Take a fresh look at your lifestyle.

రాష్ట్రాన్ని, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న టీఆర్‌ఎస్‌కు వోట్లతో బుద్ధ్ది చెప్పాలి

మేడిపల్లి, జనవరి 17 (ప్రజాతంత్ర విలేఖరి) : రాష్ట్రాన్ని, రాజకీయాలను బ్రష్టు పట్టిస్తూ విలువలు లేకుండా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్‌ ‌నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి కోరారు. నగర పాలక సంస్థలైన పీర్జాదిగూడ, బోడుప్పల్‌ ‌ప్రాంతాలతో పాటు వాటిలో భాగమైన పర్వతాపూర్‌, ‌మేడిపల్లిలలో ఆయన శుక్రవారం రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో ధనిక రాష్ట్రంగా మిగులు నిధులతో విలసిల్లిన తెలంగాణ టీఆర్‌ఎస్‌ ‌పాలనతో అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి పథకాల పేరుతో వేలాది కోట్ల రూపాయల కమీషన్లు ఆ పార్టీ నాయకుల జేబుల్లోకి చేరాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ డబ్బులు ఉన్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తుందని, ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణయన్నారు.

ఒక్కో కార్పొరేటర్‌, ‌కౌన్సిలర్‌ ‌టిక్కెట్లు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు మేయర్‌, ‌చైర్‌పర్సన్‌ ‌సీట్లు ఆశిస్తున్న అభ్యర్ధుల నుంచి రూ.5 నుంచి 10 కోట్లకు సంతలో గొర్రెలు, బర్రెల్లా అమ్ముకున్నారని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి బుద్ది చెప్పాలన్నారు. ఓటర్లు కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడిచిన ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ‌చేసిన అభివృద్ధి ఏదీ లేదని, పిట్టల దొరలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన మాటల గారడీతో ఏ గూటి కాడ ఆ పాట పాడుతూ ప్రజలను వంచిస్తూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మధ్యం, రవాణ చార్జీలూ పెంచారన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ‌గెలిస్తే కరెంట్‌ ‌బిల్లులు, ఇంటి ట్యాక్స్‌లు పెంచేందుకు సిద్దంగా ఉందని పేర్కొన్నారు. మండల కేంద్రమైన మేడిపల్లిలో వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే త్రాగు నీరు వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియాగాందీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందని, కానీ అది టీఆర్‌ఎస్‌ ‌తానే తెలంగాణ తెచ్చినట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతోందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇప్పటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూంల పేరుతో పేదలకు ఇండ్లు ఇస్తున్నామంటూ గొప్పలు పోతున్న సీఎం కేసీఆర్‌ ఎక్కడ ఎంతమందికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి నీతి వంతమైన పాలన, సమగ్రాభివృద్ది కోసం మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓట్లు వేయాలని రేవంత్‌ ‌రెడ్డి కోరారు. రోడ్‌ ‌షోలో ఆయన వెంట నాయకులు రాందాస్‌ ‌గౌడ్‌, ‌కౌడె పోచయ్య, నాధం గౌడ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: state and politics,disarray,TRS, Buddhist votes

Leave a Reply