Take a fresh look at your lifestyle.

శ్రీ ధన్వంతరీ మూల మంత్రం  

” ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ
ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్యనిధయే
శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీధన్వంతరీ స్వరూప
శ్రీశ్రీశ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా  “
మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలోని ప్రతి జీవిని, వస్తువునూ దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెప్పకనే చెబుతోంది. ప్రకృతిలో పరమాత్మను దర్శించే సంస్కృతికి అనుగుణంగానే వైద్య విధానాలు కూడా ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఆనాటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసింది అంటే అందుకు ముఖ్య కారణం ఆరోగ్యంను  మహాభాగ్యంగా నమ్మడమే . ఆ విధంగానే  వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని నమ్మారు. అనుభవజ్ఞుడైన వైద్యున్ని ‘అపర ధన్వంతరి’ అని మనవాళ్ళు పొగుడుతుంటారు. ఆ రోజుల్లో రోగాలూ, రుగ్మతలు కూడా తక్కువగానే వుండేవి. ఒకవేళ ఏమైనా రోగాలు దాపురిస్తే అందుకు తగిన ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది.భాగవత పురాణం ప్రకారం ధన్వంతరి క్షీరసాగరమధనం ద్వారా ఆవిర్భావం జరిగింది. ధన్వంతరి ఎలా వుండేవారన్న విషయంలో ఆయన రూపును రకరకాలుగా వర్ణించారు. అయితే విష్ణుధర్మోత్తరపురాణంలో మాత్రం ఒక చేతిలో అమృతకలశం, మరొక చేతిలో వనమూలికలను పట్టుకుని ధన్వంతరి దర్శనిమిచ్చినట్లుగా చెప్పబడింది. భాగవత పురాణంలో ధన్వంతరి పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో, నడుముకు పట్టుపట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, విశాల వక్షం, నల్లని కురులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్న కుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలతో  ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు పాలసముద్రం నుండి అని చెబుతోంది. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృత కలశం ధగధగలాడుతోందట. దేవదేవుడైన ధన్వంతది భూలోకానికి వచ్చిన ఉదంతం హరివంశంలో వివరింపబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి విష్ణుమూర్తి వరం వలన ధన్వంతరి, మానవ రూపంలో ఆయన ఇంట జన్మించాడని వుంది. దేవలోకంలోని వైద్య విధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచాడని ప్రతీతి. ధన్వంతరి  గురించిన ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. ధన్వంతరిని ప్రసన్నం గావించుకోవాలంటే ఈ ‘శ్రీ ధన్వంతరీ మూల మంత్రం’ ను జపించాలని చెబుతారు.
ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ
ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్యనిధయే
శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీధన్వంతరీ స్వరూప
శ్రీశ్రీశ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు దివోదాసు శస్త్ర చికిత్సలో ఉద్ధండుడు. ఇక సుశ్రుతుడు గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు. ప్లాస్టిక్‌ ‌సర్జరీకి ఈయనను ఆద్యుడిగా చెబుతారు. ఈయన హిపోక్రెట్స్ ‌కన్నా ఓ వంద సంవత్సరాలముందు, సెల్సియస్‌, ‌గాలన్‌ల కన్నా ముందుగానే ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడన్నది యదార్థం. సుశ్రుతుడు రాసిన వైద్య గ్రంధాలు ముందుగా అరబిక్‌ ‌భాషలోకీ, ఆ తర్వాత పర్షియన్‌ ‌భాషలోకీ, తదితర భాషల్లోకీ అనువదింపబడి, భారతీయ వైద్య విధానాలు విస్తరించాయి. సుశ్రుతుడు 1120 రుగ్మతలకు చికిత్సా పద్దతులు సూచించంగా, ఈయనను ఎక్కువగా మధుమేహ, ఉబకాయాలను తగ్గించే వైద్యునిగా చాలామంది గుర్తుపెట్టుకునేవారట. కాశీలోని బెనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయంలో వీరి విగ్రహం ప్రతిష్టించబడింది. సుశ్రుతుడు శస్త్ర చికిత్స నిపుణుడైతే, ఆ తర్వాతి చరకుడు, ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగానికి ఏ మూలికి తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడీయన. వాత, పిత్త కఫములను అనుసరించి చరకుడు మానవ శరీరంలోని రోగాలను నిర్ధారించి చికిత్సనందించేవాడు. వృద్ధాప్యాన్ని వెనక్కి మళ్ళించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడు. ఈయన చరక సంహిత అనే గ్రంధాన్ని రచించాడు . పూర్వకాలంలో వీరుగాక వాగ్భటుడు, ఆత్రేయుడు అనేవారు ఎన్నో వైద్య గ్రంధాలు రచించారు. తర్వాత కశ్యపుడు పిల్లలకు సంబంధించిన వైద్య విధానంలోనూ, ప్రసూతి వైద్య విధానంలోనూ నిష్ణాతుడు, ఈయన ఆయుర్వేదానికి సంబందించిన అన్ని విభాగాలపైనా తనదైన ప్రభావం చూపెట్టాడు. పిల్లల పెరుగుదలకు సంబంధించిన ఎన్నో సూచనలను వీరి గ్రంధంలో పేర్కొన్నారు. తర్వాతివాడు జీవకుడు ఈయన మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. ఈ జీవకుడు ఒకానొక సమయంలో బుద్థునికి వైద్యాన్ని అందించాడు. ఇక నాగార్జునుడు మందుల తయారీలో అగ్రగణ్యునిగా పేరు గడించారు. ఏ వస్తువునైనా సరే, బంగారంగా మార్చగలిగే ‘పరసవేది’ విద్యలో  ఈయన సిద్ధహస్తుడని చెప్పేవారు. ఈయన రసశాస్త్రం(కెమిస్ట్రీ)ను బాగా అభివృద్ధి చేశారు. పూర్వకాలంలోనే కాదు మొన్నమొన్నటి వరకూ కూడా భారత దేశంలో ఉచిత వైద్యశాలలు వుండేవట. వాటిని పవిత్ర దేవాలయాలుగా భావించి వైద్యులను నారాయణ స్వరూపంగా భావించేవారు.డా।। పులివర్తి కృష్ణమూర్తి

Leave a Reply