Take a fresh look at your lifestyle.

ఈటల ఒక్కరేనా ..!

ఒక వైపు కొరోనా తో రాష్ట్రం గందరగోళ పరిస్థితిలో ఉండగా ఆ శాఖకు చెందిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌నుండి ఆ శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు బదలాయించుకోవడం, ఈటెల ఏశాఖ లేని మంత్రిగా మిగిలిపోవడం లాంటివి ఊహించని పరిణామాలు. వాస్తవంగా టిఆర్‌ఎస్‌ అధినేత, ఈటెల మధ్య కొంతకాలంగా ఏదో కోల్డ్ ‌వార్‌ ‌నడుస్తున్నదన్న వార్తలు అప్పుడప్పుడు బయటికి గుప్పుమంటూ అంతలోనే చల్లారిపోతూ వొచ్చాయి. అయితే ఇది నిమురుగప్పిన నిప్పులా ఏ క్షణాన్నైనా దహించివేస్తుందనుకుంటూనే ఉన్నప్పటికీ ఇంతతొందరగా బయటపడుతుందని ఎవరూ ఊహించలేదు.

ఉన్నట్లుండి ఈటెల రాజేందర్‌పై భూఆక్రమణకు సంబందించిన ఫిర్యాదులు రావడం, అధికూడా అధికార ఛానల్‌ ‌బయటపెట్టడం, సంబందిత భూ యజమానులతో ఇంటర్యూవులు, వారి ఆక్రందనలు, తమను భయపెట్టి ఈటెల మనుష్యులు భూములు లాక్కున్న వైనాన్ని వారు విపులీకరించడం, దీనిపైన వెంటనే విచారణ జరుపాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాలివ్వడం అంతా క్షణాలమీద జరిగినట్లుగా చకచకా జరిగిపోయాయి. అయితే విచిత్రమేమంటే ఈటెలపై వొచ్చిన భూఆక్రమణ ఆరోపణకన్నా ముందు అదే పార్టీకి చెందిన అనేకమంది ఎంఎల్‌ఏలు, ఇతర నాయకుల పైన కూడా పలు ఆరోపణలు వొచ్చాయి. అయినా వారి విషయంలో ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నది లేదు. కాని, ఈటెలపై ఆరోపణలు రావడమే తర్వాయి యాక్షన్‌ ‌ప్రారంభమైంది. విచారణ కొనసాగుతుండగానే ఆయన మంత్రి పదవిని కూడా లాక్కోవడం జరిగిపోయింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన నుంచి ఆరోగ్యశాఖను తీసివేసి తనకు కేటాయించాల్సిందిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళ సైకి లేఖ పంపించిన వెంటనే ఆమె ఆ శాఖను సిఎంకు బదాలాయించినట్లు తెలుస్తున్నది. కాగా కెసిఆర్‌-ఈటెల మధ్య కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఉద్యమం ప్రారంభంనుండి కెసిఆర్‌కు నమ్మకస్తుడిగా, అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వొచ్చిన ఈటెల ఇటీవల కొన్ని సందర్భాల్లో నర్మగర్భంగా మాట్లాడిన కొన్ని మాటలు పార్టీలో అంతర్గతంగా ఏదో జరగుతున్నదన్న విషయాన్ని చెప్పకనే చెబుతూవొచ్చాయి. ఓ సందర్భంలో ‘‘తామే గులాబీ ఓనర్లమని’’ ఈటెల పబ్లిక్‌ ‌మీటింగ్‌లో అన్నమాటలపై చాలా కాలంగానే రాష్ట్రంలో చర్చ జరిగింది. దీనిపై పార్టీలో కూడా అంతర్గతంగా తీవ్రంగా చర్చ జరిగింది. కెసిఆర్‌ ఈ ‌విషయాన్ని చాలా సీరియస్‌గానే తీసుకున్నట్లు వినికిడి. అది ఎంతదూరం వెళ్ళిందంటే ఈటెల రాజేందర్‌ ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నాడన్న వదంతులుకూడా వొచ్చాయి.

