Take a fresh look at your lifestyle.

మతఘర్షణలు లేకుండా రాష్ట్ర పోలీస్‌ ‌కృషి

  • పోలీసు సంక్షేమానికి కట్టుబడ్డ ప్రభుత్వం
  • అమరుల సంస్మరణలో మంత్రి మహ్మూద్‌ అలీ
  • ప్రభుత్వ సహకారంతో వ్యవస్థ బలపడిందన్న డిజిపి
  • సిఆర్‌పిఎఫ్‌లో అమరుల సంస్మరణ

పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హోమ్‌ ‌మంత్రి మహముద్‌ అలీ అన్నారు. పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. కొరోనా సమయంలో 62 మంది పోలీసులు మరణించారు. ఏడేండ్లలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేశామన్నారు. బోనాలు, రంజాన్‌ను ప్రశాంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. పోలీసు అమరవీరులకు ప్రభుత్వం తరఫున శ్రద్దాంజలి ఘటించామని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. నగరంలోని గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహముద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అం‌జనీ కుమార్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహముద్‌ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం డిజిపి మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని అన్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టా మన్నారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. అత్యవసర స్పందన కోసం 11500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. కోవిడ్‌ ‌సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారని చెప్పారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

సిఆర్‌పిఎఫ్‌లో అమరుల సంస్మరణ
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్ ‌దక్షిణ సెక్టార్‌ ‌ముఖ్య కార్యాలయం జూబ్లీహిల్స్ ‌ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఐజిపి మహేష్‌ ‌చంద్ర లడ్డా పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. సందర్భంగా లడ్డా మాట్లాడుతూ అక్టోబర్‌ 21‌న లద్దాఖ్‌లో గల హాట్‌ ‌స్ప్రింగ్‌ ‌ప్రాంతంలో 1959లో చైనా సైనికుల ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సిఆర్‌పిఎఫ్‌ ‌జవానుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21‌న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజి ఖాజా సజ్జానుద్దీన్‌, ‌కమాండెంట్లు విశ్వనాథ్‌, ‌రాజ్‌ ‌ముకుత్‌, ‌సిఆర్‌పిఎఫ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply