Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మిక ఆనందం

‘‘‌మన సనాతన ఆచారాలు సాంప్రదాయాలు మానవజాతికి జీవం. తరతరాల ఆచారాలను ఒకరి నుండి ఒకరికి అందిస్తూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో  చేసేవే పండుగలు.పండుగలు చేయడంలో పరమార్థం ఆధ్యాత్మికత చారిత్రాత్మక ఆరోగ్య విషయాలు అంతరార్ధంగా ఉన్నాయి. పండుగంటే ఆనందాన్ని కలిగించేది అనడం కన్నా ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేది అనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున ‘‘భోగి’’, రెండవ రోజు ‘‘సంక్రాంతి’’, మూడవ రోజు ‘‘కనుమ’’. తెలుగు వారు చేసుకునే పెద్ద  పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి అంటే సంక్రమణం, మార్పు, సంచారం అని అర్థం.’’

మన సనాతన ఆచారాలు సాంప్రదాయాలు మానవజాతికి జీవం. తరతరాల ఆచారాలను ఒకరి నుండి ఒకరికి అందిస్తూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో  చేసేవే పండుగలు.పండుగలు చేయడంలో పరమార్థం ఆధ్యాత్మికత చారిత్రాత్మక ఆరోగ్య విషయాలు అంతరార్ధంగా ఉన్నాయి. పండుగంటే ఆనందాన్ని కలిగించేది అనడం కన్నా ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేది అనడంలో అతిశయోక్తి లేదు.సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున ‘‘భోగి’’, రెండవ రోజు ‘‘సంక్రాంతి’’, మూడవ రోజు ‘‘కనుమ’’. తెలుగు వారు చేసుకునే పెద్ద  పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి అంటే సంక్రమణం, మార్పు, సంచారం అని అర్థం.

సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన క్షణం నుండి ధనుర్మాసం మొదలైనట్లే…. దాన్నే శూన్య మాసం అంటారు. సూర్య భగవానుడు మేషం మొదలైన పన్నెండు రాశుల్లో ఒక్కోనెల ఒక్కొక్క రాశిలో ప్రవేశించి సంచారం చేస్తాడు. సూర్య భగవానుడు ధనూ రాశి నుంచి మకర రాశికి ప్రవేశించగానే మకర సంక్రాంతి. అప్పటి నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. ప్రకృతిలో స్పష్టమైన మార్పు వస్తుంది, ఉత్తరాయణంలో వాతావరణంలో మార్పులు సంభవించి పల్లెలు పాడిపంటలతో విలసిల్లుతాయి.సస్య లక్ష్మీ ప్రకాశించగా ప్రకృతి మాత కొత్త కాంతులతో శోభిల్లుతూ సూర్య భగవానుడు దివ్య కాంతులను వెదజల్లుతుంటే కొత్త ధాన్యం ఇండ్లకు రాగానే ప్రజలు సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. సూర్యభగవానుడి ప్రభావం చేత ఏర్పడే పండుగ కానుక ఈ పండుగలో సూర్యారాధన ప్రధానమైనది.

సంక్రాంతి అనగానే భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, పేరంటాళ్ళు, ముగ్గులు, గొబ్బిళ్ళు, బంతిపూల తోరణాలు, పందిళ్ళకు వేళాడే ధాన్యపు కంకులు, రేగుపండ్లు, గాదెల్లో కొత్త ధాన్యాలు, అల్లుళ్లు కూతుళ్లు చిన్నా పెద్దల హడావిడి అంతా ఇంత కాదు.డూ….డూ….. బసవన్నలు హరిలో రంగ హరి అంటూ హరిదాసులు, శంఖం పూరించే జంగం దేవుళ్ళు, అంబ పలుకు జగదంబ పలుకు అంటూ బుడబుక్కల వారి ఢమరుక నాదాలు, భోగి మంటలు, ఎడ్ల పందాలు ,గొర్రె పొట్టేలు పందాలు కోడిపందాలతో ఈ సంక్రాంతి పండుగ వేడుక తో నిండి ఏ ఇంట చూసినా సస్య లక్ష్మితో ధాన్య లక్ష్మితో కలిసి ధనలక్ష్మి తాండవమాడించే అచ్చమైన తెలుగు పండుగ.
మొదటి రోజున భోగి పండుగ జరుపుకుంటాం తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి, పాతను విసర్జించి కొత్తకు ధనానికి స్వాగతం పలుకుతాం. పాతవాటిని పోగేసి తగలబెట్టే ధుని లేదా యజ్ఞగుండం ఈ భోగి మంటలు. ఈ మంటలో వేసే గోమయంతో చేసిన గొబ్బి పిడకల పొగ ఉపిరితిత్తుల వ్యాధిని నిరోధిస్తుందని మన పెద్దల నమ్మకం. నల్ల నువ్వుల ముద్దతో తలంటి స్నానం చేసుకుని కొత్త బట్టలు ధరించి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని నల్ల నువ్వులను దానం ఇచ్చే ఆనవాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది.గొబ్బిళ్ళతో భూదేవికి పూజ.

