Take a fresh look at your lifestyle.

గల గల గోదావరి…. మండుటెండల్లో మహో‘జ్వల’ ఘట్టం

  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
  • నదికి కొత్త నడక….10రోజుల్లో నిజాంసాగర్‌లోకి గోదావరి నీళ్లు
  • 15వేల ఎకరాల ఆయకట్టుకు నీరు
  • పాములపర్తి వద్ద గోదావరి జలాలలకు ప్రత్యేక పూజలు
  • హల్దీ వాగు, గజ్వేల్‌ ‌కాల్వలోకి కాళేశ్వరం జలాలు
  • విడుదల చేసిన సిఎం కేసీఆర్‌
  • ‌సిఎం కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించిన రైతులు, పార్టీ శ్రేణులు
  • జై కేసీఆర్‌ అం‌టూ పెద్దపెట్టున నినాదాలు 

మండుటెండల్లో మహో‘జ్వల’ ఘట్టం. కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చేపల మాదిరి జలలాలను ఎదురెక్కించి నదికి కొత్త నడక నేర్పిన కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో ఈ అపూర్వ ఘట్టానికి సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్‌ ‌నియోజకవర్గం వేదికైంది. తెలంగాణ సరికొత్త జల చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానంను సంపాదించుకుంది. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని పదే పదే చెప్పే సిఎం కేసీఆర్‌.. ఈ ‌క్రమంలో మరో ముందడుగు వేశారు. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన కేసీఆర్‌ ‌కార్యాచరణ నేడు మరో కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్‌ ‌మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్నాయి. నేడు ఆ జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్‌ ‌జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాంసాగర్‌కు తరలించే కార్యక్రమం చేపట్టారు సిఎం కేసీఆర్‌. ‌దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ బీడు భూములను బంగారు పంటలు పండే మాగణాలుగా మార్చి తెలంగాణను సస్య శ్యామలం చేసేందుకు కంకణ బద్దులై నదికి సరికొత్త దిశ, దశను నిర్దేశించిన తెలంగాణ విధాత, అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు స్వయంగా  మరో చారిత్రక ఘట్టంను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, మంత్రులు తన్నీరు హరీష్‌ ‌రావు, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డితో కలిసి గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని అవుసులపల్లి, పాములపర్తి వద్ద  అవిష్కరించారు. మొదట కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ ‌మండలం అవుసులపల్లి వద్ద  సంగారెడ్డి కెనాల్‌ ‌నుంచి హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల కాళేశ్వర జలాలను విడుదల చేశారు.

8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలు గల గల పారుకుంటూ చేరనున్నాయి. హల్దీ, మంజీర నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాల విడుదలతో 32 చెక్‌ ‌డ్యాంలు నిండనున్నాయి. చెక్‌ ‌డాంలలో 0.62 టిఎంసిల నీరు నిల్వ ఉండనుంది. గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో పలు గ్రామాలలో  14 వేల 268 ఎకరాల లోని వరి పంటను రక్షించినట్లయింది. అ వెంటనే మర్కూక్‌ ‌మండలంలోని పాములపర్తి వద్ద  కాళేశ్వర జలాలను గజ్వేల్‌ ‌కాల్వలోకి విడుదల చేశారు.

 

జలాల విడుదల సందర్భంగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి తన్నీరు హరీష్‌రావు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. హల్దీవాగు, గజ్వేల్‌ ‌కాల్వలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌నుంచి గోదావరి జలాల విడుదల సందర్భంగా వొచ్చిన సిఎం కేసీఆర్‌కు గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా రైతులు, ప్రజాప్రతినిధులు అపూర్వమైన స్వాగతం పలికారు. కేసీఆర్‌ ‌ప్రయాణించిన వాహనంపై పూలవర్షం కురిపించారు. జై కేసీఆర్‌ అం‌టూ ప్రజల నినాదాలు చేశారు. అవుసులపల్లి, పాములపర్తి రెండూ చోట్ల కాల్వలలోకి గోదావరి జలాల విడుదల అనంతరం సిఎం కేసీఆర్‌, ‌మంత్రులు విజయ సంకేతం చూపారు.  ఇదిలా ఉంటే, గోదావరి జలాలను తెలంగాణ జిల్లాల్లోకి తరలించేందుకు మేడిగడ్డ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించారు. అక్కడి నుండి సంగారెడ్డి కాలువ ద్వార హల్దీ వాగులోకి విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పత్రష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలను కూడా అంతే అట్టహసంగా  ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ఉధృతమవుతుండటంతో ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని నిరాడంబరంగా చేపట్టారు.

 

ఈ కార్యక్రమంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, మంత్రులు తన్నీరు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎంపిలు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, ‌కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి.పాటిల్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ ‌రెడ్డి, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్‌, ‌ఫరీదుద్దీన్‌, ‌జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ‌రజత్‌ ‌కుమార్‌,  ‌ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి  స్మితా సబర్వాల్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామా రెడ్డి, ఈఎన్‌సి మురళీధర్‌రావు,  ఇరిగేషన్‌ ఈఎన్‌సి హరిరాం, డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పోచారంకు స్వల్ప అస్వస్థత అంటూ ప్రచారం…

అవాస్తవమంటూ పిఆర్వో మాధవరెడ్డి ప్రకటన
కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌నుంచి గోదావరి జలాలలను హల్దీవాగు, గజ్వేల్‌ ‌కాల్వకు సిఎం కేసీఆర్‌ ‌విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కేసీఆర్‌తో వొచ్చిన అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారనీ… అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం  హైదరాబాద్‌ ‌తరలించారంటూ ప్రచారం జరిగింది. టెలివిజన్‌ ‌ఛానల్స్‌లోనూ స్క్రోలింగ్‌ ‌కూడా వేశారు. అయితే, అదంతా అవాస్తవమనీ ఆయన పిఆర్వో మాధవరెడ్డి తెలిపారు. స్పీకర్‌ ‌పోచారం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఎటువంటి సమస్యలు లేవు.  కొండపోచమ్మ సాగర్‌ ‌నుండి హల్దీ వాగులోకి నీటి విడుదల కార్యక్రమంలో స్పీకర్‌ ‌పోచారం హుషారుగా పాల్గొన్నారు.  సన్నిహితులు, అభిమానులు, మిత్రులు, మీడియా ప్రతినిధులు ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని, అనవసర వార్తలను ప్రసారం చేయొద్దని ఆయన పిఆర్వో మాధవరెడ్డి కోరారు.

Leave a Reply