- మంత్రులు, ఎమ్మెల్యేలకు కొరోనా టెస్టులు
- మీడియా పాయింట్ క్లోజ్, లాబీ, మంత్రుల చాంబర్లకు నో ఎంట్రీ
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్లు
- పార్లమెంటు గైడ్‌లైన్స్ ప్రకారమే సమావేశాలు : మంత్రి వేముల
- కొరోనా టెస్టు రిపోర్టుతోనే అసెంబ్లీకి రావాలి : స్పీకర్ పోచారం
కోవిడ్ 19 నేపథ్యంలో ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.అసెంబ్లీ, మండలి హాల్లో సభ్యుల మధ్య 6 అడుగుల దూరం వచ్చేలా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచే కొరోనా టెస్టులు చేయడం ప్రారంభించారు. సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశమై సమావేశాల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కొరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామనీ, పార్లమెంటు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే సమావేశాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రులు,ఎమ్మెల్యేలు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు బయట టెస్టులు చేయించుకున్నా సరే నెగెటివ్ రిపోర్టు చూపిస్తేనే అసెంబ్లీలోకి అనుమతిస్తామని చెప్పారు. లాబీల్లోకి, మంత్రుల చాంబర్లలోకి మీడియా ప్రతినిధులకు అనుమతి లేదన్నారు. గ్యాలరీలోకి మాత్రమే మీడియాను అనుమతిస్తామనీ, మీడియా పాయింట్‌ను సైతం పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. శాసనసభలో కొత్తగా 40, శాసన మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీకి వచ్చే అధికారులు, సిబ్బందికి కొరోనా టెస్టులు చేస్తామనీ, శాఖల వారీగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీపీఈ కిట్లు, ర్యాపిడ్ కిట్లు, ఆక్సీమీటర్లు, అంబులెన్సులు అసెంబ్లీలో 2, శాసన మండలిలో 2 ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ స్టాఫ్ మార్షల్స్‌తో సహా సిబ్బంది అందరూ రెండు రోజుల ముందే టెస్టులు చేయించుకోవాలనీ, అలాగే, జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రతీ రోజూ శానిటేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో రెగ్యులర్‌గా ఉండే వైద్యులతో పాటు కొరోనాపై అవగాహన ఉన్న వైద్యులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. శాసనసభలోకి మంత్రులు, వారి పీఏలను, అలాగే, ఎమ్మెల్యేలలు, వారి పీఏలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
కొరోనా టెస్టు రిపోర్టుతోనే అసెంబ్లీకి రావాలి : స్పీకర్ పోచారం
కొరోనా టెస్టు చేయించుకుని నెగెటివ్ వస్తేనే రిపోర్టుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జ్వరం రాకున్నా దగ్గు, జలుబు ఉన్నా సభకు రావొద్దని సభ్యులకు సూచించారు అసెంబ్లీకి వచ్చే పోలీసు, మీడియా ఇతర శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశాలు ప్రారంభమయ్యే లోపే కొరోనా టెస్టులు చేయించుకోవాలనీ, నెగెటివ్ రిపోర్టు చూసిన తరువాతనే అసెంబ్లీలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో సహా ఎవరికి పాజిటివ్ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండదనీ, ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టెస్టులు చేయించుకున్నారనీ, మిగతా ఎమ్మెల్యేల వద్దకు వైద్యులు వెళతారని తెలిపారు. అసెంబ్లీకి మంత్రుల పీఎస్‌లకు అనుమతి ఉందనీ, ఎమ్మెల్యేల పీఏలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సభ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ టెస్టింగ్, శానిటైజర్ అందుబాబులో ఉంటుందనీ, హై టెంపరేచర్ ఉంటే సభలోకి అనుమతి లేదన్నారు. సభలో ఒక్కొక్క సీటుకు ఒక్కరే కూర్చుంటారనీ, అసెంబ్లీ ప్రాంగణంతో పాటు సభలోని మైక్‌ను కూడా రోజూ శానిటైజ్ చేస్తామని తెలిపారు. 20 నుంచి 21 రోజులు సభ నడవొచ్చని అనుకుంటున్నామనీ, అసెంబ్లీకి వచ్చే వాళ్లు తమ బంధువులు, ఫంక్షన్లు, స్నేహితుల ఇళ్లకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కిట్లు ఇస్తున్నామనీ, అందులో ఆక్సిమీటర్, శానిటైజర్ ఉంటాయన్నారు. ఆక్సీజన్ పర్సంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావొద్దనీ, ఈ సెషన్‌కు విజి•ర్స్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈసారి విజిటర్స్ గ్యాలరీని కూడా మీడియా ప్రతినిధులకే కేటాయిస్తామనీ, ఈ సెషన్‌కు మీడియా పాయింట్ లేదనీ, అందరూ బాగుండాలనే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాసనసభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలనీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్లమెంటులో అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలనే ఇక్కడ అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా పోచారం స్పష్టం చేశారు.