రూ. 5.16 కోట్ల అపరాధ రుసుము చెల్లించాలి – రెగ్యులరైజ్ చేసుకోవడానికి 3 రోజులే
పట్టణాలలో, గ్రామాల్లో అక్రమ లేఔట్ల నిర్మాణాలను ప్రభుత్వం ఉపేక్షించదని, వాటిపై కఠినచర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ హెచ్చరించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అక్రమ లేఔట్లను ఆర్డీఓ బుధవారం పరిశీలించి, 3రోజుల్లో అపరాధ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో అక్రమ లేఔట్లను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 29.17ఎకరాలు, పెద్దపల్లి రూరల్‌లో 52ఎకరాలు, సుల్తానాబాద్‌లో 11.06ఎకరాలు, రామగుండం కార్పోరేషన్ పరిధిలో 24.35ఎకరాలు, రామగుండం మండలంలో 22.12ఎకరాల అక్రమ లేఔట్లను గుర్తించినట్లు తెలిపారు. పెద్దపల్లి మండలంలో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల ప్రకారం 217.28ఎకరాలలో అక్రమ లేఔట్లను గుర్తించి, 92మందికి నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు.
వాటి యాజమానులు 3రోజులలో అపరాధ సొమ్ము రూ.5.16కోట్లు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. నూతన పురపాలక చట్టం, పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన లేఔట్లను ఎలాంటి నోటిసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారం ఉందన్నారు. అనుమతి లేకుండా లేఔట్ల నిర్మాణం చేపడితే కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, స్థలాలు కొనేవారు ఈ అంశాలను తెలుసుకోవాలని ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న లేఔట్లకు మాత్రమే అనుమతి మంజూరు చేస్తామని ఆర్డీవో శంకర్ కుమార్ స్పష్టం చేశారు.