Take a fresh look at your lifestyle.

స్టీల్‌ప్లాంట్‌ను మూతపడనియ్యం.. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: సీతారాం ఏచూరి

ప్రైవేటీకరణతో ప్రజలకు సేవ చేయలేం.. అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయకరణ ప్రారంభం అయ్యింది : సీతారాం ఏచూరి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, ఆగస్ట్ 3 : ‌విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మూతపడనియ్యమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు మనందరి హక్కు అని అన్నారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ‌పరిరక్షణ కోసం జరిగే ఉద్యమంలో సిపిఎం కలిసి ఉంటుందని వాగ్ధానం చేస్తోందన్నారు. వైజాగ్‌ ‌స్టీల్‌ప్లాట్‌ ‌ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న చలో ఢిల్లీ ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. ఏపి భవన్‌లో జరిగిన ఆందోళనకు సిపిఎం, సిపిఐ, టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌, ‌సిపిఐఎంఎల్‌, ‌జెఎన్‌యుఎస్‌యు, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలోనూ, తరువాత దాని కాపాడుకునే ఉద్యమంలోనూ సిపిఎం భాగస్వామ్యం ఉందని, ఆయా ఉద్యమాలను బలపరిచిందని తెలిపారు. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కూడా తమ భాగస్వామ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని పార్లమెంట్‌ ‌లోపల, వెలుపల బలపరుస్తామనన్నారు. ప్రజల వీరోచిత పోరాటంతో ఏర్పాడిన స్టీల్‌ప్లాంట్‌ను అమ్మనియ్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే కథలన్ని చాలా విన్నామని, ప్రైవేటీకరణతో లూటీ తప్ప, విస్తరణ ఎక్కడా జరగలేదని, జరగదని తెలిపారు.

కార్పొరేట్ల లాభాల కోసం చేసే ప్రక్రియలో భాగంగానే జరుగుతోందని విమర్శించారు. దాన్ని తాము సాగనియ్యమని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇంగ్లాండ్‌ ‌ప్రధాని మార్గరెట్‌ ‌థాచర్‌ ‌ప్రభుత్వం వ్యాపారం చేయదని అన్నారని, అలాంటి ఇంగ్లాండ్‌లోనే ప్రైవేట్‌లో ఉన్న బ్రిటిష్‌ ‌రైల్వే తిరిగి జాతీయకరణ చేస్తున్నారని మోడీ సర్కార్‌ ‌తెలుసుకోవాలని హితవు పలికారు. మార్గరెట్‌ ‌థాచర్‌ ‌చెప్పిన అంశాన్ని అమలు చేస్తోన్న మోడీ సర్కార్‌, అదే ఇంగ్లాండ్‌లోని జరుగుతున్న రైల్వే జాతీయకరణ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలంటే ప్రైవేటీకరణ వల్ల కుదరదని అన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లో తిరిగి జాతీయకరణ జరుగుతుందని తెలిపారు. స్పెయిన్‌ ‌తన ప్రైవేట్‌ ‌వైద్య సౌకర్యాలను జాతీయకరణ చేసిందని, దాన్ని చూసి మోడీ సర్కార్‌ ‌నేర్చుకోవాలని హితవు పలికారు.దేశ సంపదను అమ్ముకోవడం, లూటీ చేయడం కాకుండా, పరిపాలన అంటే ప్రజలకు సేవ చేయడమని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం పని చేయడమని స్పష్టం చేశారు. ఆ రకంగా విధానాలు అమలు చేయాలని, అంతేతప్ప మోడీ, తన కార్పొరేట్‌ ‌మిత్రుల లాభాల కోసం దేశ సంపదను అమ్మడం కాదని స్పష్టం చేశారు. దేశ సంపదకు ప్రజలే యజమానులని, ప్రభుత్వాలు కేవలం మేనేజర్లు మాత్రమేనని అన్నారు. యజమాని అంగీకారం లేకుండా, ఏ మేనేజర్‌ అమ్మలేడని తెలిపారు. ఒకవేళ అమ్మాలని ప్రయత్నిస్తే ఆ మేనేజర్‌ను దించేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం తప్పుడు పద్దతిలో జరుగుతోందని, న్యాయస్థానాల్లో సవాల్‌ ‌చేస్తారని తెలిపారు. బిల్లులను పరిశీలించేందుకు స్టాండింగ్‌ ‌కమిటీలకు కూడా పంపించటం లేదని, ఏ వేదికపైకి కూడా చర్చకు వెళ్లటం లేదని అన్నారు. దీన్ని తాను పార్లమెంట్‌లో ఉన్నప్పుడే మెజార్టీ వల్ల కలిగిన దౌర్భగ్యమని అన్నట్లు తెలిపారు.

మోడీ సర్కార్‌ ‌నైతిక పరాజయం ః పి.మధు
వైజాగ్‌ ‌స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం జరిగితే, మోడీ దేశాన్ని అమ్మేస్తాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విశాఖ ఉక్కును అమ్మడానికి ప్రయత్నించిన మోడీ సర్కార్‌ ‌నైతిక పరాజయం పొందిందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాన్న కార్మికులకు నైతిక మద్దతు లభించిందని తెలిపారు. ఎవరు వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని సాగనివ్వమని విశాఖ ప్రజలు ఘంటాపదంగా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, విశాఖ ఉక్కు అమ్మకం జరిగితే, దేశాన్ని కూడా మోడీ సర్కార్‌ అమ్మేస్తోందని ధ్వజమెత్తారు. దేశాన్ని అమ్మనియమని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చామన్నారు. ఆనాడు కమ్యూనిస్టులు అసెంబ్లీలో రాజీనామాలు చేశారని, ఇప్పుడు ఏపిలోని 13 జిల్లాలకు ఉద్యమాన్ని విస్తరింపచేస్తామని అన్నారు. ఇది విశాఖ సమస్య కాదని, ఏపి సమస్య..ప్రభుత్వ రంగ సమస్య అని పేర్కొన్నారు. లక్షల కోట్ల విలువ చేసే సంపదను అమ్మడానికి ఎవరి సొత్తని, దాన్ని అమ్మడానికి వీళ్లేదని చెప్పడానికే ఇక్కడికి వచ్చామన్నారు. కార్మిక సంఘాలన్ని ఐక్యత వల్లనే ఉద్యమం జయప్రదం అవుతుందని అన్నారు. కార్మిక వర్గానికి దేశ దేశాల చరిత్రను మార్చేసే శక్తి ఉందని, ఏడేళ్ల మోడీ పిల్లకాకికి అసలు విషయం అర్థం కావటం లేదని అన్నారు. ఏదో అనుకుంటున్నారని, కార్మిక శక్తిని చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమెరికా ప్రపంచీకరణ పప్పులు ఉడకవని, దేశాలపై యుద్ధాలు చేసే విధానం ఉన్న అమెరికా వాడు తోకముడవాల్సి వచ్చిందని అన్నారు. అమెరికా వాడి కాష్టం కాలాలని ప్రపంచ దేశాల ప్రజలు చూస్తున్నారని, దేశంలోని ప్రజలు మీ గురించి అలానే చూస్తున్నారని, అది మోడీ సర్కార్‌కు అర్థం కావటం లేదని అన్నారు. ఆర్థిక సంస్కరణలు ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, దాన్ని సవాల్‌ ‌చేసే శక్తులు ముందుకు వచ్చాయని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు సృష్టించిన సంపదను, వాడబ్బ సొమ్ములా ఒకడొచ్చి ప్రైవేటీకరణ అంటాడు, మరొకడు షేర్లు అమ్మకం అంటాడు అని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ సంఘాల నేతలకు, కార్మికులకు సిపిఎం జేజేలు పలుకుందని అన్నారు.

