- డాక్టర్ల పర్యవేక్షణలో ఎయిమ్స్‌లో చికిత్స
- మన్మోమన్ సింగ్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోడీ ట్వీట్
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు ఎయిమ్స అధికారి గురువారం మీడిమాకు వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఆయన శరీరానికి శక్తినిచ్చేందుకు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. బుధవారం నీరసంతో పాటు అలసటగా ఉండడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఎనభై తొమ్మిదేళ్ల మన్మోహన్ కొన్ని రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు.
దీంతో ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నారాయన. అయితే, బుధవారం జ్వరం లేకపోయినా…నీరసంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారాయన. దీంతో వారు ఆయనను వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన కొరోనా బారినపడి ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. మన్మోహన్ ఆరోగ్యంపై వొస్తున్న రూమర్లను నమ్మొద్దన్నారు ఇన్చార్జి కార్యదర్శి ప్రణవ్ జా. అతని ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉన్నా తామే తెలియజేస్తామంటూ ట్వీట్ చేశారు. మరోవైపు, మన్మోహన్ త్వరగా కోలుకోవాలంటూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గురువారం మన్మోహన్ సింగ్‌ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎయిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ డార్టన్లనడిగి ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు.