- వారి ఆగడాలను అడ్డుకోవడంలో జిల్లా పోలీస్ అధికారుల పనితీరు భేష్
- కొత్తగూడెం జిల్లాలో పెరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ ప్రారంభించిన డిజిపి మహేందర్ రెడ్డి
మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ అణచివేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం నాడు ఆయన కొత్తగూడెం ప్రాంతానికి ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా చేరుకుని పెరీడ్ గ్రౌండ్ , ఫైరింగ్ రేంజ్ ట్రాక్‌ను ప్రారంభించారు. డీజీపీతో పాటు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీపి కె శ్రీనివాసరెడ్డి, నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి, ఐజీ ఎస్ఐబి ప్రభాకర్ రావు కూడా పర్యటనలో పాల్గొన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న డీజీపీని జిల్లా ఎస్పీ సునీల్ దత్ పుష్ప గుచ్ఛంతో ఆహ్వానించారు. అనంతరం పోలీస్ డిజిపి హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్న జిల్లాలలో పోలీస్ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయటం అభినందనీయమని డిజిపి తెలిపారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ యొక్క ముఖద్వారం యొక్క శిలా ఫలకాన్ని డిజిపి ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది శిక్షణ కొరకు ఏర్పాటుచేసిన బిఓఏసి ట్రాక్, ఫైరింగ్ రేంజ్ మరియు పెరేడ్ గ్రౌండ్లను ప్రారంభించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ నందు అధికారులు మరియు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో డిజిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పోలీసు వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పరచుకోవడంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలోని అధికారుల పనితీరును ప్రశంసించారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమం మరియు శిక్షణ కోసం నూతనంగా అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేయబడిన ఫైరింగ్ రేంజ్, పెరేడ్ గ్రౌండ్ మరియు ఇతర సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. చత్తీస్ఘఢ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్న ఈ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే అధికారులను అభినందించారు. ముఖ్యంగా ఓఎస్డీ తిరుపతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్పెషల్ పార్టీ సిబ్బందిని విధులలో కనబరుస్తున్న నిబద్ధతను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా, ఎప్పటికప్పుడు వారి ఆగడాలను అడ్డుకోవడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాల భర్తీ కొరకు జిల్లాలోని యువతకు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించి, వారిని పోలీసు ఉద్యోగాల్లో భర్తీ చేసుకునే విధంగా అధికారులందరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరియు ప్రజల సంరక్షణకు తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ పాటుపడుతూనే ఉంటారని అన్నారు. కొరోనా వైరస్ వ్యాప్తి నివారణ కొరకు పోలీసులు
నిర్వర్తించిన విధుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలందరూ పోలీసులు చేసిన కృషిని గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ తిరుపతి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య, భద్రాచలం ఏఎస్పీ డా.వినీత్, ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పీ ప్రసాద్, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.