Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకలు

  • కేక్‌కట్‌ ‌చేసి తెరాస శ్రేణుల సంబురాలు
  • ఆలయాల్లో మంత్రుల ప్రత్యేక పూజలు
  • శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, ‌పలు రాష్ట్రాల సిఎంలు, మంత్రుల
  • రాష్ట్రవ్యాప్తంగా కోటి వృక్షార్చనలో పాల్గొన్న నేతలు
  • తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం

‌రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా కేక్‌లు కట్‌చేసి అపరభగీరథడు కేసీఆర్‌ అం‌టూ తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో రక్తదాన, వైద్య శిబిరాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయాల్లోనూ కేక్‌ ‌కట్‌చేసి సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కొవింద్‌కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై, అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, తదితరులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కెసిఆర్‌ ‌కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా, కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ తదితరులు ట్విటర్‌ ‌వేదికగా కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ ‌తెలిపారు. అలాగే కెసిఆర్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రివాల్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌, ‌కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ ‌యెడ్యూరప్ప, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ ‌కుమార్‌ ‌తదితరులు ట్విట్టర్‌ ‌ద్వారా సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ ‌చెప్పారు. ఏపీ సిఎం జగన్మోహన్‌ ‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. కేసీఆర్‌కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో కొనసాగాలని జగన్‌ ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

Statewide KCR birthday celebrations

వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి, మాజీమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, విద్యుత్‌ ‌శాఖా మంత్రి జగదీష్‌ ‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే సంజీవరావు, జనసేన పార్టీ అధినేత, సినీ నటులు చిరంజీవి, మహేశ్‌ ‌బాబు, పవన్‌ ‌కల్యాణ్‌ ‌ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ ‌నగరంలోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకల్లో తలసాని శ్రీనివాస యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. బల్కంపేట అమ్మవారికి బంగారు చీరను కానుకగా అందచేసారు. సీఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజును తెరాస శ్రేణులు రాష్ట్ర పండుగగా జరుపుకున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, దేవాలయాల్లో పూజలు, రోగులకు పండ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేపట్టారు.

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌కార్మిక విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేక్‌ ‌కట్‌ ‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకలను వివిధ దేశాల్లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించారు. అటు ఎన్నారై టీఆర్‌ఎస్‌ ‌సెల్‌ ఆధ్వర్యంలో బహ్రెయిన్‌, ఆ‌స్ట్రేలియా దేశాల్లో కేక్‌ ‌కట్‌ ‌చేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ ‌బర్త్‌డే వేడుకలు జరిగాయి. కేసీఆర్‌ ‌బర్త్‌డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటారు. ఎంపి సంతోష్‌ ‌పిలుపు మేరకు గంటలో కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చనకు మంచి ఆదరణ లభించింది. ఊరూవాడా మొక్కలు నాటి అభిమాన నేత కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కోటి వృక్షార్చలనో పాల్గొన్నారు. కోటివృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టూరిజం అండ్‌ ‌హాస్పిటలాలిటీ మేనేజ్‌మెంట్‌లో సీఎస్‌ ‌టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీ‌నివాస్‌తో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీహెచ్‌ఎం ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌చిన్నంరెడ్డి, టూరిజం మేనేజ్‌మెంట్‌ ‌విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

పోరాటధీరుడు మా నాన్న : శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌, ‌కవిత ‘రాష్ట్రాన్ని సాధ్యం చేసేందుకు అన్ని అవరోధాలను ఎదురించిన పోరాట ధీరుడాయన. ప్రేరణాత్మక ఉద్యమాలతో అసాధారణ నేతగా ఆవిర్భవించిన వ్యక్తి.. ఇప్పుడు ఓ అసామాన్య పరిపాలకుడు.. విజినరీ అన్న పదానికి మహోన్నత ఉదాహరణగా నిలిచే లివింగ్‌ ‌లెజెండ్‌ ఆయన. ఆ అపూర్వమైన వ్యక్తిని నాన్న అని సగర్వంగా పిలుస్తాను’ అంటూ సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌ ‌పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇవాళ 68వ పడిలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్‌ ‌చెబుతూ ఓ పోస్టు చేశారు. మనవరాలు అలేఖ్యతో కలిసి కేసీఆర్‌ ‌దిగిన ఫోటోను కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేస్తూ ముకుళిత హస్తాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. ‘నా జన్మదాతకు, నిత్య స్ఫూర్తిప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు’ అని కవిత ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply