- ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్య
- రాష్ట్రంలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు
- గంభీరావుపేటలో డిగ్రీ కాలేజీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
ప్రపంచంతో పోటీ పడే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను అందిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యారంగానికి కేటాయింపులు పెంచి, గ్రామస్థాయిలో బలోపేతం చేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు జ్యోతిబాపులే, అంబేడ్కర్ ఓవర్సీస్ కింద ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. సినారే పేరు వి•ద ఏర్పాటు చేసిన లైబ్రరీ పోటీ పరీక్షలకు వేదికగా మారిందన్నారు. జిల్లాలోని గంభీరావు పేట మండల కేంద్రంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. గంభీరావుపేటలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి.. కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తనదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థినుల కోసం హాస్టల్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వొచ్చే వారికి వేగంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉపాధిని కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ ఉండాలి. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సొంతంగా పరిశ్రమలు పెట్టేవారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఉత్సహవంతుల కోసం టీ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం లబ్దిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గంభీరావుపేటలో మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పత్రాలు పంపిణీ చేసారు. తర్వాత నర్మాలలో రైతు వేదికను ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేసారు. నర్మాలలో శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతిగదులను ప్రారంభించారు. కొత్తపల్లిలో మహిళాసంఘం నూతన భవనం, లింగన్నపేట, మల్లారెడ్డిపేటలో నిర్మించిన రైతు వేదికలను ప్రజలకు అంకితం చేసారు.