- పార్లమెంటు సమావేశా)పై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
- కేంద్ర ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రాలకు ఇబ్బంది : ఎంపి కేకే
జీఎస్టీతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన ఇతర బకాయిలపై పార్లమెంటులో నిలదీయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్రం ప్రతిపాదించిన కొత్త విద్యుత్ సవరణ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పక్షాన పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం కేకే నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేంద్రం ఇవ్వలేదన్నారు. ప్రజా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు ఉందనీ, దీనిని తమ పార్టీ పక్షాన గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లను స్థానిక నేతలు అంగీకరిస్తారా ? అలాంటప్పుడు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంటులో తమతో కలసి వచ్చే వారితో విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు. జాతీయ రహదారుల విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు మర్చిపోతారా ? ప్రజలను మభ్యపెడతారా ? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నవోదయ పాఠశాలల ఏర్పాటు గురించి ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ ఎలాంటి పలితం లేదన్నారు. జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటాం ? దీనిపై కూడా అన్ని పార్టీలతో కలిపి పార్లమెంటులో నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.