- స్మార్ట్ రోడ్ల పనులు పూర్తి చేయాలి
- హన్మకొండ, వరంగల్‌లో ఐలాండ్ల ఏర్పాటుకు చర్యలు
- గ్రాండ్ ఎంట్రెన్స్ ప్రాంతాలలో రోడ్ల విస్తరణ
- నగరంలో 20 పార్కులు ఏర్పాటు చేయాలన్న కలెక్టర్
- కలెక్టరేట్లో స్మార్ట్ సిటీ పనులపై సమీక్ష సమావేశం
వరంగల్ అర్బన్, జనవరి 17, (ప్రజాతంత్ర ప్రతినిధి): నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హృదయ్ పథకంలో భాగంగా కుడా చేపడుతున్న వేయిస్తంభాల ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులను పూర్తయ్యేలా చూడాలని కమిషనర్‌కు సూచించారు. అమృత్ పథకంలో భాగంగా మొత్తం 33 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కోసం ప్రతిపాదించగా ఇప్పటి వరకు 31 పూర్తిగా చేయడం జరిగిందని కోమటిపల్లి, పెద్దమ్మగడ్డ ప్రాంతంలో పూర్తి కాలేదని సూచించగా ఆర్డిఓతో మాట్లాడిన కలెక్టర్ వీటిని వెంటనే పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందులో ఏమైనా కోర్టు సంబంధిత అంశాలు పెండింగ్‌లో ఉంటే మున్సిపల్ సిబ్బంది ఒకరిని హైకోర్టు యందు ఉంచి వీటిని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కమీషనర్‌ను ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ సిబ్బంది, కాంట్రాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎన్సిసి వారితో సమావేశం నిర్వహించి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. హనుమకొండలో 5, వరంగల్‌లో 5 ప్రాంతాలలో ఐలాండ్స్‌ను గుర్తించి వాటికి ఫౌంటెన్ ఏర్పాటుతో పాటు లైటింగ్ ఏర్పాటు చేసి సుందరంగా ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు. నూతన నమూనాలను కొనుగోలు చేసి వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని కలెక్టర్ అన్నారు. స్మార్ట్ సిటీ రోడ్ల విషయంలో ఎక్కడైతే రోడ్ సమస్య ఉందో అక్కడి నుండే నిర్మాణం ప్రారంభించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. స్మార్ట్ సిటీ రోడ్డుకు సంబంధించి హన్మకొండ చౌరస్తా నుండి హంటర్‌రోడ్డు వరకు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఆర్1 రోడ్డుకు ఇరువైపులా కొన్ని ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయని ఇంచార్జి సిపి సూచించగా వాటిని క్లియర్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఏజెన్సీలు నిర్వహిస్తున్న పనులు జనవరి 26 లోగా పూర్తి కావాలని కలెక్టర్ అన్నారు.
ఆర్2 రోడ్ ఐన కాపువాడ నుండి భద్రకాళి వరకు, ఆర్3 రోడ్ అయినా అలంకార్ బ్రిడ్జి నుండి దర్గా వరకు, ఆర్4 రోడ్ ఐన భద్రకాళి నుండి మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వరకు గల నిర్మాణ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. 11 కెవి ఎలక్ట్రికల్ పనులు పూర్తి కావాలని సూచించగా ఇప్పటికే 98శాతం పనులు పూర్తయ్యాయని తెలుపగా ఎలక్ట్రికల్ ఎస్.ఈ అండ్ డి.ఈ లతో సహకరించుకొని పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. భద్రకాళి బండ్ పై కొనసాగుతున్న డి-జోన్, ఈ-జోన్ పనులు డిసెంబర్ లోనే పూర్తి కావాల్సి ఉండేనని, ఇప్పటివరకు పూర్తి కాలేవని, రెండు షిఫ్తులలో పనిచేసి వాటిని పూర్తి చేయాలని, పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లతో టైం లైన్ అగ్రిమెంట్ తీసుకోవాలని లేకుంటే పెనాల్టీలు విధించాలని కమీషనర్ కు సూచించారు. నగరానికి నాలుగు పైపుల గ్రాండ్ ఎంట్రెన్స్‌లో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని ఇందుకు సంబంధించి రోడ్ ల విస్తరణ కార్యక్రమం కరీంనగర్ వైపు, నర్సంపేట వైపు నుండి ప్రారంభించాలని, వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని, ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు తనకు పూర్తి సమాచారాన్ని అందజేయాలని కలెక్టర్ అన్నారు. భద్రకాళి బండ్ నిర్మాణ పనులకు సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మించాలని కలెక్టర్ ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. పబ్లిక్ గార్డెన్, ఏకశిలా పార్క్ లలో అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ కమిషనర్ కు సూచించారు. హైదరాబాద్ వైపు నుండి వరంగల్ వచ్చే ప్రాంతంలో నిర్మించే గ్రాండ్ ఎంట్రన్స్ కు కాకతీయ వైభవానికి సంబంధించిన చిత్రాలు ఉండాలని, నర్సంపేట వైపు నిర్మించే గ్రాండ్ ఎంట్రెన్స్ కు టెక్సటైల్ నమూనా చిత్రం ఉండేలా చూడాలని, కరీంనగర్ వైపు నిర్మించే ఎంట్రెన్స్ నకు ఎడ్యుకేషన్ సంబంధిత చిత్రాలను, ఖమ్మం వైపు నిర్మించే ఎంట్రన్స్ కు కాకతీయ వైభవానికి సంబంధించిన చిత్రాలు ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు.
స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా 100 ఎం.ఎల్.డి. సామర్థ్యంతో రెడ్డిపురంలో, 50 ఎం.ఎల్.డి. సామర్ధ్యంతో బంధం చెరువు ప్రాంతంలో, 5 ఎం.ఎల్.డి. సామర్థ్యంతో ఉర్సుగుట్ట ప్రాంతంలో నిర్మించనున్న సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్.టి.పి) జనవరి 2021 వరకు పూర్తి కావాలని కలెక్టర్ అన్నారు. ప్రతివారం ఇంజనీరింగ్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించాలని, ఎప్పటికప్పుడు వాటి యొక్క గ్యాప్ లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కనీసం 2-3 డివిజన్లకు ఒక పార్క్ చొప్పున 20 పార్కులు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కమీషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ మను చౌదరి, ఎస్.ఈ భాస్కర్ రెడ్డి, ఎం.హెచ్.ఓ. రాజా రెడ్డి, ఇంచార్జి సిపి నర్సింహ రాములు, ఈ.ఈ. లు రాజయ్య, శ్రీనివాస రావు, డి.ఈ. లు రవికుమార్, సంతోష్ రవీందర్, నరేందర్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ వోలెటి తదితరులు పాల్గొన్నారు.
Tags: warangal urban, collector, prashanth, smart city mission 2020, R2 code