Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌బారిన పడ్డ జర్నలిస్టులకు రూ. 5 కోట్లు అందజేశాం

  • ప్రభుత్వం ఆధ్వర్యంలో మీడియా అకాడమి ఆదుకున్నది
  • కొరోనాతో 70 మంది జర్నలిస్టుల మరణాలు కదిలించాయి
  • రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ మీడియా అకాడమి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కోవిడ్‌ ఆర్థిక సహాయం మొత్తం 5 కోట్ల 15 లక్షల రూపాయలు అందించిందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కోవిడ్‌ ‌బారిన పడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అకాడమి ఆదుకున్నదని రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. కొరోనా మహమ్మారి దరిదాపు ఏడాదిన్నర కాలంపాటు జన జీవితాలని ఆతలాకుతలం చేసిందని, రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన మహమ్మారి జర్నలిస్టులను కూడా తీవ్రంగా ఇబ్బందులపాలు చేసిందని అకాడమీ విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం..శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు ఎదురైన కొరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చేసిందన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు కొరోనా సోకిన జర్నలిస్టులకి దరిదాపు 5 కోట్ల 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని అల్లం నారాయణ తెలిపారు. తొలి విడత కొరోనా సమయంలో దరిదాపు 1553 మంది కొరోనా సోకిన జర్నలిస్టులకి 3 కోట్ల 10 లక్షల 60 వేల రూపాయలను, కొరోనాతో హోంక్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టులకు 87 మందికి 8 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు.

రెండవ విడత కొరోనా తీవ్ర ఉధృతితో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 1958 మంది జర్నలిస్టులకి వైరస్‌ ‌సోకిందని, మలి విడత ఆర్థిక సహాయం 10 వేల వంతున 1958 మంది జర్నలిస్టులకి ఒక కోటి 95 లక్షల 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని, వెరసి మీడియా అకాడమిలో ఉన్న 34 కోట్ల 50 లక్షల కార్పస్‌ ‌ఫండ్‌తో వొచ్చిన వడ్డీ ఆధారంగా ఈ మొత్తాలను జర్నలిస్టులను ఆదుకోవడానికి అకాడమి వినియోగించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా కూడా కొరోనా సోకిన జర్నలిస్టులకు ఇలా ఆర్థిక సహాయం అందలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనిగా మీడియా అకాడమి భావిస్తున్నదని నారాయణ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దూరదృష్టితో జర్నలిస్టుల కోసం 100 కోట్ల కార్పస్‌ ‌ఫండ్‌ ఏర్పాటు చేశారని, దానిలో ఇప్పటి దాకా ఉన్న 34 కోట్ల 50 లక్షలకు తోడు మరో 7 కోట్ల 50 లక్షల రూపాయలు ఈ కార్పస్‌ ‌ఫండ్‌కి గడిచిన ఏప్రిల్‌-2021‌లో సమకూరాయని, దీంతో ఇప్పటి వరకు రూ. 42 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయిందని ఆయన తెలిపారు. మరోవైపు 2వ విడత కొరోనా తీవ్రత జర్నలిస్టులను చాలా మందిని బలిగొన్నదని, పేరు గాంచిన జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు మహమ్మారితో ఆకాల మరణం పొందడం జర్నలిస్టుల లోకాన్ని తీవ్రంగా కదిలించిందని, ఈ మరణాలు మీడియా అకాడమిని కుడా కదిలించాయని నారాయణ అన్నారు. అందువలన కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమి నిర్ణయించిందని, వొచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఒక నెలలోపు ఈ రెండు లక్షల ఏక మొత్తం ఆర్థిక సహాయం అందిస్తామని, ఆ కుటుంబాలకు యథావిధిగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చిన విధంగానే 5 ఏళ్లపాటు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్‌ ‌లభిస్తుందని, అంతేగాక మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్నవారిలో గరిష్టంగా ఇద్దరికి ఒక వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుందని వెల్లడించారు.

కోవిడ్‌ ‌సమయంలో మిగతా కార్యకలాపాలన్నీ స్థంభించి పోయిన తరుణంలో జర్నలిస్టులను ఆదుకోవడమే తక్షణ కర్తవ్యంగా మీడియా అకాడమి పని చేసిందని, తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం వాట్సాప్‌ ‌ద్వారా పంపిన 3600ల కోవిడ్‌ ‌సహాయ దరఖాస్తులను పరిష్కరించిన మీడియా అకాడమి సిబ్బంది కరోనా సంక్షోభ సమయంలో చేసిన కృషి ప్రశంసనీయమని అభినందించారు. త్వరలో మీడియా అకాడమి తరుఫున జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్‌ ‌సోకి మరణించిన జర్నలిస్టుల కుటుంబాల వారు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి, హైదరాబాద్‌ ‌చిరునామా:: ఇంటినెం.10-2-1, సమాచార భవన్‌, 2‌వ అంతస్తు, ఎ.సి. గార్డస్, ‌మాసాబ్‌ ‌ట్యాంక్‌, ‌తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ది సంస్థ కాంప్లెక్స్, ‌హైదరాబాద్‌కు పంపవలసిందిగా మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ తెలియజేశారు.

Leave a Reply