Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఊపందుకున్న కొరోనా వ్యాక్సినేషన్‌

  • జిల్లా, ఏరియా, సీహెచ్‌సిలలో కేంద్రాలు ప్రారంభం
  • కొత్తగా 185 ప్రైవేటు హాస్పిటల్స్‌కు అనుమతి
    ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ :

‌తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొరోనా వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాలను భారీగా పెంచింది. ఇకపై 24 గంటలూ ప్రజలకు వ్యాక్సిన్‌ అం‌దుబాటులో ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి ప్రభుత్వ జిల్లా, ఏరియా, కమ్యూనిటీ దవాఖానాలు అన్నింటిలోనూ వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైంది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 185 ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ వ్యాక్సినేషన్‌ ‌చేసేందుకు అనుమతులు ఇచ్చారు. అలాగే, తొలి దశ నుంచి కొరోనా లక్ష్యాలను సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో లబ్దిదారుల సంఖ్యను మరింతగా పెంచాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు ఒక్కో దవాఖానాలో రోజుకు 200 మందికి వ్యాక్సినేషన్‌ ‌వేస్తుండగా గురువారం నుంచి ఆ సంఖ్యను 400కు పెంచారు. మరోవైపు, ప్రైవేటు హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్‌ ‌వేయించుకునేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు అమలులో ఉన్న ఎంప్యానెల్‌ ‌హాస్పిటల్స్‌తో పాటు అన్ని రకాల ప్రైవేటు హాస్పిటల్స్‌లో కూడా కొరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల కోసం వేచి చూస్తున్నది. కేంద్రం మార్గదర్శకాలు ప్రభుత్వానికి అందిన తరువాత ప్రైవేటు హాస్పిటల్స్‌లో వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇవ్వనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కొరోనా వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైనప్పటి నుంచి  3,01,886 మంది తొలి డోసు తీసుకోగా, 1,49,905 మంది రెండో డోసు తీసుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply