తెలంగాణ రాష్ట్రం త్రీ-ఐ మంత్రంతో పనిచేస్తోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఆవిష్కరణలకు, మౌలికసదుపాయాల కల్పనకు, సమగ్ర అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా(పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో జరిగిన ప్లీనరీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వర్చువల్ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశాయన్నారు.
కానీ ప్రస్తుతం యావత్ ప్రపంచం కొత్త ఆలోచనలు చేయాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలివ్వాలని, ఆ సాధికారత తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాల సాధికారత అత్యంత కీలకమైందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో యంగెస్ట్ స్టేట్ అని, తెలంగాణకు సీఎం కేసీఆర్ డిసైసివ్ లీడర్‌గా సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, నమ్మకం, విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తున్నామని, ఎటువంటి క్లియరెన్స్ లేకుండా వ్యాపారం చేసుకునే వీలు ఉందని మంత్రి చెప్పారు. టీఎస్ ఐపాస్‌తో పెద్ద సక్సెస్ సాధించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.