Take a fresh look at your lifestyle.

దిక్కుతోచని స్థితిలో వీధి బాలలు

ఇటీవల వార్తా పత్రికలలో మనసు తల్లడిల్లే సంఘటనలను తెలియజేస్తూ ప్రచురితమైన వార్తలతో లాక్‌డౌన్‌ ‌సందర్భంగా వీధి బాలలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా తాను తిండిలేక పస్తులు ఉంటున్నాననీ, తనతో పాటు తన ముగ్గురు తమ్ముళ్లు కూడా ఆకలితో అలమటిస్తున్నారంటూ ఆహారం అందించకపోయినా కనీసం మంచినీళ్లైనా ఇవ్వండంటూ 11 ఏళ్ల ఓ బాలుడు అధికారులకు పంపిన వీడియో సందేశం కలవర పెడుతోంది. కోవిడ్‌ 19 ‌మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచంలో కరోనా ప్రభావం చూపని రంగం అంటూ ఏది లేకుండా పోయింది. కరోనా కంట్రోల్‌ ‌కోసం విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా చివరికి అభం శుభం తెలియని వీధి బాలలు కూడా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఒక్క హైదరాభాద్‌ ‌లోనే వేలల్లో ఇటువంటి పిల్లలు ఉన్నారు. ఉండటానికో ఇల్లు, పిలవడానికంటూ ఒక పేరు, సొంతంగా ఎలాంటి గుర్తింపనేది లేకుండా..ఖాళీ కడుపుతో బతుకీడ్చుతున్న వీధిబాలలను ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కాకుండా మనం అందరం తలా ఒక చేయి వేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మధురమైన బాల్యాన్ని నోచుకోని వాధిబాలలు : బాల్యం తిరిగిరానిది. ఆటపాటలతో, అమ్మ నాన్నల ముద్దు మురిపాలతో చెంగు చెంగున ఎగిరే లేడి కూనల్లాగ వుండే బాల్యం ఏంతో మధురంగా ఉంటుంది. కాని, కొంత మంది పిల్లలకు ఈ మధురానుభూతులు సొంతం చేసుకోలేరు. పుట్టగానే తల్లితండ్రులు వదిలి వేసిన పిల్లలు, పిల్లలను అమ్ముకునే తల్లితండ్రులు, తల్లితండ్రులు లేని అనాథలైన బాలలు, భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే పిల్లలు, చెత్త ఏరుకుని జీవించే బాల బాలికలు, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలకు ఆ కమ్మని బాల్యాన్ని అనుభవించే అదృష్టం దొరకదు. వారి జీవితాలు చిన్ని వయసులోనే మసి బారిపోతున్నాయి.
యునిసెఫ్‌ ‌ప్రత్యేక దృష్టి : కరోనా లాక్‌డౌన్‌ ‌దేశంలోని వీధి బాలలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లల ఆరోగ్యం, పోషణ, చదువులతో పాటు వారి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా తీవ్ర స్థాయిలో క్షీణిస్తోందని యూనిసెఫ్‌ ‌తన నివేదికలో తెలియ చేసింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం భారత దేశంలో దాదాపు 4 కోట్ల మంది వీధిబాలలు ఉండగా, ఒక్క దిల్లీలోనే కనీసం 70 వేల మంది వరకు ఉన్నారు. వీరందరి సంక్షేమం కోసం యూనిసెఫ్‌ ‌ప్రత్యేకంగా తన దృష్టిని కేంద్రీకరించింది.

మానసిక ఆందోళన : ప్రపంచ జనాభాలో మూడవ వంతు కోవిడ్‌-19 ‌లాక్‌డౌన్‌లో ఉంది, ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలు మూసివేయడం వల్ల షుమారుగా 1.5 బిలియన్ల మంది పిల్లలపై మానసిక స్థితిపై ప్రభావం చూపనుంది. అందులోనూ వీధి బాలల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. వీధి బాలలపై లైంగిక దాడులు పెరిగే అవకాశం ఉంటుంది. వారి చిన్ని మనసులలో హింసాత్మక ప్రవర్తన, ప్రమాదకర స్థితికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
షెల్టర్లలో ఉండడం ఒక నరకం : షెల్టర్‌లలో ఉండాలంటే నరకంగా భావిస్తున్న వీధి బాలలు, స్వేచ్ఛగా వీధులలో తిరిగే బాలలు ఒక్క సారిగా షెల్టర్‌ ‌లకు పరిమితం కావడంతో వారిలో మానసిక ఆందోళనలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఏర్పడుతుంది. మే 3 వరకు పొడగించిన లాక్‌ ‌డౌన్‌తో మరింత ఒత్తిడికి లోనవుతుంటూ ఉంటారు. ఒకేచోట ఎక్కువ సమయం ఉండటం వలన వారి మానసిక ప్రవర్తనలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో కోపం, ద్వేషం, తెలియని అసహనం వంటి లక్షణాలు ఏర్పడుతాయి. దానితో తీవ్ర మనోవేధనకు గురవుతూ ఉంటారు.
వీధి బాలల మానసిక ఆందోళనకు హెల్ప్ ‌లైన్‌ 9703935321

Dr Atla Srinivas Reddy
డా।। అట్ల శ్రీనివాస్‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,
‌చేతన సైకాలజికల్‌ ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌
9703935321

Leave a Reply