“భారత దేశ చరిత్రలో తొలిసారిగా 500కు పైగా రైతు సంఘాలు ఏకతాటి మీదికి వచ్చి చట్టాలను రద్దు చేయడానికి ఉద్యమించడం రైతుల సంఘటిత శక్తికి తార్కాణం. వీరికి తోడుగా ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా నైతిక మద్దతు ఇవ్వడం ఉద్యమ బలోపేతానికి మూల కారణం. కానీ అన్నం పెట్టే అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతూ భవిష్యత్ తరాలకు ఆహారభద్రత కోసం ఉద్యమాలు చేస్తుంటే ఏమీ పట్టనట్టు దేశ ప్రజలు మౌనంగా ఉండడం ఒకింత బాధాకరం. ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచి వేయడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేయడం, లాఠీచార్జిలకు పాల్పడటం, వందలాది మందిని అరెస్టు చేసి రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించడంతో ఉద్యమానికి ఇతర దేశాల నుండి సైతం మద్దతు లభించడం, ప్రజలు శాంతియుత నిరసనలు తెలిపే హక్కులు కలిగి ఉంటారని, వారిని అడ్డుకోవద్దని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రకటించడాన్ని బట్టి పాలక వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు.”
రైతే రాజు, దేశాభివృద్ధికి వెన్నెముక, రైతు సంక్షేమమే దేశ సంక్షేమమనీ.. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని, అన్నదాతలను ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆదుకుంటామని అందలమెక్కిన పాలకులు పదే పదే ప్రగల్భాలు పలుకుతూ గ్రామీణ వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసే విధంగా, వ్యవసాయ రంగంను సంక్షోభంలోకి నెట్టి అత్యధికంగా నూటికి 65 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న చిన్న సన్నకారు రైతులను కనుమరుగు చేసేందుకు, వారి జీవితాలను దుర్భర పరిస్థితిలోకి తోసివేసే విధంగా వ్యవసాయ రంగాన్ని అప్పనంగా కార్పొరేట్ల చేతిలో పెట్టే విధంగా జూన్ 2020లో విపత్కర పరిస్థితుల్లో రైతులకు, వ్యవసాయానికి సంబంధించి మూడు ఆర్డినెన్స్‌లను మోడీ ప్రభుత్వం తెచ్చింది. వీటిని బిల్లు రూపంలో ప్రవేశపెట్టి మెజారిటీ సభ్యుల బలం లోక్‌సభలో ఉన్నదని ఎటువంటి చర్చలకు తావివ్వకుండా బిల్ పాస్ చేయించుకొని, 13 పార్టీలు వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని తీర్మానించినా, 243 మంది సభ్యులున్న ప్రస్తుత రాజ్యసభలో సగానికిపైగా వ్యతిరేకించినా ఆగమేఘాలపై రాజ్యసభలో వ్యవసాయరంగ బిల్లులను ఆమోదించిన తీరు భారత పార్లమెంట్ చరిత్రలో ఒక మాయని మచ్చ లాగా మిగిలిపోతుంది.
చిన్న, సన్నకారు రైతులు భారతదేశంలో 85 శాతంగా ఉన్నారని వారు తమ పొలాల్లోనే కూలీలుగా మారే అవకాశం ఉందని, కనీస మద్దతు ధర నుండి తప్పుకునేందుకు, వ్యవసాయ మార్కెట్లు దెబ్బతింటాయని, కాంట్రాక్టు వ్యవసాయం ప్రవేశపెట్టడానికి ఒకే దేశం- ఒకే మార్కెట్ అనే గుత్తాధిపత్యంతో జాతి సంస్థలకు, వారికి దళారులుగా వ్యవహరించే కార్పొరేట్ పెత్తందార్లకు దాసోహం అనే విధంగా 2020 సెప్టెంబర్ 15, 18న లోక్‌భలో, 20, 22న రాజ్యసభలో ఈ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. ఈ నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం…పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసనలు చేయడం జరిగింది. క్రమక్రమంగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్‌తోపాటు ఆంధప్రదేశ్లలో మరియు దేశవ్యాప్తంగా రైతులందరూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈ చట్టాల వలన పంటలకు కనీస మద్దతు ధర గురించి రైతు భరోసా, ప్రజలకు ఆహార భద్రతలు ప్రభుత్వ బాధ్యతల నుండి తొలగిపోతాయని అవి కార్పొరేట్ల చేతిలోకి పోయే ప్రమాదం ఉందని, వ్యవసాయ రంగాన్ని ఉరి తీసే నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమబాట పట్టారు. ముఖ్యంగా కార్పొరేట్ వ్యవసాయంతో, హరిత విప్లవం ఫలితంగా వ్యవసాయ చేదు అనుభవాలను చవిచూసిన పంజాబ్, హర్యానా రైతులు సమరశీల ఉద్యమాన్ని కొనసాగించారు. 96 వేల వేలాది ట్రాక్టర్ల ద్వారా, దాదాపు కోటి 20 లక్షల మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీని నలువైపులా ముట్టడించడం జరిగింది. నవంబర్ 26న ప్రారంభమైన రైతు ఉద్యమంలో కందకాలను, బారికేడ్లను చేదించుకుని, టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి దాడులను తప్పించుకొని, భద్రతాదళాల అడ్డంకులను దాటి రైతులు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే మహా గొప్ప పోరాటంగా దీనిని చిత్రీకరించొచ్చు.