ఆడపిల్లలు ఆవు పేడతో తెచ్చి దానితో గొబ్బిళ్ళు చేసి వాటిపై పసుపు కుంకుమలు అలంకరించి పూలను, నవధాన్యాలు, రేగు పళ్లను పెట్టి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ  పెళ్లీడుకొచ్చిన కన్నెపిల్లలు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. ఈ మూడు రోజులు ఇంటి ముందు పెట్టే గొబ్బిళ్లను సాయంత్రానికి వాటిని తీసి పిడకలు చేసి ఎండబెడతారు. ఎండిన తర్వాత వాటిని దండగా గుచ్చి మాఘ శుద్ధ సప్తమి అంటే ‘‘రథసప్తమి’’నాడు ఈ పిడకలను పొయ్యి లో పెట్టి కాల్చి ఆ వేడి తోనే భగవంతుడికి పాయసం వండి నివేదన చేస్తారు. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే పిండివంటలలో ముఖ్యమైనవి కొత్త ధాన్యం తో చేసే సకినాలు అరిసెలు. భోగి రోజున ప్రత్యేకంగా వండే భోగి పులగం.

ఈ శీతాకాల సమయంలో జీర్ణ వ్యవస్థలో కొంత మార్పులు జరుగుతాయి. తిన్న ఆహార పదార్థాలు తొందరగా అరగవు. అలాగే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి  వేడిని పుట్టించే ఆహార పదార్థాలు అంటే బెల్లం, నువ్వులు, పల్లీలు, వామును చేర్చి ఆహార పదార్థాలు తయారు చేస్తారు.సంక్రాంతి శూన్య మాసం ఆరంభం నుండి మహిళలు సంక్రాంతి ముగ్గులు,రథం ముగ్గులు, రంగురంగుల రంగవల్లికలతో వారి వారి కళా నైపుణ్యం అంతా ప్రదర్శిస్తారు. తులసి కోట దగ్గర అ ముగ్గులు వేసి ఇ దానిపై ప్రమిదలు ఉంచి దీపాలు వెలిగించి సంక్రాంతి లక్ష్మి ఆహ్వానిస్తారు. సంక్రాంతి పూల రథము ఎక్కి దేవలోకం నుండి  భూలోకానికి వచ్చి అందరిని దీవించి పోతాడు అని మన పెద్దల నమ్మకం.మూడవ రోజున కనుమ పండుగ.

మానవుని జీవన విధానం సరళిలో పశువుల పాత్ర ప్రధానం.పాడి పంటలు అభివృద్ధికి దోహదపడతాయి. పరోపకారమే ధ్యేయంగా పశువులను గౌరవించడానికి మూడవ రోజున ఈ కనుమ పశువుల పండుగ. వ్యవసాయదారులు అందరూ రూ ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు, కాళ్ళకు పసుపు పెట్టి బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి వాటికి కృతజ్ఞతలు మరియు ప్రేమను ఈ విధంగా  చాటుకుంటారు. ఆవును మనము దేవతగా, గోమాతగా పూజిస్తాం.కనుమునాడు మినుములు  తినాలని లేకపోతే యముడు ఇనుమును కొరికిస్తాడనీ  మన పూర్వీకుల నమ్మకం అందుకే ప్రతి ఇంట కనుమ నాడు మినుము గారెలను,పిండివంటలను తప్పక చేస్తారు.కొంతమంది స్త్రీలు తమ ఆచారం ప్రకారం ఊరి పొలిమేరలో ఉన్న పోలేరమ్మ, మైసమ్మ, మొదలైన గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు.’’కనుమ నాడు కాకి కూడా ఎక్కడికి బయలుదేరదనీ పూర్వపు సామెత.’’అందుకే ఆరోజున ఎవ్వరు కూడా ప్రయాణాలు పెట్టుకోరు.
బ్రహ్మకల్పం
ప్రారంభంలో ప్రళయం వచ్చి ఈ ప్రపంచం అంతా జలమయమై ఈ భూమి సముద్రంలో మునిగిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలు అలాగే నీళ్లలో ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపంలో ఈ భూమిని పైకి తెచ్చింది మకర సంక్రాంతి రోజున అని మన పురాణాలు చెబుతున్నాయి.
– కొమ్మాల సంధ్య
తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి,  ములుగు జిలా

Leave a Reply