- ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి వైద్యులు మేధోమథనం చేయాలి
- తెలంగాణను చిన్నచూపు చూసినా చిత్తశుద్ధితో కృషి చేసి బయటపడ్డాం
- తెలంగాణలో తొలి కొరోనా కేసుకు ఏడాది, ’గాంధీ ’• వైద్యులకు ఘన సన్మానం వైద్య శాఖ మంత్రి ఈటల
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: ఇతర వైరస్ల మాదిరిగానే కొరోనాతో సహజీవనం చేయాల్సిందేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు కొరోనా సోకకుండా, ఒకవేళ సోకినా దాని నుంచి బయటపడేలా ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడానికి వైద్యులు మేధోమథనం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో తొలి కొరోనా కేసు వెలుగు చూసి మంగళవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల కొరోనా సోకిన తొలి బాధితుడు, ఆరోగ్య సిబ్బందితో గాంధీ హాస్పిటల్లో భేటీ అయ్యారు. కొరోనా వెలుగు చూసినప్పటి నుంచి బాధితులకు సేవలు అందించిన వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కొరోనాపై పోరాటంలో గాంధీ హాస్పిటల్ సిబ్బంది నిర్విరామ కృషి చేశారని కొనియాడారు. రాబోయే రోజుల్లో గాంధీ హాస్పిటల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కొరోనా వెలుగు చూసిన తొలి నాళ్లలో వైరస్ వస్తే శవాల గుట్టలే ఉంటాయని అందరం భయపడ్డామనీ, దేశంతో పాటు రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కొరోనా కేసులు వస్తే ఎదుర్కోలేరని ఎంతో మంది చిన్నచూపు చూశారనీ, అయినప్పటికీ వైద్యుల నిర్విరామ కృషి చిత్తశుద్ధితో బయటపడ్డారని పేర్కొన్నారు. 35 వేలకు పైగా కోవిడ్ రోగులు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందారనీ, 7 వేల మందికి పైగా అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న వారికి చికిత్స అందించామని తెలిపారు.
కొరోనా విపత్కాలంలో తోడుగా ఉన్న వైద్యులను ఎంతగా అభినందించినా తక్కువే అని కొనియాడారు. క్యాన్సర్ కిడ్నీ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రోగులకు గాంధీ హాస్పిటల్ దిక్కు కాబోతున్నదనీ, రూ.35 కోట్లతో ఇక్కడ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ హాస్పిటల్ వైద్యుల చిత్తశుద్ధి ఇతర వైద్యులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో కొరోనా కట్టడికి ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందనీ, మొదటగా లాక్డౌన్ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. రాష్ట్రంలో కొరోనా కట్టడికి ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఇతర శాఖలు నిర్విరామంగా పనిచేశాయని ప్రశంసించారు.
అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలనీ, రైళ్లను ఆపివేయాలని మొదట కోరింది సీఎం కేసీఆర్‌యేనని గుర్తు చేశారు.అనేక రాష్ట్రాలు ప్రస్తుతం సెకండ్ వేవ్‌తో బాఢపడుతున్నాయనీ, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తెలంగాణలో ఇబ్బందులు తలెత్తలేదని చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ఈటల స్పష్టం చేశారు.