ఈ పోరాట ఉద్యమంలో 44 మందికి పైగా రైతులు తమ ప్రాణాలనుపణంగా పెట్టి అమరులైనారు.. ఎముకలు కొరికే చలిలో, రక్తం గడ్డ కడుతున్నా పరిస్థితుల్లో వయసు ఉడిగి పోయిన పెద్దవారు కూడా ఉద్యమ కథన రంగంలో మొక్కవోని దీక్షతో గత 48 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తుంటే సమస్యలను పరిష్కరించకుండా మొండి వైఖరితో నాలుగైదు దఫాలుగా కంటితుడుపు చర్చలు జరపడం, విఫలం అయ్యే విధంగా చర్చించడం, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సాగదీస్తూ వస్తున్న సంగతి విధితమే. భారత దేశ చరిత్రలో తొలిసారిగా 500కు పైగా రైతు సంఘాలు ఏకతాటి మీదికి వచ్చి చట్టాలను రద్దు చేయడానికి ఉద్యమించడం రైతుల సంఘటిత శక్తికి తార్కాణం. వీరికి తోడుగా ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా నైతిక మద్దతు ఇవ్వడం ఉద్యమ బలోపేతానికి మూల కారణం. కానీ అన్నం పెట్టే అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతూ భవిష్యత్ తరాలకు ఆహారభద్రత కోసం ఉద్యమాలు చేస్తుంటే ఏమీ పట్టనట్టు దేశ ప్రజలు మౌనంగా ఉండడం ఒకింత బాధాకరం. ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచి వేయడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేయడం, లాఠీచార్జిలకు పాల్పడటం, వందలాది మందిని అరెస్టు చేసి రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించడంతో ఉద్యమానికి ఇతర దేశాల నుండి సైతం మద్దతు లభించడం, ప్రజలు శాంతియుత నిరసనలు తెలిపే హక్కులు కలిగి ఉంటారని, వారిని అడ్డుకోవద్దని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రకటించడాన్ని బట్టి పాలక వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చర్చలకు దిగి వచ్చి కొన్ని విషయాలకు, సవరణలకు రాతపూర్వక హామీలను ఇస్తామని, రద్దు చేయడం కుదరదని మొండి వైఖరి అవలంబించడం జరిగింది. చట్టాల అమలు తీరు సరిగా లేని ఈ రోజుల్లో రాజ్యాంగ మౌలిక విలువలకు విరుద్ధంగా పలు నిర్ణయాలు జరుగుతున్న నేపథ్యంలో రాతపూర్వక హామీలకు భద్రత ఎక్కడిదని, రైతులు సాగు చట్టాల రద్దుకి పట్టుబట్టడం జరిగింది. ఈ తరుణంలో రైతు ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డారని వారివల్లే ఉద్యమం జరుగుతుందని ప్రచారం చేస్తూ రైతు ఉద్యమ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అసత్య అబద్ధపు ప్రచారాలతో పోరాట స్ఫూర్తిని నీరుగార్చాలని, రైతు ఉద్యమంలో సంఘాల మధ్య, నాయకత్వం మధ్య చీలికలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయినా రైతుఉద్యమం ధైర్యాన్ని కోల్పోలేదు, వెనుక అడుగువేయకుండా పోరాటం చేస్తూనే ఉండటం వారి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం, ఆచరణీయం.
ఈ చారిత్రక పోరాట ఫలితమే నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి సారథ్యంలోని ధర్మాసనం ఈ నూతన వ్యవసాయ సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, వాటిని నిరవధికంగా నిలిపివేయడం లేదని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని తీర్పు ఇవ్వడం ఈ మహాపోరాట పాక్షిక విజయంగా భావించవచ్చు. అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ,ఆ కమిటీలో జితేంద్ర సింగ్ మాన్ (బికేయూ అధ్యక్షుడు), డాక్టర్ ప్రమోద్ కుమార్ జ్యోశి(ఇంటర్నేషనల్ పాలసీ హెడ్), అశోక్ గులాటి(అగ్రికల్చర్ ఎకనామిస్ట్), అనిల్ ధన్వంతి(శివకేరి సంఘటన) లు కమిటీ సభ్యులుగా ఉంటారని గౌరవ సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా రైతుల తరపున వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ పిటిషన్లు వేసినట్లే అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలు వినిపిస్తూ కోర్టు ఏర్పాటు చేసి ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలని అనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్లు గౌరవ సుప్రీం కోర్టుకు విన్నవించారు అంటే కమిటీలతో కాలయాపన అవుతుందని. సమస్య సత్వర పరిష్కారం కాదని రైతులు భావించి… ప్రధాని స్వయంగా చర్చలు జరపాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలదే రాజ్యాధికారమని, ప్రజల బాగోగులు ఆస్తుల పరిరక్షణలో భాగంగానే, రైతుల జీవనోపాధికి ముప్పు తలపెడుతున్న నూతన వ్యవసాయ సాగు చట్టాలను తక్షణమే రద్దుచేసి ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు స్వస్తి చెప్పినప్పుడే భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో గౌరవ ప్రధాని పేర్కొన్నట్లు ఉంటుంది. వ్యవసాయరంగ నిపుణులు శాస్త్రవేత్త స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయానికి అయిన మొత్తం ఖర్చుకు యాభైశాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించే నూతన చట్టం తీసుకువచ్చి భారతీయ రైతుల లో నూతన సంక్రాంతిని తీసుకురావాలని, అప్పుడే దేశం సుస్థిరంగా సుఖశాంతులతో విలసిల్లుతుందని లేనిచో రైతాంగ ఉద్యమం తీవ్రతరమై మరో జాతీయ పోరాటం అనివార్యం అవుతుందని మేధావులు, ప్రజాస్వామిక వాదులు అభిప్రాయపడుతున్నారు.
– సత్యఫుల్లు, మహబూబాబాద్