Take a fresh look at your lifestyle.

తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన యుగకర్త శ్రీశ్రీ

శ్రీ శ్రీ అను రెండక్షరాలతో తెలుగు సాహితీ వనాన్ని దట్టంగా అల్లుకొని విప్లవఢంకా మ్రోగించిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు.కచకుచాది వర్ణనలతోపుక్కిడి పురాణాలతో ఛందస్సుల సర్పపరిష్వంగములో బంధించబడిన తెలుగు సాహిత్యానికి కొత్త జవసత్త్వాలనుకల్పించాడు. నాయకా నాయికల అందచందాలు ఊహాప్రేయసీల వర్ణనలు ప్రణయ సందేశాలతో ఆకాశంలో విహరించిన సాహిత్యాన్ని కష్టజీవుల కన్నీటి గాథలతో భూమార్గంపట్టించి భూకంపం సృష్టించాడు. కష్టజీవికి ఇరువైపుల ఉన్నవాడే కవి అన్న పేరును నిలబెట్టిన నిజమైన ప్రజా విప్లవ కవి శ్రీ శ్రీ. తన 18వ ఏట ప్రభవ అనే కావ్యాన్ని సంప్రదాయపద్ధతిలో రాశాడు .ఆ తర్వాత గురజాడ ప్రభావంతో కొన్నింటిని మాత్రాఛందస్సులోరాశాడు.1930లో వచ్ఛిన ఆర్ధికమాంద్యం ప్రజల జీవనమును చిన్నాభిన్నం చేసింది . పేదరికం .నిరుద్యోగం ఆర్దిక అసమానతలు పెరుగుతుండడం గమనించిన శ్రీ శ్రీ తన కలాన్ని సవరించారు. సమాజంలో అనాదిగా ప్రజలను పట్టి పీడిస్తున్న మూఢవిశ్వాసాలు అభివృద్ధి నిరోధక విధానాలపై కలాన్ని ఎక్కు పెట్టారు 1 930దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే ఆ తర్వాత నేను నడిపించానని సగర్వంగా చాటుకొన్నాడు.శ్రీ శ్రీ మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యాన ఓ సంచలనం.కవిత్వం ఎట్లా ఉండాలి.కవులు ఎవరి వైపు నిలబడాలో దిశా నిర్దేశం చేసిన గొప్ప కవితా సంపుటీ మహాప్రస్థానం.జని నిష్ఠురమైన సామాన్యులు దుర్బరమైన పేదరికాన్ని అనుభవించు దీనులు మహిళలు బాధాసర్పద్ర ష్టుల పట్ల కరిగి కన్నీరొలికించే సన్నివేశాలను దృశ్యరూపంలో మన కళ్ళముందు కదలాడినట్లు అక్షరీకరించారు.

