- గత 20 రోజుల్లో బ్రిటన్ నుంచి వొచ్చినవారు.. 1200
- రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
- విదేశాల నుంచి వొచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ సేకరణ
- ప్రధాన హాస్పిటల్స్‌లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు
- మంత్రి ఈటల నేతృత్వంలో నిపుణుల కమిటీ భేటీ
తెలంగాణలో కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతున్నది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిలో కొత్త వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి పరిశీలిస్తున్నారు. దీంతో గత 20 రోజులుగా ఆ దేశం నుంచి రాష్ట్రానికి 1200 మంది వచ్చినట్లు గుర్తించారు. వీరిలో జీహెచ్ఎంసి పరిధిలో 800 మంది ఉండగా, మిగతా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా డీఎంహెచ్వోలు ఆయా జిల్లాలకు బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి శాంపిల్స్ సేకరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ లక్షణాలున్నాయా ? అని తెలుసుకునేందుకు పూణేకు పంపిస్తున్నారు.
ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాకు బ్రిటన్ నుంచి 16 మంది వచ్చినట్లు గుర్తించగా, వారిలో 10 మందిని ట్రేస్ చేశారు. మిగతా 6 గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బ్రిటన్ నుంచి 17 మంది వచ్చినట్లు గుర్తించగా వీరిలో ఆదిలాబాద్ 3, మంచిర్యాల 7, నిర్మల్‌కు 6 గురు వచ్చినట్లు స్థానిక వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి వారి వివరాలు సేకరించడంతో పాటు వారి శాంపిల్స్ సేకరించి ప్రైమరీ కాంటాక్టులపై ఆరా తీస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాకు బ్రిటన్ నుంచి 22 మంది, నల్గొండ జిల్లాకు 8 మంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 26 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లాకు 45 మంది వచ్చినట్లు ఆయా జిల్లాల వైద్య శాఖ అధికారులు గుర్తించారు. వీరందరినీ వెంటనే ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు ప్రైమరీ కాంటాక్టుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు, గత 20 రోజులలో హైదరాబాద్ నగరానికి బ్రిటన్ నుంచి 800 మంది వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వీరందరిని గుర్తించడంతో పాటు ప్రవాస భారతీయుల వివరాలు సేకరించి ప్రతీ ఇంటికీ వెళ్లి శాంపిల్స్ సేకరిస్తున్నారు. కొత్తరకం కొరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే, హైదరాబాద్ నగరంలో బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్లను కనుగొనడం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు, రాస్ట్రవ్యాప్తంగా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు.
మంత్రి ఈటల నేతృత్వంలో నిపుణుల కమిటీ భేటీ
తెలంగాణలొ కొత్త కోరోనా వైరస్ టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఎక్సస్పర్టస్ కమిటీ గురువారం భేటీ అయింది. కొరోనా కోసం ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్టస్ కమిటీలో సీసీఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, హెల్త్ వర్సిటీ విసి కరుణాకర్‌రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్, నిమ్స్ ప్రొ.గంగాధర్, హెచ్ఎంఆర్ఐ సీఈవో బాలాజి ఉన్నారు. బీఆర్కే భవన్లో జరిగిన ఈ భేటీలో కొరోనా రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ ముఖ్యంగా గత 20 రోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి వెంటనే ఐసోలేషన్‌కు పంపడంతో పాటు శాంపిల్స్ సేకరించి అనుమానితులను ఆయా దవాఖానాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులకు తరలించాలని ఈ సందర్బంగా మంత్రి ఈటల వైద్య,ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.