టిఆర్‌ఎస్‌లో కెసిఆర్‌ ‌ప్రభుత్వంపట్ల అసంతృప్తిగా ఉన్నవారంతా ఆయనకు అండగా నిలుస్తారన్న వార్తలుకూడా వొచ్చాయి. ఓ బహిరంగ సభలో పార్టీ పెట్టడమంటే పాన్‌షాపు నడపడంకాదని కెసిఆర్‌ ‌చేసిన కామెంట్‌ ‌రాజేందర్‌ ‌పేరెత్తకుండా నర్మగర్బంగా ఆయన గురించి చేసిన వ్యాఖ్యలేనన్న చర్చకూడా జరిగింది. మరో సందర్భంలో‘ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు… కాని శాశ్వతంగా ఓడిపోదు. కులం, డబ్బు, పార్టీ జంఢా కాదు. మనిషిని గుర్తుపెట్టుకోవాలి.. తాను ఇబ్బంది పడుతుండవచ్చు.. గాయపడుతుండవచ్చు. కాని మనస్సును మార్చుకోలేనని ,’’ ఆయన నర్మగర్భంగా అన్నమాటలు ఈటెలను ఎదో ఇబ్బందిపెడుతున్నట్లు, దానితో ఆయన తీవ్ర మనస్థాపంతో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. దీంతో మంత్రి కెటిఆర్‌ ‌జోక్యం చేసుకుని కెసిఆర్‌ ‌దగ్గరకు తీసుకెళ్ళడం, వారి మధ్య చర్చలేమి జరిగాయోగాని, ఇక కోల్డ్‌వార్‌కు పులిస్టాప్‌ ‌పడినట్లేననుకున్నారు. కాని, తాజా పరిణామాలు చూస్తుంటే నిప్పు రాజేసుకుంటున్నట్లే కనిపిస్తున్నది.

special story on etela rajendra land grabbing allegation

ఇంత జరిగినా ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పైగా అత్యున్నత విచారణ సంస్థలతో తన ఆస్తులపై విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు. తాను ఇలాంటి విషయాలకు భయపడేవాడిని కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చాడు. తనంతటతాను రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రి ఆడిగితేనే రాజీనామా చేసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయనుంచి పోర్టిఫోలియో లాగేసుకోవడంతో ఇప్పుడాయన ఏంచేస్తారో తెలియదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం మరోరకంగా స్పందిస్తున్నాయి. ఒకపక్క రాష్ట్రంలో కొరోనా తీవ్రతరంగా ప్రభలిపోతుంటే ఆ శాఖకు ప్రత్యేకంగా మంత్రిలేకుండా చేయడమేంటని విమర్శిస్తున్నాయి. నిన్నటివరకు కొరోనా చికిత్స చేయించుకుంటున్న సిఎం కెసిఆర్‌ ఆ ‌పదవిని ఎలా నిర్వహిస్తారంటూ వారు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సందు దొరికితే కెసిఆర్‌పై విరుచుపడే బిజెపి నాయకులు ఈటెల మంత్రి పదవిని లాక్కోవడంపట్ల తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు.

కెసిఆర్‌ ‌క్యాబినెట్‌లో కమిట్‌మెంట్‌తో ఎవరైనా పనిచేస్తున్నారంటే అది ఒక్క ఈటెల రాజేందరేనని నిజామాబాద్‌ ‌లోక్స భ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పేర్కొనగా, బిజెపి నాయకురాలు విజయశాంతి కూడా ఈటెలకు మద్దతుగా మాట్లాడం చూస్తుంటే బలహీన వర్గాల నాయకుడిగా పేరున్న ఈటెలను తమ వైపు తిప్పుకోవడానికి అందివచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ చూస్తున్నట్లు కనిపిస్తున్నది. కాగా నిఖార్సైన తెలంగాణబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌కు కుడిభుజంగా వ్యవహరించిన ఈటెలను కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో ఎక్కడ అడ్డుపడుతాడేమోనన్న భయంతోనే ఆయనను బలిపశువు చేస్తున్నారని కాంగ్రెస్‌పార్టీ ఎంఎల్సీ జీవన్‌రెడ్డి లాంటి వారు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా సిఎం పదవికి కావాల్సిన అర్హతలన్నీ ఈటెలకు ఉన్నాయని గతంలోనే జీవన్‌రెడ్డి పేర్కొన్నవిషయం తెలియంది కాదు. కాగా పార్టీకి చెందిన ఇతర ఎంఎల్‌ఏలపై వచ్చిన భూ ఆక్రమణ కేసులపైన ఎందుకు విచారణ జరుపడంలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. టిజెఎస్‌ ‌నాయకుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌కూడా అదే డిమాండ్‌ ‌చేస్తున్నాడు. మొత్తంమీద ఈటెల పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనమార్పుకు కారణం కాబోతున్నట్లు కనిపిస్తున్నాయి.

Leave a Reply