Take a fresh look at your lifestyle.

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఒకరా.. ఇద్దరా..!

Does BJP believe in municipal results

గత కొంతకాలంగా రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీలో తర్జనబర్జనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌పదవీ కాలం పూర్తి అవడంతో అధ్యక్షుడి ఎంపికపై దాదాపు ఏడాది కాలంగా ఈ చర్చ జరుగుతున్నది. అయితే ఈ ఏడాదికాలంలో రాష్ట్రంలో వరుసగా ఏవో ఎన్నికలు వొస్తుండడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధిష్టానవర్గం వాయిదా వేస్తూ వొస్తున్నది. ఈ ఎన్నికల సందర్భంగా కొత్తవారికి అవకాశమిస్తే అసలే రాష్ట్రంలో అంతంతగా ఉన్న పార్టీ ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి వొస్తుందన్న భయంతో దాన్ని వాయిదా వేస్తూ వొచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో తిరిగి అధ్యక్షపదవిపై చర్చ మొదలైంది. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ముందు నుండి అధిష్టానం మరో కొత్త వ్యక్తికి బాధ్యతలను అప్పగించాలన్న అభిప్రాయంగా ఉన్నట్లు వార్తలు వొచ్చాయి. అయితే ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో పెద్దగా విజయం సాధించకపోయినా, అధికార పార్టీకి తీవ్రస్థాయిలో పోటీ ఇవ్వడంలో లక్ష్మణ్‌ ‌తన శక్తిమేర కృషిచేశాడని అధిష్టానం అభిప్రాయపడుతోంది. దానివల్ల ఆయనకే మరోసారి అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చనుకుంటున్నారు. ఒక వేళ ఆయన్ను తప్పించిన పక్షంలో ఆ పదవిని చేపట్టేందుకు పార్టీలో చాలామంది పోటీ పడుతున్నారు. చాలాకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్‌ ‌నాయకులు మొదలు, కొత్తగా ఇతర పార్టీలోనుండి వొచ్చి చేరినవారు కూడా అధ్యక్ష పదవి కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురి అరవింద్‌, ‌కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌లు ముందున్నారు. కాగా నిన్నటివరకు కాంగ్రెస్‌ ‌పార్టీలో మేటి నాయకురాలిగా ఉండి బిజెపిలో చేరిన డికె అరుణ కూడా తనకే ఈ అవకాశం వొస్తుందని చాలాకాలంగా ఎదురు చూస్తున్నది. అసలు ఆమె ఆ పార్టీలో చేరేప్పుడే పార్టీలో ఉన్నత పదవినిచ్చే ఒప్పందం జరిగిందన్న వార్తలొచ్చాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా అధ్యక్షుడి మార్పువల్ల కొత్తగా రాష్ట్రానికి వచ్చే లాభమేమీ ఉండదని అధిస్టానం భావిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. అధ్యక్షుడిని మార్చడం ద్వారా పార్టీలో అనవసర గొడవలకు దారితీస్తుందన్న అభిప్రాయం కూడా అధిష్టానానికి ఉంది. అందుకు ప్రస్తుతానికి లక్ష్మణ్‌నే మరికొంతకాలం కొనసాగిస్తే వొచ్చే నష్టమేమీ లేదనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ పార్టీ వర్గాల నుండి వత్తిడి వచ్చిన పక్షంలో జాతీయ స్థాయి పార్టీలో చేసిన ప్రయోగాన్నే రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో ఎలా అయితే వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పదవిని సృష్టించిందో ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం చేయడం ద్వారా తాత్కాలికంగా పార్టీలో అంతర్ఘత పోటీని కూడా నివారించ వొచ్చన్న ఆలోచనలో పార్టీ అగ్రనేతలున్నట్లు తెలస్తున్నది. పార్టీ కేంద్రస్థాయిలో అమిత్‌షాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే, వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌గా జేపీ నడ్డాను కొంతకాలం కొనసాగించి, తర్వాత ఆయన్నే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఎలా నియమించారో ఇక్కడ కూడా అదే ప్రయోగం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌పదవిని ఎవరికిస్తారన్న విషయంలో కూడా పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. అధ్యక్ష పదవి కోసం తీవ్రస్థాయిలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నవారిలో ఎంపిలు బండి సంజయ్‌, ‌దర్మపురి ఆరవింద్‌తో పాటు తాజాగా టిఆర్‌ఎస్‌ ‌నుండి బిజెపిలోకి మారిన మహబూబ్‌నగర్‌ ‌మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఆయన ఇప్పటికే ఢిల్లీలో లాబీయింగ్‌ ‌మొదలుపెట్టారు. ఇప్పటికే సంజయ్‌, ఆరవింద్‌ ‌టిఆర్‌ఎస్‌ను, కెసిఆర్‌ను అడుగడుగున ఎదుర్కుంటునే ఉన్నారు. అంతే కాకుండా వీరిద్దరు యువనాయకులు కావడంవల్ల కూడా యువకులను ఆకట్టుకునే క్రమంలో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ ‌నుండి కిషన్‌రెడ్డికి కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడంతో, అధ్యక్ష పదవిని జిల్లా స్థాయి నాయకుడికి అప్పగించడం ద్వారా పార్టీని జిల్లాల స్థాయిలో బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా అర్గనేతలకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు పోటీ పడుతున్నవారి ఉత్సాహానికి ఇది కూడా ఒకకారణంగా కనిపిస్తున్నది. కాగా కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి వొచ్చిన డికె అరుణ పవర్‌ఫుల్‌ ‌మహిళ కావడం చేత ఆమెవైపు అధిష్టానానికి మొగ్గు ఉండే అవకాశాలున్నాయనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కొత్తవారు పార్టీ బాధ్యతలను ఎంతవరకు మోస్తారన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అందుకు లక్ష్మణ్‌ను మరికొంత కాలం కొనసాగిస్తూనే వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌పదవికి పోటీపడుతున్న వారిలో ఒకరికి కట్టబెడుతారనుకుంటున్నారు.

Leave a Reply