Take a fresh look at your lifestyle.

స్మృత్యాంజలి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులలో ఒకరు అప్పటి కమ్యూనిస్ట్ ‌పార్టీ (సి.పి.ఐ) సభ్యుడు, హైదరాబాద్‌ ‌నగర వాసులలో ప్రముఖ వ్యక్తి, బూర్గుల నర్సింగరావు జనవరి 18న కన్నుమూశారు.
1932 మార్చి 14న బూర్గుల వెంకటేశ్వరావు, నీలాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు నర్సింగరావు. తండ్రి, పెదనాన్న బూర్గుల రామకృష్ణారావు లిద్దరూ మనదేశ స్వతంత్ర పోరాటంలోనూ, అప్పటి హైదరాబాదు సంస్థానంలో స్వయంపాలన కోసం జరిగిన పోరాటంలో ప్రధాన రాజకీయ పాత్రను నిర్వహించిన వాళ్ళు. ఆ రాజకీయ నేపథ్యంలోనే జన్మించిన నర్సింగరావు సెక్యులర్‌ ‌భావాలను రంగరించుకుని మార్యిజం, కమ్యూనిజంలవైపు ఆకర్షితులయ్యారు.
పదహారేళ్ల ప్రాయంలో, ప్రముఖ జాతీయ ఉర్దూపత్రిక ‘ఇమ్రోజ్‌’ ‌సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ ‌రజాకార్ల చేత హత్యకు గురవటం పట్టపగలు కళ్ళారా చూసిన నర్సింగరావులో ఒక అలజడికి కారణమయింది. అప్పటి నుంచే నిజాం వ్యతిరేక, రజాకార్‌ ఉద్యమ వ్యతిరేక ధోరణి ఆయనలో  నాటుకుంది. ఆ వయసులోనే హైదరాబాద్‌ ‌విద్యార్థి సంఘం మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయి మార్కి్య జం, కమ్యూనిజం ఆయన సైద్ధాంతిక ఆయుధాలుగా, ఒక ఉద్యమకారుడిగా, కమ్యూనిస్ట్ ‌పార్టీ హైదరాబాదు జిల్లా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 1949లో చంచల్‌గూడా జైలులో నిర్భంధానికి గురయ్యారు. విడుదల తర్వాత 1952 లో తిరిగి ముల్కీ ఉద్యమంలో ప్రాత వహించారు. 1955లో లక్నో లో జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయారు. అది దాదాపు 60ల వరకు కొనసాగింది.

ఒకవైపు విద్యార్థి ఉద్యమ కార్యకర్తగా ఉంటూనే ఆయన కార్మికోద్యమంలో కూడా భాగస్వాములయ్యారు. అప్పటి ఎ.ఐ.టి.యు.సి ప్రముఖులలో ఆయన ఒకరు. 60ల తర్వాత నర్సింగ్‌రావు రాజకీయ శాస్త్ర అధ్యాపకుడిగా కొంతకాలం పని చేశారు. ఆ నేపథ్యంలోనే ‘తెలంగాణ ఎఫ్లియేటెడ్‌ ‌కాలేజి టీచర్స్ ఎసోసియేషన్‌’ (••) ‌సంస్థలో వసంత్‌ ‌కన్నబిరాన్‌, ‌శతృఘ్న తదితరులతో పని చేశారు. ఎటువంటి రాజకీయ ఉద్యమాలయినా, ఏ వామపక్ష పార్టీ సంఘాలయినా న్విహించే కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేది. కమ్యూనిస్ట్ ‌భావజాలం, సెక్యులర్‌ ‌జీవితాచరణ ఆయనను అంటిపెట్టుకునే ఉంది. అయినా, తను చూసిన ఉద్యమం నుంచి విరమించుకున్న నర్సింగ్‌, ‌తర్వాత తరాల ఉద్యమాల పోకడలు, ఆచరణలతో; కమ్యూనిస్ట్ ఉద్యమం వివిధ పార్టీలుగా ముక్కచెక్కలై, లెక్కలేనన్ని సార్లు చీలిపోవటాలతో నిస్పృహ చెందారు. ఒకరకమైన నిరాసక్తత (డిసిల్యూషన్‌మెంటు) అది! అందుకేనేమో ఆయన ఒక మామూలు జీవితానికి ఏనాడు అలవాటు పడలేక పోయారనిపిస్తుంది.

బంధుమిత్రులు, స్నేహితులతో రాజకీయ చర్చలతో సమయం గడపటం ఆయనకు ప్రియమైన విషయం. ఉర్దూ భాష, సంస్కృతిలో గట్టి పట్టు ఉన్న నర్సింగ్‌ అనర్గళంగా ఉర్దూలో ఉపన్యసించేవారు. ఉద్యమ జీవిత కాలంలోనే ప్రముఖ కథకులు మగ్దూమ్‌ ‌మొహియుద్దీన్‌, ‌కైపీ అజ్మిలతో సాహచర్యం ఉండేది. ఎన్నో దశాబ్దాలుగా ఆయన సహచరులు అయిన కేశవరావు జాదవ్‌, ఎం.‌టి. ఖాన్‌, ‌రాజ బహదర్‌ ‌గౌడ్‌ ‌తదితరులందరూ కూడా అదేవిధమైన రాజకీయ అంశాలతో, హైదరాబాద్‌, ‌తెలంగాణా చరిత్రలతో ముడిపడి జీవితాలు గడిపిన వాళ్ళే ! తర్వాత తరాల వాళ్ళు, వయసులో ఆయనకంటే చిన్నవాళ్లందరితో కూడా ఆయన అదేవిధమైన మైత్రిని కొనసాగించారు. ఆయన ఇల్లు అన్ని సాయంత్రాలు మితృలతో ఆసక్తికరమైన రాజకీయ చర్చలతో గడిచేది. హైదరాబాద్‌ ‌నగర చరిత్ర, సంస్కృతి ఆయనకు  కొట్టిన పిండి. ఒకరకంగా చెప్పాలంటే ఆయనే ఒక విజ్ఞానఖని(ఆర్కైవ్‌)! ‌కాని ఇంత తెలిసిన వ్యక్తి అయినా, చర్చలలో ఎదుటివారు తనతో విభేదించినా వాళ్ళను కించపరిచే స్వభావంకాదు ఆయనది! పరస్పరం గౌరవించుకుంటూ భేదాభిప్రాయాల్ని వ్యక్తపరచాలనే ప్రజాస్వామిక ధోరణి అది! వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు వాళ్ళయినా, గంభీరమైన రాజకీయాల గురించి, మార్కి్య జం సిద్ధాంతాల గురించి చర్చించటం ఆయనకు సంతోషాన్నిచ్చేది! పదిహేనేళ్ళ ప్రాయంలో ఉన్న చెల్లెలి మనవడు రాజకీయ అంశాల గురించి పుస్తకాల గురించి ఆయనతో చర్చించటం ఈ చివరి సంవత్సరాలలో ఆయనకెంతో ఆనందం కలిగించిన విషయం.

గతరెండు మూడు దశాబ్దాలుగా నర్సింగ్‌ ‌స్వగ్రామం బూర్గులలో ఎక్కువ సమయం గడుపుతూ గ్రామాభివృద్థికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు. గ్రామ సమస్యలన్నీ పరిష్కరించే సర్పంచ్‌గా బాధ్యత నిర్వహించారు. హైస్కూలు కట్టించటానికి భూమి కేటాయించారు. పబ్లిక్‌ ‌రాజకీయాలతో ఉంటూనే కుటుంబ సభ్యులతో సమయం గడపటం, ఆవకాయలు, పచ్చళ్ళు పెట్టడం, వంటలు చేయటం ఆయనకు ఎంతో ఇష్టమైన పనులు. కుటుంబ సభ్యులందరికీ ఆయన పట్ల ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయంటే ఆశ్యర్యమేమీ లేదు. చివర్లో వినికిడి లోపం సమస్య రావటం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోవటం కష్టంగా తోచి ఆయన మితభాషిగా మిగిలి పోవాల్సిన పరిస్థితి ఎదురయింది. దాని మూలంగా కూడా అసంతృప్తి. అసహనాలకు గురయ్యేవారు. కనుమరుగౌతున్న పాతతరాల వ్యక్తులలో ఒకరైన నర్సింగ్‌ ‌ముక్కుసూటితనం, నిరాడంబరత, నిజాయితీ, సంయమనం, నమ్మిన విలువల్ని మర్చిపోని జీవితాచరణ- ఇప్పటికీ మనకు ఆదర్శాలు!.

– కె.లలిత

Leave a Reply