Take a fresh look at your lifestyle.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఫీవర్‌ ‌సర్వే

  • ఇంటింటికీ తిరిగి వివరాల సేకరణ
  • కొరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టింగ్‌ ‌కిట్లు అందజేత
  • వారంలోగా సర్వే పూర్తి చేస్తాం: సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి 21 : తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ ‌సర్వే ప్రారంభమైంది. రాష్ట్రంలో కొరానా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫీవర్‌ ‌సర్వే నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలలోనూ వైద్యారోగ్య సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులలో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా వంటి వివరాలను సేకరిస్తున్నారు. దీంతో పాటు కొరోనా సంబంధిత వొళ్లు నొప్పులు, గొంతు నొప్పి తదితర లక్షణాలపై సైతం ఆరా తీస్తున్నారు. ఒకవేళ కొరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ఐసోలేషన్‌ ‌కిట్‌ను అందజేస్తున్నారు. ఈ కిట్‌లో అజిత్రోమైసిన్‌, ‌లివోసిట్రిజిన్‌, ‌పరాసెటమాల్‌, ‌విటమిన్‌ ‌సి, డీ మందులతో పాటు మల్టీవైటమిన్‌ ‌మందులు ఉన్నాయి.

ఈ పరీక్షలలో భాగంగా కొరోనా సోకిన ఎవరికైనా బ్లాక్‌ ‌ఫంగస్‌ ఉన్నట్లు అనుమానం వస్తే వాటికి సంబంధించిన మందులను సైతం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, కొరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమైతే అక్కడికక్కడే పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోటి కిట్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది అవసరమైన మందులను సైతం పంపిణకి సిద్ధంగా ఉంచారు. సర్వేలో భాగంగా ఒకవేళ ఎవరికైనా కొరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు భావిస్తే వెంటనే సమీపంలోని దవాఖానాలకు వైద్య చికిత్సల నిమిత్తం తరలిస్తున్నారు. కాగా, ఈ జ్వర సర్వేలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ స్థాయిలో అంగన్వాడీ, ఆశ వర్కర్లు సైతం పాల్గొంటూ వివరాలు సేకరిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలో పంచాయతీ రాజ్‌, ‌మున్సిపల్‌ ‌సిబ్బంది సైతం అధిక స్థాయిలో పాల్గొంటున్నారు. జ్వర సర్వేలో భాగంగా ఎటువంటి కొరోనా లక్షణాలు లేని వారికి సైతం కొరోనా బారిన పడకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను సిబ్బంది వివరిస్తున్నారు.

వారం రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం : సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌
‌తెలంగాణలో శుక్రవారం ప్రారంభమైన ఫీవర్‌ ‌సర్వేను వారం రోజుల్లో పూర్తి చేస్తామని సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న సర్వేకు సహకరించాలని కోరారు. ఫీవర్‌ ‌సర్వే సమయంలో జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడికల్‌ ‌కిట్లు అందజేస్తున్నామనీ, జ్వర సర్వేతో త్వరలోనే కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. టెస్టుల సంఖ్య తక్కువగా ఉందన్న వార్తలలో వాస్తవం లేదనీ, లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయాలన్న ఐసీఎంఆర్‌ ‌నిబందనలు స్పష్టం చేసుస్తన్నాయని పేర్కొన్నారు. ఫీవర్‌ ‌సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఐసోలేషన్‌ ‌కిట్‌తో పాటు వ్యాక్సిన్‌ ‌తీసుకోని వారికి సైతం వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు సీఎస్‌ ‌వివరించారు.

Leave a Reply