ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు అందులో భాగమే
కేసీఆర్…మీ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదు?
మీతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా?
సీఎం కేసీఆర్పై రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులను వేధించడంలో భాగంగా జారీ చేసిన ఆదేశాలుగానే భావిస్తున్నామని, వినాశకాలే విపరీత బుద్ది అనే చందంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయకులను వేధించడమే లక్ష్యంగా పిచ్చి తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు. 317 జీవో పేరుతో ఉద్యోగుల, ఉపాధ్యాయులను రాచిరంపాన పెడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు బదిలీలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారని, అయినా ముఖ్యమంత్రికి ఇంకా కక్ష తీరనట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. చదువు చెప్పే సర్కారీ టీచర్లు ఇకపై ప్రతి ఏటా ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని, ఇకపై ఆస్తులు అమ్మాలన్నా… కొనాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం వేధింపుల్లో భాగమేనని, ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా… ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదమని అన్నారు. టీఆర్ఎస్ నియంత-కుటుంబ-అవినీతి-దుర్మార్
317 జీవోను వ్యతిరేకిస్తూ సర్కార్ను నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారని, అడ్డదారిలో అక్రమంగా బదిలీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సర్కార్ తప్పులను నిలదీస్తుంటే ఆగమాగమైతున్నారన్నారు. అంతేగాకుండా కేసీఆర్ తుగ్లక్ పాలనతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెబుతూ వారిని చైతన్యం చేస్తున్నారనే భయం పట్టకున్నట్లుందన్నారు. టీచర్లు సహా విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వేధించి కక్ష తీర్చుకోవడానికి ఈ జీవోను వాడుకుంటున్నట్లు కన్పిస్తుందన్న అనుమానం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇన్నేళ్ళుగా లేనిది కేసీఆర్కు ఇప్పుడే ఈ జిఓ ఎందుకు గుర్తుకు వొచ్చిందని, కేసీఆర్ సీఎం కాకముందు… ఆయన కుటుంబం ఆస్తులెన్ని? ఆ తరువాత కూడగట్టిన ఆస్తులెన్ని? వాటి వివరాలను ఎందుకు ఏటా విడుదల చేయడం లేంటూ ప్రశ్నించారు. ఇకపై సీఎంసహా ఆయన కుటుంబ సభ్యులంతా ప్రతి ఏటా ఆస్తుల వివరాలు విడుదల చేయాలని తాను డిమాండ్ చేస్తున్నానని, ఆస్తుల వివరాలంటే డమ్మీ వివరాలు చెప్పడం కాదని, సింగపూర్, మలేసియా, దుబాయిలో సీఎం, ఆయన కుటుంబం దోచుకుని దాచుకున్న ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ కేబినెట్ లోని మంత్రుల ఆస్తులతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను కూడా ఏటా బయటపెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని ప్రకటనలో సంజయ్ పేర్కొన్నారు.