జగన్‌, ‌చంద్రబాబు కలిసి పోరాడాలిః కె.రామకృష్ణ
స్టీల్‌ప్లాంట్‌ ‌పరిరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కలిసి పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతానని మోడీ పదేపదే చెబుతున్నాడని, దానిపై ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా కాలంలో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు 150 మంది వరకు చనిపోయారని, అయినా వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తోన్నారని అన్నారు. మన ఉద్యమ కేక నరేంద్ర మోడీకి వినపడాలంటే, అది పార్లమెంట్‌లోనే జరగాలని తెలిపారు. ఏపికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మైకుల్లో చెబుతున్నారని, దాన్ని ఆహ్వానిస్తామని, కానీ వారందరూ ఏకోన్ముముఖంగా పార్లమెంట్‌ను స్తంభింప చేస్తే మోడీ ముందుకు పోతాడా? అని ప్రశ్నించారు. అందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ రావాలని, మీకు ఇంతకంటే పెద్ద పని అక్కడేం లేదని అన్నారు. ఇంతకంటే పెద్దపని ఉందా? ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద ప్రధాన బాధ్యత ఉందని, మోడీకి జంకకుండా కార్మికులు ఎలా అయితే ఉద్యమిస్తోన్నారో..వారి పోరాటాన్ని గుర్తించి మీరు కూడా చేతులు కలపాలి. ప్రత్యక్షంగా పోరాటంలోకి రావాలి. నరేంద్ర మోడీని నిలదీయాలి. అప్పుడు మాత్రమే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలమని అన్నారు. కార్మికులు ఢిల్లీకి వస్తే హోటల్స్‌ను ఖాళీ చేయిస్తున్నారని, ఢిల్లీ ఏమైనా మీ అబ్బదంటా? ఢిల్లీ మాది కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, కానీ మోడీ సర్కార్‌ ‌ఢిల్లీ పోలీసులు రోడ్లపై తిరగనివ్వరా?, శాంతియుతంగా ఉద్యమిస్తే సైన్యాన్ని పెట్టినట్లు భద్రతా దళాలను దించుతారా? అని ప్రశ్నించారు. తెలుగువాడనుకునే ప్రతిఒక్కడూ సిగ్గు శరం ఉంటే బయటకు రావాలని అన్నారు. అందరికంటే ముందు ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత బయటకు రావాలి. ఎంపిలంతా మోడీ సర్కార్‌ను పార్లమెంట్‌లో నిలదీయాలని, సాధించుకోవాలని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌పోయిందంటే, తెలుగువాడు ముఖం ఎత్తుకొని తిరగడానికి లేదని పేర్కొన్నారు. పూర్వీకులు పోరాడి సాధించుకున్న పరిశ్రమను, మన హాయంలో పోగొట్టుకున్నవాళ్లం అవుతామని అన్నారు. పోరాటానికి అండగా ఉంటామని, అవసరమైతే జైళ్లకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

ప్రజల జీవితాలను అమ్మడమే ః ఐషీఘోష్‌
‌స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడమంటే, ప్రజల జీవితాలను అమ్మడమేనని జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షురాలు ఐషీఘోష్‌ ‌పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ‌కార్మికుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఇదేదో స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఉద్యమమే మాత్రమే కాదని, ఇది దేశ ప్రజల ఉద్యమమని అన్నారు. మోడీ సర్కార్‌ ‌దేశంలోని స్టీల్‌ప్లాంట్‌ ‌లాంటి ప్రభుత్వ సంస్థలను మాత్రమే అమ్మటం లేదని, ప్రజల జీవితాలనే అమ్మేస్తున్నారని విమర్శించారు. కనుక ఇది స్టీల్‌ప్లాంట్‌ ‌సమస్య మాత్రమే కాదని, ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య అని తెలిపారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఉద్యమిస్తోన్నారని, కానీ సమస్యలు పరిష్కరించకుండా యుఎపిఎ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తే, విద్యార్థులపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని తెలిపారు. వైజాగ్‌ ‌స్టీల్‌ప్లాంట్‌ ‌కోసం జరిగే పోరాటంలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తు చేశారు. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ ప్రజా పోరాటం అంతం కాదని, ఇది ప్రారంభమని తెలిపారు. మోడీ సర్కార్‌ ‌ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

రాజీనామాలకు సిద్ధం:టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ ‌నాయుడు
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని టిడిపి లోక్‌సభ పక్షనేత కె.రామ్మోహన్‌ ‌నాయుడు తెలిపారు. విశాఖ ఉక్కు కోసం కదంతొక్కుతూ ముందుకు నడుస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని అన్నారు. ప్రజల సొత్తు అయిన స్టీల్‌ప్లాంట్‌ను ఢిల్లీలో ఎసి రూముల్లో కూర్చోని అమ్మేస్తామంటే తెలుగు ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రజలను చిన్న చూపు చూస్తోందని, రాష్ట్ర విభజనలోనూ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, ‌విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోనూ అదే జరిగిందని అన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం, ఏపికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. మోడీ ఒకే దేశమని చెబుతారని, అలాంటప్పుడు ఒకే న్యాయమని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమన్నారని టిడిపి ఎంపి కేశినేని నాని అన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 32 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని చెప్పారు. కార్మికులు, ప్రజల సంపద విశాఖ ఉక్కు అని.. దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణకు టిడిపి పూర్తి వ్యతిరేకమని చెప్పారు. పార్లమెంట్‌లో దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి టిడిపి ముందు కెళ్తుందని అన్నారు.

మోడీ వైఖరి రాజ్యాంగ విరుద్ధంః వడ్డే శోభనాధ్రీశ్వరరావు
మోడీ సర్కార్‌ ‌వైఖరి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా చర్యలు చేపడుతుందని, ఏపి శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని కూడా మోడీ సర్కార్‌ ‌పట్టించుకోవటం లేదని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని, కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిద్దాం
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిద్దామని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుందని, ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని అన్నారు. ఒక సంవత్సరం పాటు దీన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని, అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం కొనసాగాలన్నారు.

రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏర్పాడిందిః వి.హనుమంతరావు
స్టీల్‌ప్లాంట్‌ ‌కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏర్పాడిందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు అన్నారు. ఎన్నికల ముందు కార్పొరేట్లకు ఇచ్చిన హామీల అమలులో భాగంగానే మూడు వ్యవసాయ చట్టాలను మోడీ తీసుకొచ్చారని విమర్శించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జరుగుతుందని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌తో అది మొదలైందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులపై మోడీ కన్ను పడిందని, అందుకే ప్రైవేటీరణ చేస్తున్నారని అన్నారు. వైసిపి, టిడిపి రాజీనామాలు చేస్తే దేశం కదులుతుందని, మోడీ కదులుతాడని తెలిపారు.

ఏపి భవన్‌లో తీవ్ర ఆంక్షలు
స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఉద్యమం నేపథ్యంలో ఏపి భవన్‌లో తీవ్ర ఆంక్షలు ఏపి భవన్‌ అధికారులు విధించింది. ఎక్కడిక్కడే రాకుండా మార్గాలన్ని మూసివేశారు. మీడియా ప్రతినిధులు సైతం తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. గుర్తింపు కార్డులు చూపించిన లోపలికి అనుమతించలేదు. ఎంతో కష్టం మీద చేరుకోవల్సి వచ్చింది. కొంత మంది స్టీల్‌ప్లాట్‌ ఉద్యోగులు సైతం బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఏపి భవన్‌ ‌ప్రజలందరదని, అధికారులది కాదని, అలాంటప్పుడు ఎందుకు అనుమతించరని స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు ప్రశ్నించాల్సి వచ్చింది. ఏది అడిగినా అధికారుల ఆదేశాలతోనే చేస్తున్నామని బందోబస్తులో ఉన్న పోలీసులు తెలిపారు. కొంత ఏపి భవన్‌కు బయట ఢిల్లీ పోలీసులు, ఏపి భవన్‌ ‌లోపల ఏపి పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపట్ల స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, మద్దతు తెలపడానికి వచ్చిన కొంత మంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టీల్‌ ఉద్యమంలో మహాత్మా గాంధీ
స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రత్యక్షమైయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన బిఎస్‌ఎన్‌ఎల్‌ ‌రిటైర్ట్ ఉద్యోగి జి.తిరుపతయ్య గాంధీ వేషధారణతో ఉద్యమంలో పాల్గొన్నారు. గత రెండు రోజులుగా ఆయన ఉద్యోగుల ఉద్యమంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మొదలైనప్పుడు విశాఖపట్నం వెళ్లి సంఘీభావం తెలిపానని, అక్కడ కూడా మహాత్మా గాంధీ వేషధారణతో దాదాపు పది రోజుల పాటు పాల్గొన్నానని అన్నారు. సొంత ఖర్చులతో ఢిల్లీ వచ్చానని, మోడీ సర్కార్‌ ‌బిఎస్‌ఎన్‌ఎల్‌, ‌బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ ‌పరం చేస్తుందని తెలిపారు. గతంలో కరోనా, పర్యావరణ పరిరక్షణకు కూడా గాంధీ, అల్లూరి సీతారామ రాజు వంటి వేషధారణతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌ ‌కుమార్‌, ‌రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, దడాల సుబ్బారావు, మంతెన సీతారాం, డి.రమాదేవి, సిపిఎం రాజమండ్రి జిల్లా కార్యదర్శి అరుణ్‌ ‌కుమార్‌, ‌రైతు సంఘం నేతలు పి.నరసింహరావు, రావుల వెంకయ్య, రాజ మోహన్‌, ‌సిపిఐ జాతీయ కార్యదర్శ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ ‌కౌర్‌, ‌సిపిఐఎంఎల్‌ ‌పోలిట్‌ ‌బ్యూరో సభ్యులు ప్రభావతి, ఆంధ్రా మేథావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, ‌వైసిపి ఎంపిలు ఎంవివి సత్యన్నారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి, వంగా గీతా, చింతా అనురాధ, శ్రీధర్‌, ‌మార్గాని భరత్‌, ‌తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ‌స్టీల్‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట కమిటీ నేతలు సిహెచ్‌ ‌నర్శింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, అయోద్య రామ్‌, ఐద్వా నేత పుణ్యవతి, ఎఐఎడబ్ల్యుయు నేత బి.వెంకట్‌, ‌కాంగ్రెస్‌ ‌మహిళ నేత సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply