అనుకూల అంశాలు ఉన్నాయనీ, ఇప్పుడు కాకపోతే పల్లెలు ఇంకెప్పుడూ బాగుపడవని చెప్పారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పన, అవసరమైన పనులు చేసుకోవడానికి నరేగా పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ వ్యవసాయ సీజన్ నుంచే నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమలు చేస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానిక• వెయ్యికల్లాలను కేటాయిస్తున్నామనీ, రైతులు ఎక్కువ మంది కల్లాల కోసం ముందుకు వస్తే లాటరీ పద్దతిలో కేటాయిస్తామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు బాగుపడితే బాగుపడినట్లేనన్నారు.
కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చామనీ, కొరోనా వంటి ప్రభుత్వ ఖజానాకు భారమైన రోజుల్లో సైతం గ్రామ పంచాయతీలకు ప్రతీ నెలా రూ. 308 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, గ్రామాల్లో పారిశుద్య సిబ్బందికి నెలకు రూ. 5 వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. సీఎం సహా రాష్ట్రంలోని అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలకు మించిన పని మరొకటి లేదనీ, ప్రతీ ఒక్కరికీ ఇదే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి×ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, నర్సరీలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. కొరోనాపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలనీ, మిడతల దండు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్లె ప్రగతి వల్ల దేశంలో పరిస్థితి మారి ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరైనా నకిలీ విత్తనాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నరేగా అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నం.1 స్థానంలో ఉందనీ, ప్రధాన రహదారుల వెంట ఉన్న ముళ్ల పొదలు తొలగించే పనులు నరేగా ద్వారా చేపట్టాలని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం అప్పుడప్పుడు నిర్వహించడం కాదు, ప్రతీ రోజు విధిగా జరగాలనీ, దీంతో ఆరోగ్యం కోసం ప్రజలు, ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుంది
గ్రామాల్లో గుంతలు తొలగించి పాడుబడ్డ బావులు పూడ్చాలి,…నేను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తా అప్పుడు చెత్తాచెదారం, పరిశుభ్రత లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం వంటి విషయంలో ప్రభుత్వం కలెక్టర్లకు పూర్తి అధికారాలుఇచ్చింది. కాగా, రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ శరత్, కాల్వల్లో పూడికతీత పనులు చేయించిన జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు రవి నాయక్, సిక్తా పట్నాయక్, కర్ణన్లను, హరితహారంలో నాటిన ఎక్కువ మొక్కలు బతికించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహణ
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో కోవిడ్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించారు.సీఎం మొదలుకుని సమావేశంలో పాల్గొన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులందరికీ టెంపరేచర్ టెస్టు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాళంలోని నీళ్లు, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. సమావేశంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించారు. లోపల సీట్లను కూడా దూరం దూరంగా ఏర్పాటు చేయడంతో భౌతిక దూరం పాటించారు.