Take a fresh look at your lifestyle.

‌నిధులు, నియమాకాల్లేవ్‌!

Ceremonial statues Universities .. Students in the palette of hopes
ఉత్సవ విగ్రహాల్లా యూనివర్సిటీలు.. ఆశల పల్లకిలో విద్యార్థులు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కనీస అవసరాలైన నిధులు నియామకాలు లేక పోవడంతో బోధన పరిశోధన రంగం కుంటుపడింది. రాష్ట్ర అవతరణ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని ప్రముఖంగా విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తామని మాట ఇచ్చిన ఉద్యమ పార్టీ సర్కార్‌ ‌పట్టించుకోక పోవడంతో యూనివర్సిటీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలాయనే విమర్శలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ నూతన సంవత్సరంలో మెరుగైన బోధనతో పాటు ఉద్యోగ కల్పన ఉంటుందనే గంపెడు ఆశతో విద్యార్థిలోకం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు ప్రధానంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో గతంలో కంటే తక్కువ నిధులు కేటాయించడం, మంజూరు చేసిన నిధులు సరిగ్గా విడుదల చేయకపోవడంతో మౌళిక సదుపాయాల కల్పన జరుగడం లేదు. ఒక వార్షిక సంవత్సరానికి కాకతీయ విశ్వవిద్యాలయం వేతనాల క్రింద సుమారు 130 కోట్లు అవసరం ఉండగా ప్రభుత్వం గతేడాది 79 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం 230 కోట్లకు ప్రతిపాదనలు పంపగా ఇటీవల 51 కోట్లు మాత్రమే మంజూరు చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రతీ సంవత్సరం కోర్సులతో పాటు విద్యార్థుల సంఖ్య పెరుగడంతో హాస్టల్‌ ‌భవనాలతో మౌళిక వసతులకు భారీగా నిధులు కావల్సి ఉండడంతో వాటి కొరతతో పనులు జరుగని పరిస్థితి నెలకొంటుంది. దీంతో తరుచూ విద్యార్థులు వసతుల సమస్యపై ఆందోళన చేయడం వాటిని నిరోదించడానికి పోలీసుల సహాయం కోరడంతో విశ్వవిద్యాలయాలు విద్యా కేంద్రాలు కాక నిర్భంద కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో అయితే కొంతమంది ఉద్యోగులకు జీతాలివ్వడం కొరకే విద్యార్థుల పరీక్ష ఫీజులు పెంచాల్సి వచ్చిందంటే వర్సిటీల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ప్రతీ విశ్వవిద్యాలయంలో మారిన ఒరవడి పేరుతో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థలు కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ‘స్పెషలైజేషన్‌’ ‌డిమాండ్‌ ‌చేస్తుండడంతో కొత్త కోర్సుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలాగే కొత్త కళాశాలలు పుట్టుకొస్తున్నాయి. తదనుగుణంగా అధ్యాపకులు, ఉద్యోగుల సంఖ్య పెరుగక పోవడంతో బోధన, పరిశోధన రంగ సమస్యలు తలెత్తుతున్నాయి. గతంతో పోలిస్తే కాకతీయ విశ్వవిద్యాలయంలో 35 విభాగాలలో సుమారు 47 కోర్సులున్నాయి. వీటిని బోధించుటకు 15వందల మంది అధ్యాపకుల అవసరం ఉండగా ప్రస్తుతం 129 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు మాత్రమే ఉండడం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం 210 మంది ఒప్పంద అధ్యాపకులు, 220 మంది తాత్కాలిక అధ్యాపకులతో కాలం వెల్లబుచ్చుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిపుణులైన అధ్యాపకులు కాకపోవడంతో పరిశోధన రంగం భారీగా కుంటుపడుతుంది. రాష్ట్రంలోని మొత్తం విశ్వవిద్యాలయాల్లో 3014 అధ్యాపక ఉద్యోగ ఖాళీలున్నాయి. జాతీయ స్థాయిలో 51.55 శాతంగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉండడం గమనించవచ్చు. యుజిసి అనేక సార్లు తెలంగాణ విశ్వవిద్యాలయాలను హెచ్చరించడంతో గత సంవత్సరం 1500 అధ్యాపకుల ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ వివిధ కారణాలతో నేటికీ అవి భర్తీకి నోచుకోలేదు. దీంతో జాతీయ స్థాయి మెరుగైన విశ్వవిద్యాలయాల జాబితాలో ఒక ఉస్మానియా మినహాయిస్తే తెలంగాణాలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయం స్థానం సంపాదించలేకపోయింది. ఈ స్థానాల సంగతి ఎలా ఉన్నా ప్రతీ యూనివర్సిటీలో మాత్రం బోధన కుంటుపడుతుందని ప్రతి రోజు విద్యార్థుల ఆందోళన అనివార్యంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో అయితే సెలబస్‌ ‌పూర్తి కాలేదని, సెమిస్టర్‌ ‌వాయిదా వేయాలని విద్యార్థులు నిత్యం ఆందోళనకు దిగడం సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణలు జరుగడం విద్యార్థులపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది.

దీనికి తోడు గత సంవత్సరం మహాత్మాగాంధీ తెలంగాణ వర్సిటీల్లో, 2009, 2012లలో కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన అధ్యాపకుల భర్తీ అనేక వివాదాలకు దారి తీయడంతో ఖాళీల సంఖ్య ఎలా ఉన్నా వివాదానికి గురైన అధ్యాపకులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వినపడుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఇప్పట్లో వీటికి పరిష్కారాలు కూడా కానరావడం లేదని ఒక సీనియర్‌ ‌ప్రొఫెసర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలల్లో నిత్య సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాలనాధికారులు దాదాపు పాలన స్తంభించిపోయింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్‌ ‌చాన్స్‌లర్‌లు లేకపోవడంతో కీలకమైన నిర్ణయాలు లేక ఇంచార్జీలతో ఆపద్ధర్మ పాలన కొనసాగుతోంది. 2019 ఫిబ్రవరి నుండి యూనివర్సిటీలల్లో పాలన నిర్లక్ష్యానికి గురైందనే ప్రచారం జరుగుతుంది. గత విసీల పదవి కాలం గత సంవత్సరం ఫిబ్రవరి నుండి 6 నెలలు మాత్రమే ఉండగా అందరు విసిలు ఫైనాన్స్‌తో కూడిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోవడమే గాక ఈ ఆరు నెలలు విసీలంతా టైంపాస్‌ ‌చేశారనే అపవాదు ఉంది. గత జులై 15న ఎక్కువ మంది విసిల పదవి కాలం పూర్తి కావడంతో ఐఎఎస్‌లను ఇంచార్జి విసిలుగా నియమించి తిరిగి ఆరు నెలలు అయిన పూర్తి కాలం విసీల నియామకం జరుగకపోవడంతో యూనివర్సిటీల్లో పాలన దాదాపు స్తంభించిపోయిందనే ప్రచారం జరుగుతుంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో అయితే ఈ పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని పలువురు అధ్యాపకులే వ్యాఖ్యానిస్తున్నారు. పలు భవనాల నిర్మాణం ఆగిపోవడం పూర్తయిన భవనాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో అకాడమిక్‌ ‌రంగంలో తీసుకోవాల్సిన పలు కీలక నిర్ణయాలు వాయిదా పడుతున్నట్లు వారు అంటున్నారు.

తరగతుల నిర్వహణ, అకాడమిక్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారం పరీక్షలు తేదీలు సెమిస్టర్‌ల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఇతర అంశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు వారు అంటున్నారు. తరగుతులు జరుగడం లేదని ఒకవైపు, విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా అసలు విద్యార్థులు తరగతులకే రావడం లేదని అధ్యాపకులు వాధిస్తున్నారు. దీనికి తోడు తాత్కాలిక అధ్యాపకుల ఆందోళనలు కూడా బోధనా రంగాన్ని అతలాకుతలం చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. తాత్కాలిక సమస్యలు తక్షణం పరిష్కరించి అధ్యాపకులను విద్యార్థులను, ఉద్యోగులను గైడ్‌ ‌చేసే పూర్తి కాలం విసి లేకపోవడం పెద్ద లోటు అనే అభిప్రాయం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఇంచార్జి విసిలు, తాత్కాలిక రిజిస్ట్రార్‌లు తీసుకునే నిర్ణయాలు వర్సిటీలను గందరగోళానికి గురి చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. గత మాసంలో కెయు పాలకమండలి 2009, 2012 సంవత్సరాల్లో నియామకమైన 38 మంది రెగ్యులర్‌ అధ్యాపకులను తొలగించి, నియామకం చేసిన అధికారులను వదిలివేసిన తీరు యూనివర్సిటీ పాలనకే తలవంపులు తెచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయినప్పటికీ తమ భవిష్యత్తు కొరకు విద్యార్థులు మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.

Tags: Ceremonial, statues Universities, sfi and ksf Students, palette of hopes

Leave a Reply