తెలంగాణలో కొత్త పార్టీల ఏర్పాటు చర్చ నాలుగు చెరగుల సంచలనమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎనాడూ తెలంగాణకు జై కొట్టని వారెవరి కోసం ఇప్పుడు ఆజ్యం పోస్తున్నారని ప్రతి ఉద్యమ కారుని మనసులో మొదలైన ప్రశ్న. కొత్త పార్టీ పెట్టాలన్నా, నడిపించాలన్నా ఆషామాషి కాదు. అందుకు ఆర్థిక బలం, అంగబలం , రాజకీయ చతురుత అవసరం. తెలంగాణ ఏర్పడక ముందు ‘తల్లి తెలంగాణ పార్టీ’ని విజయశాంతి, ‘తెలంగాణ పార్టీ’ని ఆలే నరేంద్ర, ‘ప్రజారాజ్యం’ పార్టీని చిరంజీవి, ‘నవతెలంగాణ’ పార్టీని తూళ్ళ దేవేందర్ గౌడ్ నెకల్పి ప్రభుత్వ వ్యతిరేకులను కూడ గట్టడంలో విఫలమై పాలకులతో మమేకం అయిన సంగతి తెలిందే. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ , చెరుకు సుధాకర్, కోదండరామ్ పెట్టిన పార్టీలు ఏ విజయాలు సాధించాయో తెలియనిది కాదు.
ఉమ్మడి ఆంధప్రదేశ్ లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ మాత్రమే ప్రజలపక్షాన నిలిచి గెలిచి, అధికారపీఠం అలంకరించాయి. తాజాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ తీసుకొస్తానంటూ ప్రతినబూని కొత్తపార్టీ అంటున్నారు. వైఎస్ షర్మిల ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.
రాజన్న రాజ్యం తీసుకురాదలుచుకుంటే ఆంధప్రదేశ్ లో కాకుండా షర్మిల తెలంగాణలో పాటీ నిర్ణయమేంటన్న ప్రశ్న ఉదయిస్తుంది. జగన్ పై అసంతృప్తి ఉంటే, ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆంధప్రదేశ్ లొ పార్టీ పెట్టాలి గాని, తెలంగాణలో రాజకీయాలు ఎందుకని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ‘ఆంధప్రదేశ్‌లో జగన్ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. తెలంగాణలో నాపని నేను చేసుకుంటాను. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే నా లక్ష్యం.’ అనదం బాణం తెలంగాణపై సంధించడానికా? రక్షణ కోసమా? ప్రశ్నకు జవాబు త్వరలో లభిస్తుందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు, జగన్ కుటుంబానికి దగ్గరి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్, షర్మిల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, షర్మిలకు జగన్ ఆశీస్సులు ఉంటాయి.’ అని చెప్పడం రాజకీయ రంగు పులుముకుంది.
వై ఎస్ ఆర్ తెలంగాణలో పాదయాత్ర ప్రస్తావిస్తే ముఖ్యమంత్రిగా, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలోనూ ఎక్కువగానే అభిమానులు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్ మెంట్ తదితర సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొంది, ఇక్కడి రెడ్డి సామాజిక వర్గంతో పాటు,కొన్ని అట్టడుగు వర్గాలు ఆయనను గుండేల్లో దాచుకున్నాయి. వైఎస్ హఠాన్మరణం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఒక్కడిపై అన్ని రాజకీయ పక్షాలు తోచిన విధాన దాడులు మొదలెట్టాయి. వాటిని ఎదుర్కొంటూ అన్నకు తోడుగా జగనన్న విడిచిన బాణంగా చెప్పుకుని నాయకులకు భరోసా కలిగించింది షర్మిల. ఉమ్మడి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్ర ను కొనసాగించి 2013 ఆగస్టు 4 తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో నిలిచారు.
