Take a fresh look at your lifestyle.

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే

  • డేటా భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపండి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ప్రజల నుంచి వివరాలు నమోదు చేయడంలో బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పేర్కొంది. ధరణి పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలలో లోపాలపై దాఖలైన మూడు పిటిషన్‌లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో యజమానులకు సంబంధించిన వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూములు వివరాలు నమోదు చేయడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడింది. ధరణి పోర్టల్‌లో డేటా భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదనీ, ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలు దుర్వినియోగమైతే వాటి భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది.

ఏ చట్టం ఆధారంగా ఆధార్‌, ‌కులం వివరాలను సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ప్రజల ఆస్తుల డేటా భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌హైకోర్టుకు తెలిపారు. డేటా భద్రతపై ప్రజలకు ధరణి పోర్టల్‌లో ఎలాంటి ప్రస్తావన లేని కారణంగా ఇప్పటి వరకు సేకరించిన వివరాలను థర్డ్‌పార్టీకి ఇవ్వొద్దని తెలిపింది.   గూగుల్‌ ‌ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్‌లు ఉన్నాయని హైకోర్టుకు పిటిషనర్‌ ‌తెలిపారు. దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని పేర్కొంది. రెండు వారాల్లో కౌంటర్‌ ‌ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకూ ఎలాంటి వివరాలను నమోదు చేయవద్దని సూచించింది. ప్రజల నుంచి వివరాలు నమోదు చేయడంలో బలవంతం చేయవద్దని ఆదేశించింది. దీంతో కౌంటర్‌ ‌దాకలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌కోర్టును కోరారు. దీంతో చట్టభద్రత, డేటా భద్రతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply