Take a fresh look at your lifestyle.

గోడలు – మేడలు

“గోడల్ని ఎక్కడ నిర్మించినా అవి గొప్పవాళ్ళ మేడల్ని నిలబెట్టడానికే! మేడల రక్షణ కోసమే ఎప్పుడైనా గోడలు ఉండి తీరాలి. ఈ మంత్రం ట్రంప్‌కే కాదు, మోదీజీకి కూడా తెలుసు! ఎందుకంటే ఇద్దరిదీ ఒకే స్కూలు! ఇద్దరి ఇష్టాలూ ఒకటే! పైగా ఇద్దరికీ ఇష్టమైనవాళ్లు కూడా ఒక్క (కార్పోరేట్‌) ‌జాతీయులే! ఆయన అమెరికా ఫస్ట్ అం‌టారు. ఈయనేమో మేకిన్‌ ఇం‌డియా అంటారు. ఆయనకు పొరుగు దేశస్తుల పొడ అసలే గిట్టదు. ఈయనకు ఇతర మతస్థులంటే నచ్చదు.”

modi and trump in india

గొప్పవాళ్ళు అనే వాళ్లు ఏం చేసినా గొప్పగానే వుంటుంది. గోడల్ని కూల్చినా గొప్పగానే వుంటుంది. గోడ పేర్చినా గొప్పగానే వుంటుంది. ప్రస్తుత అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ‌ట్రంప్‌నే తీసుకోండి. ఆయన వ్యక్తిత్వాన్ని నిశితంగా పరిశీలించండి. ఆయన నిజంగా ఎంత గొప్పవాడు? ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించాడు? ఎంతటి (అప) కీర్తిని మూటగట్టుకున్నాడు? మహాఅభిశ•ంసనకు అడుగు దూరానికి చేరుకోవడం ఎందరు అమెరికా అధ్యక్షులకు చేతనయింది చెప్పండి? అంతటి ‘సచ్ఛీలుడు’ మన భూమి మీద పాదం మోపబోతున్నాడంటే ఎంతటి విశేషాంశమో ఆలోచించండి. తమ హయాంలో అతను ఇక్కడికి విచ్చేస్తున్నందుకు మన పాలకులు గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకుని వుంటారు చెప్పండి? ఇట్లాంటి ఘనత వహించిన వ్యక్తికి ఎట్లాంటి స్వాగతం పలకాలి? ఎట్లాంటి ఆతిథ్యం ఇవ్వాలి? కనీ వినీ ఎరుగని ఆహ్వానాన్ని ఆయన కలగన్నట్లు వార్తలు వచ్చాయి. (అందులొ ‘‘వ్యాపార కల’’దే సింహభాగమన్నది వేరే విషయం). మరి ఈ ఆతిథ్యం ఆయన అంచనాలకు గనుక తగ్గినట్లయితే అది ఎంత అవమానం! సూటూ, బూటూ వేసుకొని వస్తున్నందుకు గాను తనకు కనీసం కోటి మందితో స్వాగతం పలకాలని మన మోదీ గారికి ఆయన ‘మెనూ’ ఒకటి పంపించాడట! ఆయన కోటి మందితో స్వాగతం పలకమని మాత్రమే చెప్పాడు(ట). కానీ మిగిలిన కోట్లాది మంది దరిద్రుల్ని ఎక్కడికి పంపాలో లేక ఎందులో ••లపాలో మాత్రం చెప్పలేదు.

ఆయన గారు చెప్పనంత మాత్రాన మన పాలకులు ఊరికే చేతులు ముడుచుకుని కూర్చుంటారా చెప్పండి! అతడి అంతరంగం మనవాళ్లకు అర్థం కాదా ఏమిటి? అందుకే వీళ్లు దరిద్రుల్ని దాచిపెట్టే ‘దారుల’ను క్షణాలలోనే కనిపెట్టేశారు. ఇంకేముంది ఆమెరికా-మెక్సికో దేశాల మధ్య గోడ కట్టిస్తానన్న ట్రంప్‌ ‌కోసం ఏకంగా గోడను నిర్మించే కార్యమానికి గొప్పగా శ్రీకారం చుట్టేశారు. ట్రంప్‌గారు మెక్సికోలో అనుకున్న చోట అనుకున్న విధంగా గోడ నిర్మించ లేకపోయినా మన పాలకులు మాత్రం గుర్తుపెట్టుకొని ఆయన కోసం మన దేశంలో మరీ గోడలు కట్టించి స్వాగతం పలికారు. రాజును మించిన రాజభక్తి ఇది! మొత్తానికి అహ్మదాబాద్‌ ‌మురికి వాడలు అమెరికా అయ్యగారికి కనిపించకుండా రోడ్డుకు ఇరువైపులా గోడల్ని కట్టేశారట! గుజరాత్‌ను అంత గొప్పగా అభివృద్ధి చేసినప్పుడు ఈ అడ్డుగోడలు కట్టడమెందుకనే ప్రశ్న ఎవరికైనా సహజంగానే వస్తుంది కదా! మన పాలకులు కేవలం అభివృద్ధిని మాత్రమే చూపించాలని అనుకుంటున్నారు. దరిద్రాన్ని ట్రంప్‌ ‌కంట పడకుండా దాచిపెట్టాలనుకుంటున్నారు. అభివృద్ధిని మాత్రమే చూపిస్తున్న సందర్భంలో అనుకోకుండా ఆ గోడల వెనుకవున్న అలగా జనం కనిపిస్తే – వాళ్లతో పాటుగా వాళ్ల ఆనవాలు కూడా కనిపిస్తే ట్రంప్‌ ‌గారికి ఎంత కంపరంగా వుంటుంది మరి..

కాబట్టి దేశాల మధ్యనే కాదు ప్రాంతాల మధ్యా – పల్లెలు-పట్టణాల మధ్యా ఆ మాటకొస్తే ధనికులూ -పేదవారి మధ్య కూడా గోడలను మొలిపించడం తక్షణావసరం. అందరికీ తెలియవలసిన సత్యమేమిటంటే గోడల్ని ఎక్కడ నిర్మించినా అవి గొప్పవాళ్ళ మేడల్ని నిలబెట్టడానికే! మేడల రక్షణ కోసమే ఎప్పుడైనా గోడలు ఉండి తీరాలి. ఈ మంత్రం ట్రంప్‌కే కాదు, మోదీజీకి కూడా తెలుసు! ఎందుకంటే ఇద్దరిదీ ఒకే స్కూలు! ఇద్దరి ఇష్టాలూ ఒకటే! పైగా ఇద్దరికీ ఇష్టమైనవాళ్లు కూడా ఒక్క (కార్పోరేట్‌) ‌జాతీయులే! ఆయన అమెరికా ఫస్ట్ అం‌టారు. ఈయనేమో మేకిన్‌ ఇం‌డియా అంటారు. ఆయనకు పొరుగు దేశస్తుల పొడ అసలే గిట్టదు. ఈయనకు ఇతర మతస్థులంటే నచ్చదు. ప్రత్యర్థుల్ని వేటాడడంలో ఇద్దరిదీ ఒకే ఆట! అవహేళన చేయడంలో ఇద్దరిదీ ఒకే మాట! మనుషుల్ని మాయజేయడంలో ఇద్దరిదీ ఒకే బాట! ఇద్దరూ సంప్రదాయ వాదులే! కానీ సంప్రదాయాల్ని తుంగలో తొక్కడంలో ఇద్దరూ ఇద్దరే! అందుకే గోడలు కట్టడం లాంటి ఆలోచనలు వీళ్లకు మాత్రమే పుడతాయి. చూడబోతే ‘గోడ••ట్టు’ గొప్ప కనికట్టు విద్యలాగా కనిపించడం లేదూ! దరిద్రాన్ని దాచిపెట్టడానికి తక్షణం పనికి వచ్చే దివ్యమైన ఔషధం ఇది అని అనిపించడం లేదూ? తాము చేశామనుకుంటున్న అభివృద్ధిని లోకం ముందుకు తీసుకు రావడంలో సాధించిన ఇంతటి అధునాతన అర్థశాస్త్ర ఆవిష్కరణలకు గాను ముందుగా వీళ్లిద్దరికీ ఉమ్మడిగా నోబెల్‌ ‌బహుమతిని ప్రదానం చేయాలి..! ఆ తరువాత ఈ ఆవిష్కరణ యొక్క అసలు సారాన్ని ప్రపంచంలోని మిగతా పాలకులందరికీ పరిచయం చేయాలి! ఉన్నట్టుండి మన దగ్గరికి ఊరికే రారు కదా మహానుభావులు! ఏవో కొన్ని ఉత్పాతాలను వెంటపెట్టుకునే వస్తారు. ఓట్ల గాలాన్ని ఒడుపుగా ఒక చేతబట్టుకొని ఇంకా కొన్ని ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని చూస్తారు. ఇప్పటిదాకా మనం కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలనూ జాగ్రత్తగా పరిశీలించండి.

ఎన్ని ఒప్పందాల మూలంగా మన దేశానికి ఎంత లబ్ధి చేకూరి ఉంటుందో కనిపెట్టండి! అసమానుల మధ్య ఒప్పందాలెప్పుడూ అసమానంగానే వుంటాయి! ఒప్పందం ఏదైనా అది చెప్పేది ఒక్కటే! మనం నష్టపోతూ, నష్టపోతూ.. అమెరికన్లకు కావలసినంత లబ్ధి చేకూర్చడమే! మన జాతి సొత్తును వాళ్ళ కార్పోరేట్‌ ‌శక్తులకు అప్పనంగా ధారాదత్తం చేయడమే! అమెరికాతో ఒప్పందం అంటే అది ఒక ధృతరాష్ట్ర కౌగిలి! భస్మాసుర హస్తం! వామనుని మూడో పాదం! ఒక అడుగు అహ్మదాబాద్‌ ‌మీద-ఇంకొక అడుగు ఢిల్లీ మీద పెడుతున్నాడు ట్రంప్‌ ‌మహాశయుడు. మూడో అడుగు ఎక్కడ పెట్టాలని మాత్రం అడగనైతే అడగలేదు. ఆయన అడగనంత మాత్రాన మనం మురిసిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే్క డ పెట్టాలో అడుగును అక్కడే పెడతాడు. మన పాలకుల్ని తప్పకుండా మెలి (వడి) పెడతాడు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. అది మనకు అర్థమయ్యే లోపే ఆయన విమానమెక్కి హాయిగా అమెరికా చేరుకుంటాడు.
– ‌గుండెబోయిన శ్రీనివాస్‌
9985194697

Leave a Reply