తెలంగాణలో షర్మిల పార్టీ ఎవరికి లాభం ఎవరికి నష్టం? సొంత పార్టీతో ఒంటరిగా వెళితే ఎవరి ఓట్లు చీలుతాయనేది ముఖ్యాంశం. రాష్ట్రంలో చతికల పడ్డ కాంగ్రేస్ తో టిఆర్ ఎస్ వ్యతిరేక ఓట్లు భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకున్నది. 2019 లోకసభ ఎన్నికల నాటికి రేసులో బీజేపీ తాజాగా చేదడంవల్ల దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి లాభపడింది. తెలంగాణలో రాజశేఖరరెడ్డి అభిమానులు అన్ని కులాలు, మతాల్లో ఉన్నా, షర్మిల కొత్త పార్టీ పెడితే వైఎస్ అభిమానించే క్రైస్తవులు, రెడ్డి సామాజిక వర్గయువత ఆకర్షితులయ్యే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న కాంగ్రెస్ మరింత కుంగుతుందని, తర్వాత దెబ్బ టిఆర్ఎస్ పై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
చరిత్రలో కొత్త పార్టీల ఏర్పాటు రాజకీయ శూన్యత సమయంలో జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అలాంటి పరిస్థితే లేదు. ఏపీలో ప్రతిపక్షమే లేదు. తెలంగాణలో ప్రతిపక్షం బీజేపీ రూపంలో బలపడుతోంది. అయినా కేసీఆర్ ఉనికిని దెబ్బతీసే స్థాయిలో లేదన్నది వాస్తవం.అందువల్ల బీజేపీకి ఇక ఉన్నది ఓకె మార్గం. ఓట్ల చీలిక రాజకీయం. ప్రస్తుతం కేసీఆర్‌తో ఉన్న వైయస్ఆర్ అభిమానుల వర్గం ఓట్లను చీల్చగలిగితే తనకు అవకాశం వస్తుందనే ఆశతో బీజేపీ కొత్త రాజకీయానికి తెరతీసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. షర్మిల రాక వెనక కారణమేంటన్నది రచ్చ రాజేస్తున్నది. ఇదంతా కమలనాథుల స్కెచ్ లో బాగమేనని, అమిత్ షా వదిలిన బాణమే షర్మిల అని కూడా అంటున్నారు. అయితే షర్మిల పార్టీ వల్ల ప్రభుత్వ ఓటు చీలిపోయి టిఆర్ఎస్కే ప్రయోజనం కలుగుతుందని ఇంకొందరు అభిప్రాయపడఉతున్నారు. బిహార్ లో అనుసరించిన వ్యూహంమాదిరే టీఆర్ఎస్ కు చెక్క పెట్టాలని కమలనాథులు చూస్తుంటే, అదే వ్యూహంతో బీజేపీకి షాక్ ఇవ్వాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసారని సమాచారం. చిరాగ్ పాశ్వాన్ ను బీజేపీ ప్రయోగించినట్లు.. ఇక్కడ షర్మిల బాణాన్ని వదలాలని టీఆర్ఎస్ భావిస్తున్నదని అంటున్నారు.
హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సెటిలర్స్ ఎక్కువ కాగా తెలంగాణ లోసుమారు 48 లక్షల సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. వీటిలో తొంబై శాతం గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నందున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లపై బీజేపీ ప్రభావం కనిపించింది. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని తిరుపతిలో జనసేనాధిపతి పవన్ కళ్యాన్ తో కల్సి ఇప్పటికే బీజేపీ శ్రేణులు యుద్ధం ప్రారంభించాయని చెప్పుకొచ్చారు. బిజేపీ దుకుడుకు అడ్డుకట్టావేయాలనే ఉద్ద్యేశంతో తెలంగాణలో షర్మిలను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దించారనే అభిప్రాయం ఉంది. సెటిలర్ల ఓటు బ్యాంక్ పూర్తిస్థాయిలో బీజేపీ వైపు మొగ్గు చూపకుండా వ్యూహంలో భాగంగానే షర్మిలతో కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారని బలంగా వినిపిస్తోంది. జగన్ తో స్నేహంతో కేసీఆరే షర్మిలతో పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారని అనేవారూ ఉన్నారు. ఐతే ఆమె కొత్త పార్టీ పెడతారా లేదా తేలాల్సి ఉంది. షర్మిల ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస కోనసాగుతోంది.

జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్,
సెల్ .986625535