Take a fresh look at your lifestyle.

అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశంపై ఊహాగానాలకు తెర

తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై ఢిల్లీలో జరిగిన అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం ఫలప్రదంగా ముగిసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ‌షెకావత్‌ ‌ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన జరిగిన తర్వాత నాలుగేళ్ళ క్రితం జలవివాదాలను చర్చించేందుకు అపెక్స్ ‌కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ కౌన్సిల్‌ ‌రెండవ సమావేశం జరిగింది. నిజానికి ఇలాంటి సమావేశాలు సంవత్సరానికి ఒకసారైనా జరగాలి. ఈ విషయాన్ని మంత్రి అంగీకరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు సంఘీభావం ఉంది. అయితే, లేని పోని వదంతులు సృష్టించి వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల ఒకే చోట కూర్చుని చర్చించుకుంటే అపోహలు తొలగిపోతాయి. తాజా సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రికి విస్పష్టంగా తెలియజేశారు. గోదావరిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల గురించి ఆంధ్రకు ఉన్న అభ్యంతరాల గురించి జగన్‌ ‌తెలియజేయగా, కృష్ణ నదిపై తెలంగాణ అభ్యంతరాలను చంద్రశేఖరరావు తెలిపారు. నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు, కొత్త ప్రాజెక్టులను నిర్మించేముందు రాష్ట్ర ప్రభుత్వాలు అపెక్స్ ‌కౌన్సిల్‌కు డిపిఆర్‌లను సమర్పించాలన్న సూచనకు ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించినట్టు షెకావత్‌ ‌చెప్పారు. నిజానికి ఈ ప్రాజెక్టులపై ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతకుముందే అనధికారికంగా చర్చలు జరిపారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో నీటి వాటాలను వాడుకోవాలన్న అంగీకారానికి వచ్చారు. అయితే, ప్రతిపక్షాలు పదే పదే అభ్యంతరాలను లేవనెత్తుతూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో వాస్తవ పరిస్థితిని వివరించేందుకే అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. జలవివాదాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఒకప్పుడు కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాలు తమలో తాము సర్దుబాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. విభజన చట్టం ప్రకారం కృష్ణా వాటర్‌ ‌బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రకు తరలించేందుకు ఈ సమావేశంలో అంగీకారం కుదిరింది. ఇరు రాష్ట్రాలలో తమ వాటా మేరకు కృష్ణా, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రులు ఇద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు చేపట్టాల్సిన పరిస్థితి రావడానికి కారణం పూర్వపు పాలకులు ఈ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడమే.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరిట ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టారు. వాటిలో చాలా ప్రాజెక్టులు 50 శాతం పూర్తి అయ్యాయి. తెలంగాణకు వరదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత ప్రాజెక్టు కింద వైఎస్‌ ‌చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఆకృతులను మార్చి కాళేశ్వరంగా పేరు మార్చింది. అలాగే, తెలంగాణలో శ్రీపాదరావు ప్రాజెక్టు, దిగువ మానేరు వంటి ప్రాజెక్టులను, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో కోయిల్‌ ‌సాగర్‌, ‌రాజీవ్‌ ‌బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను వైఎస్‌ ‌చేపట్టారు. ఇప్పుడు జగన్‌ ‌ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డి పాడు రిజర్వాయర్‌ ‌సామర్థ్యం పెంపు ప్రాజెక్టు కూడా పాతదే. అయితే, ప్రతిపక్షాలు వీటిని కొత్త ప్రాజెక్టులుగా చూపుతూ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం జరగడం, కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య అంగీకారం కుదరడం ఆహ్వానించదగిన పరిణామం. జలవివాదాలతో రాష్ట్రాల మధ్య చిచ్చు రేగడం ఎవరికీ మంచిది కాదు. కావేరీ జలాల కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వివాదం ఇంకా అపరిష్కృతంగా ఉండటానికి రాజకీయ కారణాలే కారణం. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉండటం వల్ల రాజకీయ వివాదాలతో ఇవి ఎప్పటికప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రుల సమావేశాలను ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తోంది. ఆరేళ్ళు దాటినా గోదావరి బోర్డు పరిధిపై నిర్ణయం జరగలేదు. వాటర్‌ ‌బోర్డుల పరిధిపై నిర్ణయాధికారం కేంద్రానిదే.

నదీజలాల వివాదంపై సుప్రీమ్‌కోర్టులో వేసిన కేసు ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారనీ, ఆ తర్వాత ఈ విషయంలో ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి చెప్పారు. తగవులు శాశ్వతంగా కొనసాగాలని ఇరువురు ముఖ్యమంత్రులూ కోరుకోవడం లేదు. సుహృద్భావంగానే ఈ వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. కేంద్రం మధ్యవర్తిగా ఉండి చర్చలు ఏర్పాటు చేస్తే ఎలాంటి జఠిల సమస్యలైనా దూదిపింజల్లా విడిపోతాయి. ఏటా వర్షాకాలంలో కృష్ణా, గోదావరి నదులలో లక్షలాది క్యుసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నది. ఇలా వృథాగా పోయే నీటిని వడిసి పట్టడానికే ప్రాజెక్టులను కడుతున్నట్టు ఇరు రాష్ట్రాలూ చెబుతున్నాయి. ఈ ఏడాది కృష్ణా నదిలో వరద ఎక్కువగా వచ్చింది. విజయవాడ ప్రకాశం బరాజ్‌ ‌వద్ద కృష్ణ ఉగ్రరూపం చాలా రోజులు కొనసాగింది. ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాలు చిత్తశుద్ధిని ప్రదర్సిస్తున్నందున వివాదాలు పరిష్కారం కావడం కష్టమేమీ కాదు. నదీజలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను ట్రైబ్యునల్‌కి పంపిస్తామనీ, నీటిని కేటాయించే అధికారం అపెక్స్ ‌కౌన్సిల్‌కి ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. మంత్రి సమాధానానికి ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టులపై చట్టప్రకారమే ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్ధనను పురస్కరించుకుని ఆయన ఈ స్పష్టీకరణ చేయాల్సి వచ్చింది. మొత్తం మీద ఈ సమావేశంపై వెలువడిన ఊహాగానాల కథనాలకు తెరదించుతూ కేంద్ర మంత్రి ఇరువురు ముఖ్యమంత్రులను సమాధానపర్చే రీతిలో సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయం.

Leave a Reply