Take a fresh look at your lifestyle.

గల్ఫ్ ‌గడ్డపై తెలంగాణ కన్నీళ్ళు

మంచి మంచి కార్పొరేటు ఆఫీసులలో అల్కటి పని ఉంటదని, కేవలం గ్లాసులు శుభ్రం చేసుడేనని మధ్యవర్తుల మాయమాటలు నమ్మి విమానం ఎక్కిన ఎందరో యువకులు ఇప్పటికీ ఎడారులలో గొర్రెలు, ఒంటెలు కాసుకుంటూ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అయిన వారితో మాట్లాడే అవకాశం లేక, నిత్యం యజమాని చేతిలో అవమానాలా పాలవుతున్నారు. పారిపోయే అవకాశం లేక పరాయి దేశాల్లోనే ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్యకు లెక్కే లేదు.

బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి…తెలంగాణా  రాష్ట్ర అవతరణకు  ముందు తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకపోయిన ప్రాంతాలివి. వెతలకు తాళలేక, బతుకు భారమైన ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ళుగా గల్ఫ్ ‌దేశాల వైపు ఆశగా చూస్తూనే ఉన్నారు. తెలంగాణకు గల్ఫ్ ‌దేశాలకు అవినాభావ సంబంధం ఉంది. సమైక్యాంధ్ర రాష్ట్రంలో నీటి సౌకర్యాలు కొరవడి, వానలు రాక, పండిన పంటకు గిట్టుబాటు లేక పొట్ట చేతబట్టుకొని తెలంగాణ రైతన్న ఎన్నో ఆశలతో గల్ఫ్ ‌బాట బట్టిండు. దుబాయి, మస్కట్‌, ‌కువైట్‌, ‌సౌది అరేబియా వంటి సుదూర ప్రాంతాలకు రెక్కలు కట్టుకుని పోయిన వారంతా  అక్కడా దగాపడి దౌర్భాగ్యకరమైన జీవితాన్ని ఎల్లదీస్తున్నారు. గల్ఫ్ అని పిలువబడే మధ్యప్రాచ్యం 70, 80వ దశకాల నుంచే భారతీయులను ఆకర్శిస్తూనే ఉంది. దక్షిణ భారతీయులు మొదటి నుంచి గల్ఫ్ ‌దేశాల పట్ల తెలియని ఆసక్తి పెంచుకున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా సంపాదించవచ్చు అనే కోరికతో చాలామంది అక్కడి ఏదో ఒక దేశానికి వెళ్ళడం మొదలైంది. లెక్కకు మించి ఆయిల్‌ ‌కంపెనీలు, కన్‌‌స్ట్రక్షన్‌ ‌కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు లేబర్ల రూపంలో దక్షిణ భారత దేశ కార్మికులను తమ కంపెనీలలో పనుల్లో పెట్టుకున్నాయి. ఇదే సమయంలో సమైక్య రాష్ట్రంలో తీవ్ర కరువు, కాటకాలు, వర్షాభావ పరిస్థితులకు తోడు నాటి ప్రభుత్వాల ప్రాంతీయ వివక్ష సగటు తెలంగాణ యువకుడిని గల్ఫ్ ‌వైపుకు చూసేలా చేసాయి.

సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఊళ్ళల్లో ఈ గల్ఫ్ ‌కార్మికులు ఉంటారు. ఒక్కో ఊరిలో రెండిళ్ళకు ముగ్గురు చొప్పున గల్ఫ్ ‌దేశాలకు వెళ్ళిన ఉదాహరణలూ ఉన్నాయి. వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక, ఉన్నా కూడా సాగు నీరు లేక ఏమి చేయాలో పాలుపోక ఎడ్లు, నాగళ్ళను అయినకాడికి అమ్ముకుని, తెలంగాణ యువత ఏజెంట్ల మాయ మాటలకు మోసపోయి వారి చేతుల్లో లక్షలు పోసి గల్ఫ్‌కు వస్తే, అప్పులు తీర్చడానికే అర్ధాయుస్సు తీరిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఉచితంగా వచ్చే వీసాలను యాభై వేల నుంచి లక్ష రూపాయలకు అమ్ముకునే ఏజెంట్లు, ఏమైనా పొరపాటు జరిగితే తమకేం తెలియదని చేతులు దులుపుకున్న సందర్భాలు కోకొల్లలు.  వచ్చిన నాటి నుంచి అక్కడి అధికారుల చేతిలో అనుక్షణం అవమానాలకు గురి అవుతూ, చేసిన బాకీలనైనా తీర్చుకుందామనే మొండిపట్టుతో అక్కడే మగ్గేవారి సంఖ్యే ఎక్కువ. తులంకు తులంన్నర చొప్పున వడ్డీకి తీసుకోని గల్ఫ్‌కి వస్తే తమ బతుకులు ఎడారి పాలయ్యాయని తెలియడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు. తల్లి, పెళ్ళాం, పిల్లలు, ఇలా మూడు తరాల కుటుంబ సభ్యులను వదిలి దేశం కాని దేశం వచ్చిన తెలంగాణ యువకులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

పని జాగలల్లో ఫోర్‌ ‌మెన్‌, ‌కఫీలు వంటి అధికారులు విపరీతమైన పనిభారంతో వీళ్ళ జవసత్వాలను పిండేస్తారు.  అక్కడి  కార్మిక చట్టాలు తెలియకా వలస కార్మికులు గొడ్డు చాకిరి చేసి ఎంతో కొంత ఎనకేసుకుని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యానికిగాని, చెడు కార్యానికి గాని హాజరు కాకా తల్లడిల్లిపోవడం తప్ప చేసేదేమీ ఉండదు. సహచరుల్లో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ఇంటికి పంపించే దిక్కుండదు. వలస కార్మికులే చందాలేసుకుని సాగనంపుతారు. కార్మికుల పరిస్థితి దుర్భరంగానే ఉంటుంది. పోలీసు రైడింగుల భయంతో అనుక్షణం అభద్రతాభావంతో బతకాల్సిందే. ఎప్పుడు పట్టుబడి, ఎన్నాళ్ళు జైళ్ళో ఉండవలసి వస్తదో కూడా తెలియని దుస్థితి. విడిపించే నాథుడు లేక, బయటకు రాలేకా, చేయని నేరానికి జైళుశిక్ష అనుభవిస్తున్న వారెందరో గల్ఫ్ ‌జైళు గోడల మధ్యలో నలిగిపోతున్నారు. మరికొందరు కార్మికులు గల్ఫ్ ‌లోనే ఒక దేశం నుంచి మరో దేశానికి అక్రమంగా వెళ్తూ, సరిహద్దులు దాటే సమయంలో పట్టుబడి అక్కడి భద్రతా దళాల చేతిలో కాల్చి చంపబడిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఇటువంటి శవాలను పట్టించుకునే నాథుడే ఉండడు. విచారణ లేకుండ అనాథ శవాల తరహాలో ఖననం చేస్తారు. తమ వాడు ఎక్కడున్నాడో తెలియక ఇంట్లో కుటుంబ సభ్యులు పడే నరకయాతన దారుణంగా ఉంటుంది.

మంచి మంచి కార్పొరేటు ఆఫీసులలో అల్కటి పని ఉంటదని, కేవలం గ్లాసులు శుభ్రం చేసుడేనని మధ్యవర్తుల మాయమాటలు నమ్మి విమానం ఎక్కిన ఎందరో యువకులు ఇప్పటికీ ఎడారులలో గొర్రెలు, ఒంటెలు కాసుకుంటూ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అయిన వారితో మాట్లాడే అవకాశం లేక, నిత్యం యజమాని చేతిలో అవమానాలా పాలవుతున్నారు. పారిపోయే అవకాశం లేక పరాయి దేశాల్లోనే ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్యకు లెక్కే లేదు. చేసే పని నచ్చకో, వేధింపులకు తాళలేకనో, లేదా తక్కువ కాలంలో ఎక్కువ సంపాదిద్దామనే ఆశతోనో కంపెనీలు వదిలి కల్లివిల్లి అయ్యేవారు ఉంటారు. వారు అక్కడి పోలీసులకు దొరికితే అంతే సంగతులు. సీదా ఇండియా విమానం ఎక్కిస్తారు. గల్ఫ్‌లో మహిళా కార్మికుల మీద అత్యాచారాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దురదృష్టవశాత్తు అవి బయటకు రావు. తెలంగాణ నుంచి గల్ఫ్‌కు వెళ్ళిన మహిళల సంఖ్య తెక్కువే అయినా, వారి అనుభవాలు కూడా చెప్పుకోదగ్గవేమి కావు. తెలంగాణ గ్రామాలలో గల్ఫ్ ‌వెళ్ళిన వారి మీద ఊరిలో అందరికి తెలియని గౌరవం ఉంటుంది. సదరు యువకుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు తమ తమ్ముడుకో, కుమారుడికో వీసా తెచ్చి ఆయనతో పాటు గల్ఫ్ ‌తీసుకెలతాడనుకునేవారు చాలా మందే ఉంటారు. కాని అక్కడి కష్టాలు ఇక్కడి వారికి చెప్పలేక సదరు యువకుడు పడే ఇబ్బంది చెప్పనలవికాదు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా గల్ఫ్‌ను సైతం వణికిస్తోంది. ఎందరో తెలంగాణా ప్రాంత కార్మికులు బిక్కు బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. కంపెనీలకు షట్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడంతో పనులు లేక పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌లతో రవాణా సౌకర్యాలు స్తంభించి దేశం వచ్చే పరిస్థితులు మృగ్యమైపోయాయి. ప్రస్తుతం అత్యంత ధీనస్థితిలో కాలం వెళ్ళబుచ్చుతున్న వలస కార్మికుల  పట్ల ఆయా దేశాల  ప్రభుత్వాలు శ్రద్ధ వహించకపోవడం శోచనీయం.  బహ్రెయిన్‌, ఒమన్‌ ‌దేశాలలో వలస కార్మికులను పట్టించుకునే నాథుడే లేడు. కేవలం ఆహర సౌకర్యాలను మాత్రమే ఏర్పాటు చేసిన కంపెనీలు రోగులను ఆసుపత్రికి తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అక్కడి కార్మికులు వాపోతున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన సౌకర్యాలు ప్రారంభించి విదేశీయులను తరలిస్తుండగా, భారతదేశంలో రవాణా వ్యవస్థ స్తంభింపజేయడంతో అక్కడి వారు స్వదేశానికి వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ‌ఖతార్‌ ‌దేశాలలో పెద్ద సంఖ్యలో కేసులు బయట పడుతుండడంతో అక్కడి అనేకమంది కార్మికులు పనులు లేక పస్తులుండవలసి వస్తోంది. వీరిలో పెద్ద సంఖ్యలో తెలంగణా ప్రాంతీయులేననేది నిర్వివాదాంశం. స్వస్థలాలకు రావాడానికి రవాణా సౌకర్యాలు లేక, టికెట్టు కొనే స్థోమత వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ నేపథ్యంలో పలు విమాన సంస్థలు టిక్కెట్ల ధరలు పెంచడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంలా తయారైంది. ఖతార్‌లో 21,331, యూఏఈలో 17,417, ఒమన్‌లో 3,224, బహ్రెయిన్‌లో 2,891, కువైట్‌లో 5,804 కేసులు నమోదు కావడం అక్కడి దయనీయ పరిస్థితులను తెలుపుతున్నాయి. ఇందులో చాలా మంది వలస కార్మికులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవలే  గల్ఫ్ ‌నుంచి వచ్చిన కొందరి వలన తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందిందని భావిస్తున్నారు. వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడంతో, అక్కడ సకాలంలో చికిత్స తీసుకొకపోవడం కూడ వ్యాధి వ్యాప్తికి కారణమైందని అధికారులంటున్నారు.

గల్ఫ్ ‌కార్మికులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఎన్‌ఆర్‌ఐ ‌పాలసి తమ జీవితాలలో వెలుగులు నింపగలదని అక్కడి తెలంగాణా కార్మికులు ఆశిస్తున్నారు. దాదాపు పది లక్షల మంది తెలంగాణా కార్మికులు గల్ఫ్ ‌ప్రాంతంలోని వివిధ దేశాలలో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వలస కార్మికులే. అక్కడే స్థిరపడిన తెలంగాణా వారి సంఖ్య అత్యల్పం. తెలంగాణా రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీని తమకు కూడ వర్తింపజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు మరణిస్తున్న వలస కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఏడాదికి దాదాపు రెండువందల వరకు ఈ మరణాలు నమోదవుతాయి. ఇందులో తెలంగాణ కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉంటారనేది నిర్వివాదాంశం. ఇలా చనిపోయిన కార్మికులను ఐదు లక్షల ఎక్స్ ‌గ్రేషియా చెల్లించాలని, ప్రతి సంవత్సరం గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఐదువందల కోట్లు కేటాయించాలని వారంటున్నారు. నిజానికి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నుంచి గల్ఫ్‌కు వలస వెళ్ళిన తెలంగాణా కార్మికులు పెద్ద అశలతోనే ఉన్నారు. దానితోపాటు ముఖ్యమంత్రి కెసియార్‌ ‌గారు సైతం పలు సందర్భాలలో గల్ఫ్ ‌కార్మికులు స్వరాష్ట్రం తిరిగి రావాల్సిందిగా కోరడంతో వారు కూడా రావడానికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తమకు ఉపాధి లభిస్తుందనే ఆశ కూడా వారిలో ఉంది.  నిజానికి గల్ఫ్ ‌దేశాల నుంచి తిరిగి వచ్చిన వారి భవిష్యత్తు అగమ్యగోచరమే. చాలమందికి ఉపాధి లభించక మళ్ళీ కూలీలుగా మారుతున్నారు. ఏజెంట్ల మోసాలతో మధ్యంతరంగా వచ్చి, చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలకు పాలుపడే వారు కూడ ఎందరో ఉన్నారు. వారందరికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపి భవిష్యత్తుకు  భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.

image.png

జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply