Take a fresh look at your lifestyle.

శిష్యుడి ప్రశ్నే.. గురువుకు బహుమతి

“అది సామాజిక శాస్త్రమైనా, విజ్ఞాన శాస్త్రమైనా, తత్వశాస్త్రమైనా పూర్వ ప్రాథమిక విద్యనుండి విశ్వవిద్యాలయం వరకు.‘సమర్థుడైన గురువు బోధనలే శిష్యుని జీవితానికి సార్థకత, యోగ్యుడైన శిష్యుడు లభించకపోతే గురువు నేర్పే విద్యకు ప్రకాశం ఉండదు’. గురువులు విద్యార్థుల విజయాల్లో చిరంజీవులై ఉంటారు. ఉపాధ్యాయ వృత్తి అందరం నడిచే దారి కాదు. అది ఆ వృత్తి ప్రత్యేకత, గొప్పతనం.”

ప్రపంచ నాగరికతను మార్చే ఆయుధం ‘చదువు’. ఈ చదువును బోధించే ‘గురువు’ సమర్థుడైనవాడై ప్రశ్నోపనిషత్తుకు ప్రథమ ప్రాధాన్యతతో విద్యార్థులను పురిగొలిపితే, విద్యార్థుల్లో జ్ఞానార్జన, శాస్త్రీయ వైఖరి, సామాజిక స్పృహ పెరుగుతుంది. ప్రశ్న- స్ఫూర్తి కలిగిస్తుంది. నిజాలు బయటపడి చైతన్యం కలిగిస్తాయి. అభివృద్ధి, సంస్కృతులకు,  నేటి సాంకేతిక జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం. విద్య – గురువు. మానవుడి అసలు తత్వం మానవత్వం అయితే దానిని గురువు వెలికితీయాలి. గురువు విద్యా బోధనతో పాటు సామాజిక స్పృహ, మానవీయ విలువలు, వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొందిస్తూ చైతన్య వంతమైన నైతిక విలువలతో కూడిన సమాజ స్థాపనకు పునాది వెయ్యాలి. తల్లిదండ్రులు, ప్రభుత్వం, పౌర సమాజం సహకరించాలి.  పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం గురువులకే సాధ్యం, అందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తేడాలేదు. సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ 1888 ‌సెప్టెంబర్‌ 5‌న  జన్మించారు.
ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా, గొప్ప రచయితగా, తత్వవేత్తగా, ఆదర్శమూర్తిగా, నాయకుడుగా, ఉపరాష్ట్రపతిగా, ఆ తర్వాత రాష్ట్రపతిగా పదవులు లనకరించారు. విద్యావేత్తగా పేరుగాంచారు. భారత ప్రభుత్వం ‘‘భారతరత్న’’తో సత్కరించింది. ఆ మహానీయుని జన్మదినాన్ని ‘‘గురుపూజోత్సవం’’గా జరుపుకుంటున్నాం. గురువు సమాజ జీవనానికి చుక్కానిగా, సమాజ హితాన్ని కోరుకుంటూ ప్రశ్నలు వేస్తూ… ప్రశ్నించేలా విద్యార్థులను తయారు జేస్తాడు. విద్యార్థులను   సమాజంలో పరిపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తులుగా మలచటానికి కృషి చేస్తాడు. ఎంత క్లిష్టమైన శిష్యుడి సందేహాని(ప్రశ్న)కైనా జవాబుగా జ్ఞానాన్ని అందిస్తాడు. స్వాతంత్య్రాన్ని సాధ్యం చేసింది, ఉపాధి, ఉద్యోగాలు సాధించింది, వేతనాలను పెంచింది, మూసిన ఫ్యాక్టరీల గేట్లు తెరిచింది, తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది, ఎంతపెద్ద చిక్కు సమస్యల తాళాన్నైనా తెరిపించింది… ఒక తాళం చెవి లాంటిది ప్రశ్న. అది సామాజిక శాస్త్రమైనా, విజ్ఞాన శాస్త్రమైనా, తత్వశాస్త్రమైనా పూర్వ ప్రాథమిక విద్యనుండి విశ్వవిద్యాలయం వరకు.‘సమర్థుడైన గురువు బోధనలే శిష్యుని జీవితానికి సార్థకత, యోగ్యుడైన శిష్యుడు లభించకపోతే గురువు నేర్పే విద్యకు ప్రకాశం ఉండదు’. గురువులు విద్యార్థుల విజయాల్లో చిరంజీవులై ఉంటారు. ఉపాధ్యాయ వృత్తి అందరం నడిచే దారి కాదు. అది ఆ వృత్తి ప్రత్యేకత, గొప్పతనం.   
దురదృష్టం ఏమంటే, నేర్చుకోవడం మానేసిన వాళ్లు విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. బోధించడం ఆరంభిస్తున్నారు. పాలకులు విద్యను అంగడి సరుకును చేసి, విద్యా సంస్థలు సర్టిఫికెట్లను ప్రధానం చేసే ఫ్యాక్టరీలుగా మారి, గురు-శిష్య బంధాలలో అగాధం పెరిగగింది. ఆధునిక టెక్నాలజీ (ఆన్లైన్‌ ‌బోధన) గురువు స్థానాన్ని పరిపూర్ణంగా భర్తీ చేయలేదు. టెక్నాలజీ రెండువైపుల పదునున్న కత్తిలాంటిది. గురువు- విద్యార్థి ముఖాముఖి బోధన లేనిచో విలువలు పతనమౌతాయి. ‘బోధన-అభ్యాసన’ గాడి తప్పుతుందనిపిస్తున్నది. గ్లోబలైజేషన్‌ ‌నట్టింట్లోకి రావడమే కాదు, బతుకులోని ప్రతి నిమిషాన్ని శాసించే స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యాన్ని చదివినవారు మార్కెట్‌ ‌స్వామ్యం చేసే చేష్టలకు నిశ్చేష్ఠువుతున్నారు.
సమకాలీన భారతంలో ప్రశ్న మూగబోయిన్ది. ప్రశ్నించడం నేరమైంది. ప్రశ్నించే కలాలు, గళాలు ఇనుపచువ్వలు లెక్కిస్తున్నాయి. మనం ఏమి నేర్చుకున్నాం.. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం! ఎలా వ్యవహరించాలో అనే మరో ప్రశ్న ఉద్భవిస్తుంది. దీనికి పాలకులు, సమాజం జవాబు చెప్పాల్సి ఉంది. అందుకే విద్యాలయానికి – సమాజానికి పొంతన లేని విధానాలు విడనాడాలి. నూతన విద్యావిధానం, బోధన పద్ధతులంటూ  గురువుకు స్వేచ్చ లేకుండా పోయింది. గురువును – విద్యార్థిని వారు నిర్మించిన పంజరంలోనే బోధించడం, అధ్యయనం చేయడం, శోధించడం, భావితం చేయడం లాంటి వాటిలో ప్రశ్నించే తత్వాన్ని వీడి ‘గానుగెద్దు’లా బోధనాభ్యసన  చేయాల్సిన ంపరిస్థితి ఏర్పడింది. విద్యాలయాన్ని, తరగతి గదిని పాలకుల ప్రయోగశాలగా మార్చి విజయాలను పాలకుల,  ఖాతాలో జమచేసుకుంటూ అపజయాలను గురువులపై నెట్టివేస్తున్న  స్థితిలో గురుశిష్యులు  ఊగిసలాడుతున్నారు. కాదనలేని నిజం..  ప్రశ్నకు పాలకులు పట్టం కట్టాలి.. పట్టాభిషేకం చేయాలి.. చైతన్య వంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. సమాజం గురువు స్థానానికి ఇస్తున్న గౌరవ, ప్రతిష్ఠలకు లోటురాకుండా ఆ వృత్తిలో నైపుణ్యాలను పెంచుకోవాలి. బోధన కాలాన్ని  గురువులు స్వార్థ ప్రయోజనాలకు వాడకుండా ముందు తరాలకు   మార్గదర్శకంగా నిలవాలి. కోవిడ్‌ ‌పెట్టిన గడ్డు పరీక్ష నుండైనా పాలకులు గుణపాఠం నేర్చుకొని దేశభవిష్యత్తు నిర్మాణం జరిగే తరగతి గది క్రతువు సాఫీగా సాగాలంటే ‘కామన్‌ ‌స్కూల్‌’‌లో అంతరాలు లేని విలువలతో కూడిన చదువులు అందేలా ఉచిత విద్యను అందించాల్సి వుంది. ‘గురుపూజోత్సవం’అంటే ప్రశ్నకు పట్టాభిషేకం చేయడమేనని భావించండి.
మేకిరి దామోదర్‌ 
వరంగల్‌
‌సెల్‌: 9573666650
(‌సెప్టెంబరు 5 – గురుపూజోత్సవం)  

Leave a Reply