Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
జంట నగరాల్లో భారీ వర్షం..నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌
‌ప్రమాదకరస్థాయిలో కాగ్నా ప్రవాహం
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద
పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం..పదిగేట్లు ఎత్తిన అధికారులు
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఈ క్రమంలో కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులంతా హెడ్‌ ‌క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కూడా వానలు ముంచెత్తాయి.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం, గొల్కోండ ప్రాంతాల్లోని నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలో స్థానికులు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్సేన్‌ ‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో జీహెచ్‌ఎం‌సీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లో వర్షపు నీరు నిలవడంతో.. ప్రమాదవశాత్తు ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగర వ్యాప్తంగా జీహెచ్‌ఎం‌సీ, డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జలాశయాలన్నీ నీటితో తొణికిసలాడుతున్నాయి. మక్తల్‌ ‌మండలం సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు.. 10 గేట్లు పూర్తిగా ఎత్తివేత దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ మండలంలోని అప్పరెడ్డి గూడ, నర్సప్పగూడ గ్రామాల్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సింబయాసిస్‌ ‌యూనివర్సీటీతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 50.3 మి. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నందిగామ మండలంలో 189.0 మిల్లీటర్లు, ఫరూఖ్‌నగర్‌లో 150.0 మి.., కొత్తూరులో 148.0 మి.., షాబాద్‌లో 135.5 మి.. చొప్పున వర్షపాతం నమోదయ్యింది. శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో రాష్ట్రంలోనే అత్యధికంగా నందిగామ మండలంలో 18.9 సెం.. వర్షపాతం నమోదయ్యింది.

జంట నగరాల్లో భారీ వర్షం..నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌ ‌సాగర్‌ ‌జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా జలాశయం నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 513 టర్లకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను అలర్ట్ ‌చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, భారీ వర్షాల కారణంగా నగరం మొత్తం జలమయం అయింది. రోడ్లన్నీ జలదిగ్బంధం అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మ్యాన్‌ •ల్స్ ‌కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఓ చిన్నారి మ్యాన్‌ •ల్‌లో పని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో.. ఎక్కడ మ్యాన్‌ •ల్స్ ‌తెరిచి ఉన్నాయో తెలియక భయం భయంగా అడుగులు వేస్తున్నారు.

ప్రమాదకరస్థాయిలో కాగ్నా ప్రవాహం
తాండూర్‌ ‌నియోజకవర్గం పరిధిలో ఉన్న కాగ్నా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. రహదారిపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో తాండూర్‌ – ‌మహబూబ్‌నగర్‌ ‌మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వికారబాద్‌ ‌జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం నమోదయ్యింది. దీంతో కోట్‌పల్లి, శివసాగర్‌ ‌చెరువు, సర్పంపల్లి, లక్నాపూర్‌ ‌ప్రాజెక్టులు అలుగుపోస్తున్నాయి. దీంతో దిగువ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలకు వికారాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి. పరిగి మండలం లఖ్నాపూర్‌ ‌ప్రాజెక్టు మూడవ సారి భారీ ఎత్తున పొంగి పొర్లుతోంది. గొడుగోని పల్లి వాగు పొంగడంతో రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూబ్‌ ‌నగర్‌ ‌కుల్కచర్ల రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు పూర్తిగా బంద్‌ అయ్యాయి. నస్కల్‌ ‌వాగు పొంగడంతో వికారాబాద్‌ ‌రహదారి వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వికారాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా కూడా శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఓ నిండుగర్భిణి ప్రసవం కోపం పడరాని పాట్లు పడింది. బషీరాబాద్‌ ‌మండలంలోని జీవన్గి గ్రామానికి చెందిన ఓ మహిళకు నెలలు నిండాయి. పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. కానీ ఆ గ్రామ సపంలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో.. అంబులెన్స్ ‌వెళ్లలేకపోయింది. దీంతో గర్భిణిని స్థానికుల సహాయంతో స్ట్రెచర్‌పై పడుకోబెట్టి.. వాగును దాటించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో మండల కేంద్రంలోని దవఖానాకు తరలించారు.

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద..రాయచూరు ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు
ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రహదారుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాకపోకలు ఆగిపోయాయి. మహబూబ్‌నగర్‌- ‌నవాబ్‌పేట, వనపర్తి జిల్లా కొత్తకోట- ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌ ‌రాయచూరు ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడం కొద్ది సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 13 గేట్లు ఎత్తి దిగువనకు 1.26లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్‌ ‌నిండటంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోసారి కోయిల్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్టు నిండిపోవడంతో 5 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్‌ ‌ప్రాజెక్టు 2ఉడ్‌ ‌సైఫన్లు, 2ప్రైమరీ సైఫన్లు తెరుచుకోవడంతో భారీగా వరద నీరు దిగువనకు వెళ్తోంది. మదనాపురం మారెడ్డిపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మదనాపురం-ఆత్మకూరు పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధన్వాడ మండల కేంద్రంలో ఓ మట్టి మిద్దె కూలింది. వనపర్తి, కోస్గి, గద్వాల పట్టణాల్లో వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కోయిల్‌ ‌కొండ, నవాబ్‌ ‌పేట, గండీడ్‌, ‌హన్వాడ మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. దేవరకద్ర మండలం కౌకుంట్ల పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో వాగు రోడ్డు పైకి ఎక్కి పాడుతుండగా కౌకుంట్ల, ఇస్సరం పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కర్ణాటకలోని రాయచూరు పట్టణానికి మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. నందిన్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోవడంతో రెండు రాష్టాల్ర మధ్య రాకపోకలు ఆగిపోయాయి. దేవరకద్ర మండలంలో 136 మి. వర్షపాతం నమోదు అయ్యింది. దామరగిద్ద 120, మరికల్‌ 111, ‌వెల్దండ 81,  కోయిలకొండ 74 మి. వర్షపాతం నమోదు అయ్యింది.

పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం..పదిగేట్లు ఎత్తిన అధికారులు
నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. దీంతో  దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటికి తోడు వరద నీరు కూడా భారీగా వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్‌ ‌కూడా నిండుకుండలా మారింది. నాగార్జున సాగర్‌ ‌మొత్తం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరింది. అదేవిధంగా సాగర్‌ ‌మొత్తం నీటి నిలువ సామర్థ్యం కూడా 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ 309.95 టీఎంసీలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం డ్యామ్‌లోని 10 క్రస్ట్ ‌గేట్లను ఐదు అడుగుల మేర పైకిఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తున్నది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నడిగూడెం మండల కేంద్రంలో భారీగా వరదనీరు చేరింది. నీటికి నడిగూడెం చౌదరి చెరువు నిండి అలుగు పోస్తోంది. దీంతో గ్రామం జలమయమైంది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. నీట మునిగిన సామాగ్రి.. గ్రామస్తులు ఇళ్లలోనే ఉండిపోయారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ సహాయ చర్యలు చేపట్టారు.

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌  అ‌ప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులందరు హెడ్‌ ‌క్వార్టర్‌ ‌లోనే ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాలలో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సిఎస్‌ అన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్‌ ‌రూంకు పంపాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశించారు.

Leave a Reply