- పిఎంఎవై-జి నిధులు వాపస్ చేయండి ..
- రు .190.78కోట్లు విడుదల చేసిన కేంద్రం
- లోక్ సభలో కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మంత్రి వివరణ
- అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వమన్న ఎంపీ బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం పిఎంఎవై-జి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. అందుకే నిధుల్ని వెనక్కి పంపించాలని కెసిఆర్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. . కేంద్ర ప్రకారం, పిఎంఎవై-జి పధకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరంకి నిర్ధేశించిన లక్ష్యం మేరకు విడుదల చేసిన పిఎంఎవై-జి నిధులు రు .190.78కోట్లు తెలంగాణకు బదిలీ చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించలేదు కనుక తిరిగి కేంద్రానికి చెల్లించాలని తెలంగాణ రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చింది.గత ఏడు సంవత్సరాలలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ (పిఎమ్వై-జి) పధకం కింద తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన నిధులు ఎంతో తెలపాలని కేంద్రాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వివరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలలో కేంద్రం మంజూరు చేసిన ఇండ్లు ఎన్ని రాష్ట్రం నిర్మించిన గృహాల సంఖ్య, సంవత్సరం వారీగా తెలపాలని కోరారు. అలాగే కేంద్ర షెడ్యూల్ ప్రకారం ఇల్లు నిర్మించడంలో కేంద్ర పథకం మార్గదర్శకాలను పాటించనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుందా …? అని కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మంత్రిని ప్రశ్నించగా… కేంద్రం ఇలా సమాధానం ఇచ్చింది. 2022 నాటికి ‘‘అందరికీ హౌసింగ్’’ లక్ష్యాన్ని సాధించడానికి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016 ఏప్రిల్ 1 నుండి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- గ్రామిన్ (పిఎమ్వై-జి) ను అమలు చేస్తోంది.
అందులో భాగంగా తెలంగాణాకి 2016-17 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా 19,078.865 లక్షల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రం పిఎంఎవై-జి పధకాన్ని రాష్టంలో అమలు చేయడం లేదు అని కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముందుగా 70,674 గృహాలు నిర్మించాలి అని అనే లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయించింది. ఈ లక్ష్యం ప్రకారం పిఎంఎవై-జి పధకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరాలకు గాను పధకం అమలు కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంకి గాను 41035.176 లక్షలు విడుదల చేసి 65402 ఇళ్ల నిర్మాణం చేయాలనీ కేంద్రం చెబితే కెసిఆర్ ప్రభుత్వం కేవలం 28 ఇల్లు నిర్మించింది.
2015-16 ఆర్థిక సంవత్సరం 56858 ఇల్లు నిర్మించటం కోసం కేంద్రం 24787.526 లక్షలు నిధులు ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం 45763 ఇల్లు నిర్మించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇల్లు నిర్మించాలి అనేది నిర్ధేశించకుండా 14263.335 లక్షలు మంజూరు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం 2759 ఇల్లు నిర్మించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం 4815.53 లక్షలు విడుదల చేస్తూ…అటుపై 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంకి గాను అసలు నిధులు కేటాయించలేదు. అదే సమయంలో 2017-18 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాలలో మొత్తంగా తెలంగాణాలో 122260 ఇల్లు నిర్మాణం జరగాలి అని కేంద్రం నిర్దేశించింది. ఇప్పటివరకు కెసిఆర్ ప్రభుత్వం ఈ కాలానికి గాను కేవలం 48550 ఇండ్లు మాత్రమే నిర్మించింది. ఇలా గత ఏడు సంవత్సరాలతో కలిపి ప్రస్తుత సంవత్సరం వరకు కేంద్రం విడుదల చేసిన నిధులు ఎన్నో కేంద్రం ఓ జాబితా విడుదల చేసింది.
అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వం :ఎంపీ బండి సంజయ్
దీనిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కెసిఆర్ ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వినియోగించుకోలేకపోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. పీఎంజీఎస్ వై కింద తగిన నిధులు వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి అర్హత ఉందని కేంద్ర గ్రామీణాభివ్రుద్ది శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పటికీ….టీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేక పోవడం దారుణమన్నారు. భారత దేశంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు కనెక్టివిటీ ఉండాలనే గొప్ప ఆశయంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రం వాడుకోవడం చేతకావడం లేదని విమర్శంచారు.
2016లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 70,674 ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఒక్క ఇంటిని కూడా నిర్మించకపోవడం క్షమించరాని విషయమన్నారు. తెలంగాణ అభివ్రుద్దికి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ…..రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనడానికి ఆయా పథకాలకు కేటాయించిన నిధులు, మంజూరైన ఇండ్లు, రోడ్ల నిర్మాణాల వివరాలే నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్ధత ఎంతో పార్లమెంట్ సాక్షిగా మరోమారు తేటతెల్లమైందని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ చెబుతున్న మాటలన్నీ అబద్దాలేననే విషయం దేశ అత్యున్నత చట్టసభ వేదిక సాక్షిగా మరోమారు దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.