Take a fresh look at your lifestyle.

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు ఎలాంటి ఇబ్బందులు పడతారో మనకు తెలియని విషయం కాదు. హైదరాబాద్‌ ‌నగర రోడ్ల పై ఏకంగా పడవలు వేసుకుని వెళ్లిన సందర్భాన్ని మొన్నటి వర్షాల్లో చూశాం.’’

ఇటు నుంచి రెండు రాళ్లు వేస్తే…అటు నుంచి నాలుగు రాళ్లు పడే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ‌గురించి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలతో ఇదే జరిగింది. సంక్రాంతికి పక్క జిల్లాకు వెళ్లి వచ్చిన స్నేహితుడు రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయి, తాగటానికి నీళ్లు లేవు, కరెంట్‌ ‌కటకటతో నానా ఇబ్బంది పడినట్లు తనతో చెప్పాడని కేటీఆర్‌ ఓ ‌సదస్సు సందర్భంగా చెప్పారు. దీనితో రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగుతోంది.

 

కేటీఆర్‌ – ‌కొన్ని ప్రశ్నలు
ఇక్కడ కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యల్లోకి వెళితే తన స్నేహితుడు వెళ్లిన సమయం సంక్రాంతి. అంటే జనవరి నెల. జనవరి నెలలో కోతలు ఎందుకు ఉంటాయి అన్న ప్రశ్నకు కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రోడ్లు బాగోలేని పరిస్థితిలో వాస్తవం లేకపోలేదు. నీళ్ల సమస్యా కొన్ని చోట్ల ఉండే ఉంటుంది. మరి ఈ సమస్యలు ఏపీకి మాత్రమే పరిమితమా? తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు ఎలాంటి ఇబ్బందులు పడతారో మనకు తెలియని విషయం కాదు. హైదరాబాద్‌ ‌నగర రోడ్ల పై ఏకంగా పడవలు వేసుకుని వెళ్లిన సందర్భాన్ని మొన్నటి వర్షాల్లో చూశాం. అనేక కాలనీలు నీళ్లల్లో మునిగి జల దిగ్బంధం అవటమూ మీడియాలో కళ్ళారా చూపించిన విషయాలే. ధనిక రాష్ట్రం అయి ఉండి…మెట్రోపాలిటన్‌ ‌నగరం అయి ఉండీ …కనీసం వరద ముంపున పడకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేని పాలన చేస్తున్నారా అని నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్‌ ‌సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కరెంట్‌ ‌విషయానికి వస్తే తెలంగాణాలో 6 నుంచి 10 గంటల కరెంట్‌ ‌కట్‌ ఉం‌టోందని, రైతాంగం అల్లాడుతోందని ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ ‌నెల 15న ఒక సమగ్ర కథనం రాసింది. ఇక పబ్‌ ‌కల్చర్‌, ‌డ్రగ్స్ ‌మాఫియా వంటివి హైదరాబాద్‌కే ప్రత్యేకం అని సోషల్‌ ‌మీడియాలో మీమ్స్ ‌దర్శనమిస్తున్నాయి. ఇక డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌,‌దళితులకు బంధు హామి వంటి సంక్షేమ పథకాలు, వాటిలో డొల్లతనం రాజకీయంగా చర్చకు దారీతీసేవే.

రాజకీయ సమీకరణం
పాలనా పరంగానే కాకుండా కేటీఆర్‌ ‌వ్యాఖ్యలను రాజకీయ కోణంలోనూ పరిశీలించాల్సిందే. ఏ రాజకీయ లబ్ది కోసం లేదా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుది. సోషల్‌ ‌మీడియాలో కాస్త స్వేచ్ఛ తీసుకుని కౌంటర్‌ ‌చేస్తారు. బహుశా అందుకే కేటీఆర్‌, ‌పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కలిసి ఉన్న ఫోటోలు పెట్టి సంక్రాంతికి వెళ్లిన వచ్చిన స్నేహితుడు ఇతనేనా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే పొరుగు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాల్సి పరిస్థితులను వదిలేసి ఆ ప్రభుత్వం పై రాళ్లేస్తున్నారు అంటే అక్కడి ప్రతిపక్షానికి ఉపయోగపడేటట్లు వ్యవహరిస్తున్నారు అంటే అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుంది.ఇక తెలంగాణా రాజకీయ క్షేత్రాన్ని పరిశీలిస్తే వచ్చే ఏడాది అక్కడ ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణా గడ్డ పై జరిగే ఎన్నికలకు ఏపీలోని రాజకీయాలు, సామాజిక సమీకరణలతో సంబంధం ఉంటుంది.

కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రజల ఓట్లు కనీసంగా 5 నుంచి 10 వేల వరకు ఉంటాయి. కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి లాంటి చోట్ల గెలుపును నిర్ణయించేది ఏపీ ఓటర్లే. పార్టీ పరంగా ఎలా ఉన్నా తమ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడి భావోద్వేగాలు రెచ్చగొడితే ఈ ఓట్లకు నీళ్లు వదులుకోవాల్సి వచ్చే ప్రమాదం ఉంటుంది. 2018లో కేసీఆర్‌ ‌ముందస్తుకు వెళ్లినప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ ‌పరోక్షంగా గులాబీ దళానికి సహాయ సహకారాలు అందించారు అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. రెడ్డి సామాజిక వర్గ ఓట్ల కోసం టీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నాలు చేసిందన్నది వాస్తవమే కదా. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ట్రయాంగిల్‌ ‌ఫైట్‌ ‌జరిగితే రెండు, మూడు వేల ఓట్లు కూడా గెలుపుకు కీలకంగా మారతాయి. రాజకీయంగా ఇలాంటి గట్టి సవాలు ఉన్నప్పుడు కీలక స్థానంలో ఉన్న కేటీఆర్‌ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏం ప్రయోజనం పొందాలనుకున్నారు? ఇక్కడే మరో కీలకమైన అంశం కూడా ఉంది. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్ల ఓట్లు టీఆర్‌ఎస్‌కు అవసరం కాని ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి లేదు. ఏపీలోని ఏ రాజకీయ పార్టీకి తెలంగాణా ఓటర్ల వల్ల ప్రయోజనం కలిగే అవకాశం ఉండదు.

దిద్దుబాటు
బాధ్యత గల స్థానాల్లో ఉన్న వాళ్లు బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే అనూహ్యమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బహుశా ఈ విషయాన్ని గ్రహించే కేటీఆర్‌ ‌వెంటనే తప్పును సరిదిద్దుకున్నారు. ఏపీ ముఖ్య మంత్రితో తనకు సోదర బంధం ఉందని, తన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులను బాధించాయని ట్విట్టర్‌ ‌వేదికగా విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ‌చేసిన ఈ దిద్దుబాటు చర్య అభినందించదగింది. ఒక్కోసారి ఉద్దేశాలు వేరైనా వ్యక్తీకరణలో లోపం వల్ల ఎదుటివారి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. తప్పుచేయటం తప్పుకాదు కాని పొరపాటు చేశామని తెలిసిన తర్వాత సరిదిద్దుకోకుండా ఉండటమే అసలైన తప్పవుతుంది. ఈ విషయంలో కేటీఆర్‌ ‌హూందాతనం ప్రదర్శించారు.

Leave a Reply