లాక్డౌన్ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఎస్పీ
లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కొరోనా ను కట్టడి చేద్దామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించడంతో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం కొరోనా పరీక్షలు చేసినవారిలో కేవలం 1.6 శాతం మందికి మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు కావడం శుభపరిణామం అన్నారు. ఇది జిల్లా ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
పట్టణ శివార్లలోని కాలనీలో బందోబస్తు అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత ఐడీ కార్డు/పాస్ విధిగా తమతో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సమయంలో అనుమతుల కోసం ఇప్పటివరకు 4259 ఆన్లైన్ దరఖాస్తులు రాగా 1983 దరఖాస్తుదారులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో మిగతా దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేవని వెల్లడించారు.
వ్యవసాయదారులు, సంబంధిత వ్యాపారులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా సంబంధిత డీఏవో, మార్క్ ఫెడ్ అధికారులు జారీ చేసిన పాస్, పత్రాలతో రావాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి ఒక్కరి కృషి ఫలితమే నేడు విజయవంతమైన ఫలితాలు అన్నారు. రానున్న రోజుల్లో ఇలాగే నిబంధనలు పాటిస్తూ కొరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్. శ్రీనివాస రావు, బి. వినోద్ కుమార్, డీఎస్పీలు ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, కె. ఉమామహేశ్వరరావు, వీపూరి సురేష్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.