మహప్రస్థానంలోని జయభేరి గేయకవితలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ ప్రతి వ్యక్తి సమాజ మార్పు కొరకు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనీ సందెశమిచ్ఛారు.తెలుగు కవితకు ఇంత శక్తి జిగి బిగి కలదని నిరూపించిన కవిత మహాప్రస్థానంలోని కవితా ఓ కవితా.వేయి సంవత్సరాల తెలుగు సాహితి ప్రస్థానంలో దీనిని మించిన కవిత రాలేదనే విమర్శకుల అభిప్రాయం అక్షర సత్యం.కడుపు దహించుకపోయే పడుపు గత్తె రాక్షస రతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి అని వేశ్యల వ్యధాభరిత జీవిత వర్ణన గండెలను కదిలిస్తుంది. పేదలు కవితలో అంతేలే పేదల గుండెలు .అశ్రువులే నిండిన కుండలు అన్నాడు. కరోనా కబళిస్తున్న ఈ క్లిష్ట సమయంలో వలసకూలీల కష్టాలను చూసినప్పుడు ఈ కవిత గుర్తు రాక మానదు.రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతమైన ఆనందంలో గర్జించు రష్యా గాండ్రించు రష్యా .పర్జన్యశంఖంబు పలికించు రష్యా అని ఎలుగెత్తి చాటాడు .కార్మిక కర్షకుల ఘర్మ జలానికి న్యాయం జరగాలంటే దోపిడి వ్యవస్థ పోవాలన్నాడు. శ్రమైక.జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదనేది అద్భుతమైన వ్యక్తీకరణ. పెట్టుబడిదారి వ్యవస్థలో సంపద సృష్టించే శ్రామికులకు వారి శ్రమను దోచుకుంటూ సంపద పోగేసుకుంటున్న యజమానులకు నిత్యము ఘర్షణ జరుగుతుందని తద్వారా పెట్టుబడిదారి వ్యవస్థ అంతమౌతుందనే మార్క్సు సిద్ధాంతమును పరస్పర సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెనని తెల్పాడు.రచన అనగానే పద్యం అనే భ్రమలను తొలగించి సాహిత్యాన్ని సామాన్యుని ముంగిటకు తీసుకొచ్చిన ఘనత శ్రీ శ్రీ ది.

అల్పాక్షరాలతో అనల్పమైన అర్థం స్పురించే కవితా పంక్తులు శ్రీ శ్రీ రచనల్లో కోకొల్లలుగా కనబడుతాయి.మనిషి విజయం సాధించినపుడు పొగడిన నోళ్ళే అపజయంలో హేళన చేసే మానవ నైజాన్ని’ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరి పోతే నిబిడాశ్చర్యంతో వీరు.నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే..అని అలతి పదాలతో గంభీరమైన అర్థాన్ని స్పురింపజేశారు.మంటలచేత మాట్లాడించి రక్తంచేత రాగాలాపన చేయించి తెలుగు సాహితి వనాన్ని అరుణ వర్ణ శోభతో ఓలలాడించాడు.తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తీకరించే తత్త్వం కలవారు.తిక్కన వేమన గురజాడలను తాను కవిత్రయంగా భావించి వారి రచనలను రచనా శైలి గాఢంగా అభిమానించారు.దాపరికంలేని స్వభావము వల్ల శ్రీ శ్రీ కొన్ని వివాదాలకు విమర్శలకు గురియైనను తెలుగు సాహిత్యాన్ని మలుపుతిప్పిన యుగకర్తగా చరిత్రలో నిలిచి పోయాడు.

ఆయన రాసిన మహాప్రస్థానం మరోప్రస్థానం ఖడ్గసృష్టి కవితా సంకలనాలు విశేష పాఠకుల ఆదరణతో నూతనంగా కవిత్వం రాసే వారికి మార్గనిర్దేశం చేశాయి ప్రజలను అత్యంత ప్రభావితంచేసే సినిమారంగంలో అడుగుపెట్టి అనేక ప్రబోధాత్మక గీతాలను రచించారు. పాడవోయిభారతీయుడా , తెలుగువీరలేవరా పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి .దోపిడి పీడనలపై సమరశంఖమూది తెలుగు సాహిత్యానికి కొత్త నడకలు నేర్పిన ఈ మేరు శిఖరం తన 73 వ ఏట జూన్‌ 15‌వ తేదిన తుది శ్వాస విడిచాడు.ప్రపంచీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాలతో వచ్చిన మార్పులతో సృష్టించబడిన సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంది.నిరుద్యోగం పేదరికం పెరుగుతున్నది.అవినీతి లంచగొండితనం వ్యవస్థీకృతమవుతున్న క్లిష్ట పరిస్థితుల్లో శ్రీ శ్రీ కోరుకున్న సమ సమాజ స్థాపన ఆశయ సాధనలో కలిసి నడవడమే మనమంతా ఆయనకిచ్ఛే నిజమైన నివాళి.

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి
9494789731

Leave a Reply