హైదరాబాద్ నగరం నడిబొడ్డున అర్పేటలోని శ్యాంకరణ్రోడ్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇప్పటికే ఇరవై మందిని కుక్కలు కరిచినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. చాలా మంది చిన్నారులు పిచ్చి కుక్కల బారిన పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కుక్కల బెడద తీవ్రం అవుతోందని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు.
వీధి కుక్కల బెడద పై జీహెచ్ఎంసి అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, యుద్ధ ప్రాతిపదికన వీధి కుక్కల నివారణ చర్యలు తీసుకునేలా కార్పొరేషన్‌ను ఆదేశించాలని బాలల హక్కకల సంఘం తెలంగాణ మానవహక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనపై తక్షణం చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన హెచ్ఆర్సీని కోరారు.