ఆందోళనలో ఆనాటి అమరుడు అమృతరావు మనుమలు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్ కారణంగా విశాఖలోని కూర్మన్నపాలెం సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ, వామపక్షాలతో సహా పలు రాజకీయపార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆనాడు స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసిన అమృతరావు మనుమలు కూడా బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమం కోసం బంద్‌లు చేయడం, ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం రోడ్డున పడడం అంటే ప్రభుత్వ పెద్దలందరికీ సిగ్గుచేటని, ఇది ప్రజలను అవమానించడమేనని అన్నారు.
ఆనాడు కూడా ’విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’అని అమృతరావు తన ప్రాణాన్ని పణంగా పెట్టి స్టీల్ ప్లాంట్ సాధించారన్నారు. న్యాయమైన కోరిక కోసం ప్రాణాలు బలిచేయాల్సి వస్తోందని, మనుషులు చస్తే చూద్దామనే విధానం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రజలకు అండగా ఉంటుందన్నారు. సీఎం జగన్ ఏమన్నా చేయదల్చుకుంటే విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, లేని పక్షంలో స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు.