పాటను పంచామృతంగా
ఆబాలగోపాలానికి రుచి చూపి
శత కోటి మనస్సులు దోచిన
నీ సుస్వర ఝరి అజరామరం !
ఆధునిక అన్నమయ్య
నేటి అపర నాటి త్యాగయ్య
భక్తి రాగాలకు భక్త రామదాసు
స్వరాలకు సరస్వతి పుత్రుడు !
‘శ్రీపతి’ దీవెనలు తోడై
‘పండితారాధ్యుల’ పాటగాడు
పిల్లల్లో తనో పసి ‘బాలు’డు
‘సుబ్రహ్మణ్యం’ భక్తిపరుడు !
అద్వైత సిద్ధికే కాదు
అమరత్వలబ్దికీ గానాన్ని
సోపానం చేసుకొని మనకిచ్చి
దివికేగెను గాన గంధర్వుడు !
మాటల మాంత్రికుడు
సహజత్వ నటశేఖరుడు
డబ్బింగుల్లో కంఠస్వరధీరుడు
సుస్వర సంగీతకారుడు !
నీ పాట అమ్మ ఒడి
నీ గానం నాన్న చేయి
నీ రాగం తెలుగు గుడి
నీ గాత్రం గుడి గంట !
బహుభాషా గానకోవిదుడు
భాషకే వన్నె తెచ్చిన ధీరుడు
తెలుగింటి పాటల తోరణం
భరతావనికే స్వరాభిషేకం !
నీ పాటకు మరణం లేదు
నీ రాగానికి విరామం లేదు
నీ వాక్కుకు తిరుగే లేదు
నీ నటనకు హద్దులు లేవు !
నీవే మా పాటకు ఊట
నీవే మా చెలిమి చెలిమె
నీవే మా భాష శ్వాస
నీవే మా రేపటి రాగం !
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్ – 99497 00037