Take a fresh look at your lifestyle.

సోనియాకు మద్దతుగా నిలవాలి

  • జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి..
  • తెలంగాణ ఇచ్చిన దేవత
  • ఇడి కేసులు పెట్టి వేధిస్తున్నారు
  • మోడీ తీరుపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి
  • ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ ఇచ్చిన సోనియాకు జెండాలు, ఎజెండాలకు మద్దతుగా అంతా నిలవాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా నిలవాలన్నారు. బిజెపి ఇడిని అడ్డం పెట్టుకుని త్యాగాల కుటుంబాన్ని వేధిస్తుందని అన్నారు. సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. ఈ క్రమంలో…హైదరాబాద్‌లోనూ హస్తం నేతలు ధర్నాకు దిగారు. నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్‌ ‌నేతలు ర్యాలీగా బయల్దేరారు. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, మర్రి శశిధర్‌ ‌రెడ్డి, పలువురు నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు మండిపడ్డారు. కేంద్ర సర్కార్‌ ‌హస్తం పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఈడీ.. సోనియా గాంధీని విచారిస్తుందని విమర్శించారు. ఈ విషయమంతా ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు నేతలు కార్యకర్తలు నల్ల రంగు బెలూన్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు.

దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్‌ ‌నాయకులు..నిరసనలకు వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్‌ ‌నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌ ‌మండిపడ్డారు. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌నుంచి అంజన్‌ ‌కుమార్‌ ‌నల్ల దుస్తులు, బెలూన్స్ ‌ప్రదర్శిస్తూ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలివెళ్లారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సోనియా గాంధీని ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి చర్యలతో కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, మధుయాష్కీ, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌పొన్నాల లక్ష్మయ్య,, షబ్బీర్‌ అలీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ‌నిరసనతో బషీర్‌ ‌బాగ్‌ ‌రూట్‌లో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. డబ్బు బదలాయింపు లేకున్నా..సోనియా కుటుంబంపై మనీ లాండరింగ్‌ ‌కేసు నమోదు చేసి కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెట్టి.. గాంధీ కుటుంబం దేశం విడిచిపోయేలా చేయాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.

సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ నాయకులు, శ్రేణులు అండగా ఉంచాయన్నారు. ఈడీ కేసు గురించి క్లుప్తంగా..నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక ఆస్తులను ఆయాచితంగా పొందారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మాజీ ప్రధాని పండిట్‌ ‌జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, ఇతర స్వాతంత్ర సమరయోధులు కలిసి 1938లో ఈ పత్రికను స్థాపించారు. దీని ప్రచురణ సంస్థ అసోసియేటెడ్‌ ‌జర్నల్స్ ‌లిమిటెడ్‌(ఏజేఎల్‌)‌కు హిందీ, ఉర్దూలలోనూ మరో రెండు పబ్లికేషన్లు ఉన్నాయి. రూ.90 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోవడంతో 2008లో ఈ పత్రిక మూతపడింది. ఒక పబ్లిక్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ(ఏజేఎల్‌)‌ని ప్రైవేటు లిమిటెడ్‌ ‌కంపెనీ(యంగ్‌ ఇం‌డియన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌-‌వైఐఎల్‌) ‌ద్వారా సొంతం చేసుకున్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఏజేఎల్‌ ‌బకాయి పడిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందడానికి వైఐఎల్‌ ‌ద్వారా రూ.50 లక్షలు చెల్లించి.. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగానికి వీరు పాల్పడ్డారన్నారు.

Leave a Reply