- దీక్షిత్‌ను చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు
- కిడాప్ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి
- దీక్షిత్ హంతకుల ఎన్కౌంటర్ వార్తలను ఖండించిన ఎస్పీ
ప్రజాతంత్ర, మహబూబాబాద్: మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ వ్యవహారం విషాదంగా ముగిసింది. కిరాతకులు దీక్షిత్‌ను చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మహబూబాబాద్‌లో కిడ్నాప్ అయిన దీక్షిత్ రెడ్డి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. డబ్బులు కోసం తోబుట్టువుకు కడుపుకోత మిగిల్చాడు. మేల్లుడిని దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. గత ఆదివారం కిడ్నాప్ చేసిన దీక్షిత్ రెడ్డిని కిడ్నాపర్లు రెండు గంటల్లోనే చంపేశారు. కిడ్నాప్‌కు సూత్రధారుడు మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద సాగర్ అనే వ్యక్తితో కలిసి బాలుడిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్‌కు 5 కిలోవి•టర్ల దూరంలోని గుట్టలో బాలుడి మృతదేహం లభించింది. కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
దీక్షిత్ హంతకుల ఎన్కౌంటర్ వార్తలను ఖండించిన ఎస్పీ
మహబూబాబాద్ కృష్ణా కాలనీకి చెందిన దీక్షిత్ రెడ్డి(9) హత్య కేసులో నిందితుడు మందసాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీక్షిత్ రెడ్డిని ఎక్కడైతే హత్య చేశారో అదే ప్రాంతంలో నిందితుడిని ఎన్కౌంటర్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. మందసాగర్‌ను ఎన్కౌంటర్ చేయలేదని, అతను తమ అదుపులోనే ఉన్నాడని స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేశామన్నారు. మంద సాగర్‌తో పాటు మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటి వరకైతే దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి, హత్య చేసింది మంద సాగర్ అని విచారణలో తేలిందని, మనోజ్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.