- బుధవారం మరో 49 కొత్త కేసులు
- 453కు చేరిన కొరోనా పాజిటివ్
- లాక్డౌన్ కొనసాగింపుకే ప్రభుత్వం మొగ్గు
- ఇకపై రోడ్లపై ఉమ్మితే కఠిన చర్యలకు ఆదేశం
తెలంగాణలో కొరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్క రోజే 49 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 453కు చేరింది. రాష్ట్రంలో కొరోనా బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసుల నుంచి వైద్య చికిత్సల ద్వారా కోలుకుని 45 మంది దిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 397 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయనీ, వారందరికీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం సాయంత్రం వెల్లడించాయి. ఇప్పటి వరకు వైరస్ కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ గడువు తేదీ మరో 6 రోజుల్లో ముగుస్తుండటం, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్‌డౌన్‌తో పాటు రాత్రిపూట కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే 6 రోజుల్లో ఒకవైపు కట్టడిని కొనసాగిస్తూనే మరోవైపు, నివారణ చర్యలలో భాగంగా రాష్ట్రంలోని ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో మరిన్ని సౌకర్యాలతో పాటు అదనంగా పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా కొరోనా బాధితులకు సత్వరవైద్య సేవల కోసం వెంటనే 8 కొత్త కేంద్రాల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 25,937 మందిని ప్రభుత్వం క్వారంటైన్ చేసింది. అందులో కేవలం 50 మందికి మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరికి చికిత్స అందిస్తూనే 14 రోజుల క్వారంటైన్ గడువు పూర్తయిన మిగతా వారందరినీ రోజుకు కొంతమందిని డిశ్చార్జి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందిరీకీ క్వారంటైన్ గడువు ముగిస్తే ఈ లెక్కన ఈనెల 7 వరకు తెలంగాణను కొరోనా ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావించారు.అయితే, అనుకోని పిడుగులా మర్కజ్ నుంచి 1089 మంది రాష్ట్రానికి రావడం వారందరికీ పరీక్షలు నిర్వహించగా 172 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సమస్య తిరిగి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఆ 172 మంది రాస్ట్రవ్యాప్తంగా తమ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు అంటించడంతో రోజురోజుకూ కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 404గా నమోదైంది.
ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ఠ్రంలో కొరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించడం మినహా గత్యంతరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జూన్ 3 వరకూ లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేననే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌ను ఎంత కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి రావడం ప్రభుత్వానికి పోలీసులకు తలనొప్పిగా మారింది. కర్ఫ్యూ సడలించిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ప్రజలను రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. 50 శాతం మంది వాహనదారులు ఏ కారణంగా లేకుండానే రోడ్లపైకి వస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇది కూడా ప్రభుత్వం లాక్డౌన్ గడువును మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని కోరడానికి కారణమైంది. మరోవైపు, కొరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్న ప్రభుత్వం బుధవారం మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డు మీద ఎవరైనా ఉమ్మితే పక్కా చర్యలు తీసుకునేలా సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కొరోనా ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో ఉమ్మడం, పాన్, గుట్కా, చూయింగ్ గమ్ వంటి వాటిని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని కచ్చితంగా అమలు చేసే అధికారాలను వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పోలీసు శాఖలకు ఇచ్చింది. రోడ్డుపై ఎవరైనా ఉమ్మి వేస్తున్న తరుణంగా సమీపంలో ఉన్న ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఆ వ్యక్తిపై చర్య తీసుకునే అధికారం కల్పించారు. ఒకవేళ అక్కడ ఏ ప్రభుత్వ అధికారి అయినా అక్కడ లేని పక్షంలో ఎవరైనా ఉమ్మి వేస్తున్న దృశ్యాన్ని మొబైల్లో పిక్ తీసి పోలీసులకు పంపిస్తే వారు కఠిన శిక్షను అమలు చేస్తారని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.