ఈనెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో కొరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం ఈనెల 7 వరకూ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈనెల 3తో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ గడువు ముగియనుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలా ? లేదా ఎత్తి వేయాలా ? అనే అంశాలపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్థిక భారం వంటి అంశాలపై సైతం చర్చ జరుగనుంది. ఒకవేళ లాక్‌డౌన్‌ను కొనసాగించిన పక్షంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి ? లేదా ఎత్తివేస్తే ఏ విధమైన ఆంక్షలు విధించాలి ? వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే, ఈనెల 3న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై సైతం మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. మరోవైపు, ఈనెల 8 తరువాత తెలంగాణ కొరోనా రహిత రాష్ట్రంగా మారుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 5న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా ? లేక కొన్ని నిబంధనలతో ఎత్తివేస్తారా ? అని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.