తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటైన జల జగడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య మాటలు, లేఖల యుద్ధం కొనసాగుతున్నది. దీనిపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఘాటైన పదజా)ంతో విరుచుకుపడుతున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలపైనే తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ వివాదానికి మాత్రం తెరపడటం లేదు. తెలంగాణ ప్రాంతానికి జలాల పంపిణీ విషయంలో గతంలో జరుగుతున్న అన్యాయాలే నేటికీ ఇంకా కొనసాగుతున్నాయి. తమ వాటాను సాధించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం గత ఏడేళ్ళుగా విఫలమవుతున్నదంటూ ప్రతిపక్షాలు గోలపెడుతున్నాయి. కావాలనే తెలంగాణ సర్కార్ మౌనం వహిస్తున్నదని, ఆ మౌనం ఏపికి అనుకూలంగా మారుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణకు చెందాల్సిన నీటిలో ఒక్క బొట్టు కూడా వొదులుకునేదిలేదని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాటిని కంటితుడుపుగానే విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకొనలేక పోవడాన్ని అసమర్థతగానే అవి వాదిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వివాదం తీవ్రతరంగానే మారుతున్నది. ఏపి తాను చేపడుతున్న ప్రాజెక్టులు సరైనవేనని వాదించడంతోపాటు, తెలంగాణ విద్యుత్‌లో తమకు వాటా కావాలని వాదిస్తుండడం మరో కొత్త వివాదానికి దారి తీస్తున్నది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం నుండి కృష్ణా జలాల్లో మా వాటా ఎంత అన్న ప్రశ్నకు నేటి వరకు తెలంగాణ సర్కార్ తన వాటాను తేల్చుకోలేకపోతున్నదన్నది మాత్రం నిజం. తాజాగా ఈ విషయంలో జరుగుతున్న వివాదమే ఇందుకు సాక్ష్యం. కృష్ణా నీటిలో తమకు 70 శాతం ఇవ్వాల్సిందేనని ఏపి ప్రభుత్వం పట్టుపడుతుండడం ఈ జల జగడానికి ఇప్పట్లో తెరపడదన్న అంశాన్ని తెలుపుతున్నది. ఈ నీటి విషయంలో ట్రిబునల్-2 తీర్పు వొచ్చేవరకు తమకు 70 శాతం, తెలంగాణకు 30 శాతం నీటి కేటాయింపు జరుపాలని తాజాగా ఏపి ఇంజనీరింగ్ చీఫ్ జలవనరుల శాఖకు లేఖ రాయడం వివాదంగా మారింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ విద్యుత్ కేంద్రంలో, పులిచింతలలో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో తమకు వాటా ఇవ్వాలన్నది వారి తాజా డిమాండ్. పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం తెలంగాణలో ఉన్నప్పటికీ, దిగువ ఆయకట్టు ఏపి దని, అందుకు తమ అవసరాలకు తగినట్లుగా నీరు విడుదల చేయాల్సిందేనని ఏపి పట్టుపడుతుంది.
అలాగే ఇక్కడ జరిగే విద్యుత్ ఉత్పత్తిలో వాటా పంపిణి జరుగాలంటుంది. దీంతోపాటు గోదావరి నుంచి 214 టిఎంసి నీటిని కృష్ణా బేసిన్‌లోకి తెలంగాణ సర్కార్ మళ్ళిస్తుందని, ఇలా మళ్ళించే చోట టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని కూడా ఏపి డిమాండ్ చేస్తుంది. అయితే వాస్తవంగా ఏపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇదే విషయాన్ని కృష్ణానది యాజమాన్యానికి లేఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. జాతీయ హరిత ట్రిబునల్, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అంతేగాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని ఏపి చూస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కాగా, గత సంవత్సరం 66 : 34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకున్నామని, ఈసారి తమకు చెరిసగం అంటే 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. ఈ నెల రెండవ వారంలో కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి సమావేశానికి హాజరుకాకుండా తెలంగాణ ప్రభుత్వం పై అంశాలను పేర్కొంటూ లేఖాస్త్రాన్ని సంధించింది. ఇరు పక్షాల లేఖాస్త్రాలపై బోర్డు ఈ నెల 27న నిర్వహించనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.