Take a fresh look at your lifestyle.

‘‘సోయి తప్పిన రాత’’

“మహోన్నతమైన చరిత్ర లిఖించుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి ఊపిరులూదిన మన సాహిత్యం, కళలు వందల వేల కొత్త కలాలకు, గొంతుకలకూ పురుడు పోసింది. చీమలదండు లాగా జనాన్ని కదిలించిన సత్యానికి జేజేలు కొట్టిన ఏలికలు ఇప్పుడు ఆ సాహిత్యం, కళలను నిషేధం పాల్జేస్తూ, ఖైదు చేస్తూ తన నైజాన్ని చాటుకుంటున్నారు. సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు సాహిత్యమే జనాలను చైతన్య పరుస్తుందని తెలుసు కాబట్టే మళ్ళా గొంతు సవరించుకున్నారు. ఇటీవల కరోనా వ్యాధిపై జాగరూకత కోసం తెలంగాణ కళలు తమ సేవలను అందించాలని పిలుపు నిచ్చారు. ఈ ద్వంద్వ ప్రమాణాల నైజాన్ని గుర్తించటం మన తక్షణావసరం.”

సాహిత్యం, కళలు సామాజిక ప్రయోజనాల కోసమనే ప్రధాన అంతస్సూత్రాన్ని మరిచిపోతే ఆయా సమాజాల ఉనికి మరుగున పడుతూంది. ఏలికల పుణ్యమాయని ఇటీవల తెలంగాణ సాహిత్యం, కళలు ఈ మట్టి పొత్తిళ్ళ వారసత్వాన్ని మరిచి వంధిమాగధ గేయాలు పాడుతూ తమ అస్థిత్వాన్ని కోల్పోతున్నట్టుగా వుంది. ఉద్యమాలకు ప్రాణం పోసే సాహిత్యం, ప్రశ్నించే వారసత్వాన్ని ఏలికల కాళ్ళకాడ తాకట్టు పెట్టే దుస్థితికి చేరుకున్నట్టుగా భావించాల్సి వస్తూంది. ఈ అపభ్రంశపు సాహిత్య కూటముల సాహితీ సేవలతో భవిష్యత్‌ ‌సమాజానికి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది.

ఆధునిక సాహితీ కాలంలో వచన కవిత, గేయం, కథ, నవల, విమర్శ వ్యాసం, తదితర ప్రక్రియలు విశేషంగా రాయబడ్తున్నాయి. అనేక సామాజిక ఉద్యమాలకు ఆనాటి సాహిత్యం క్రియాశీలక కార్యకర్తగా తన బాధ్యతలను నెరవేరుస్తూన్నది. అనుభవాలు, అవసరాల నుండి పురుడు పోసుకునే సాహిత్యం వేదిక లెక్క
కున్నా పదికాలాలపాటు నిలిచి వుంటుందనేది సత్యం. కాలపు అవసరాలకు తగినట్టుగా ఆయాకాలపు సాహిత్య సృజన జరుగుతూనే వుంది.సామాజిక హితం కోరే సాహిత్యం ఎన్ని ప్రక్రియలు విలసిల్లినా కూడా మెజారీటీ ప్రజలకు చేరువ కాగలిగే ప్రక్రియల్లోనే చివరికంటా బతుకుతుంది. రాత ద్వారా రచయిత గుర్తించబడేవారు. ఇప్పటి కాలంల రచయిత ద్వారానే రాత గుర్తించబడుతూంది.

మనం ఇప్పుడు డిజిటల్‌ ‌యుగంలో వున్నాం. రాయటం అనేది తగ్గుముఖం పడుతూన్నది. సాహిత్యం విషయంలో కొన్ని ప్రక్రియలు మరుగునపడ్డాయి. తెలంగాణ సాధన కోసం హోరెత్తిన ఉద్యమంలో గేయం, వ్యాసం, కథ ఉనికి చాటాయి. కమిట్‌ ‌మెంట్‌తో, ఉద్యమాలతో జీవిస్తున్న వారు రాసిన, పాడిన పాటలు, రాసిన సాహిత్యం జనాలను చైతన్యపరచటానికి దోహదం చేశాయి. ఆ తరువాత ఆటపాట రాతలపై అప్రకటిత నిషేధం మొదలయింది. ఈ నేపథ్యంలో నేడు ఏలికల భక్త మండలులు రాస్తున్న‘‘భజన’’ పాటలు, ప్రక్రియలు వేదికలెక్కితే, మిగతా ప్రక్రియలకు రాయటం కాదుగదా, చదవటం, వెంబటి వుంచుకోవటం కూడా నిషేధమైంది.
వామపక్ష భావజాలం గల ప్రజాసంఘాలు, మహిళా ఉద్యమాలు, జానపద సాహిత్యం ఏవైనా కానీ వాటికుండే ప్రయోజనాలు సమాజ హితానికి సంబంధించినవి. కాబట్టి అవసరాల రీత్యా ఈ అభ్యుదయ సాహిత్యం ‘‘జనం’’లో మనుగడ సాగిస్తూంది. అవి మినహాయిస్తే ఇప్పుడు తామరతంపరగా వెలువడే రాతలో స్వప్రయోజనాలు, ‘‘భజన’’పాలే ఎక్కువైతున్నది. మెజారిటీ ప్రజా ప్రయోజనాల కోసం, సామాజిక అవసరాల కోసం సాహితీ ప్రక్రియలు రాయబడుతున్నా డేగకళ్ళ పహారా నీడలలో విస్తృత వినియోగం కనిపించటం లేదనిపిస్తోంది.

అధికారపక్షానికి, నాయకులకు వంధిమాగధులైన రచయితలు, కవులు వారి రాతలు పెరిగి పోతున్నాయి. ఈ రాతలకు రాతగాండ్ర వేదికలకు వివిధ లక్ష్యాలుండటం వేరే విషయం, కాని వారు ప్రచురించే సాహిత్యంలో తప్పొప్పుల వడపోతలు మచ్చుకైనా లేకపోవటం విచారించాల్సిన విషయం. ఏం రాస్తున్నాము? ఎలా రాస్తున్నాము? రాస్తున్న అంశంలో ఏం చెప్తున్నాము? ఎంచుకున్న విషయంపై వున్న అవగాహన ఏంటి? విషయానికి గల ప్రాసంగికత మరియు భూతకాలపు విశేషాలపై లోతుపాతుల దార్శనికత, రాతకు సంబంధించి అంశాలు చదివే వారికి ఏం బోధిస్తున్నాయి? వినియోగిస్తున్న వాక్య నిర్మాణంలో లోపాలు ఏమైనా వున్నాయా? వినియోగిస్తున్న పదాల ఉత్పత్త్యర్థాలకు దానికి సంబంధించిన వాక్యాలకు సంబంధం వుంటుందా! లేదా? రాస్తున్న ప్రక్రియకు సంబంధించి ప్రధాన సూత్రాలు పాటిస్తున్నామా! లేదా? రాయటానికి ఎంచుకున్న మాండలీకము, ఆ మాండలీక వినియోగానికి సంబంధించి సందర్భానుసార భాషా సొబగులు, వాటి వినియోగము, వీటన్నింటికి సంబంధించిన అంటే రాతకు సంబంధించిన కనీస జ్ఞానం లేమి నేడు అచ్చులో దర్శనమిస్తూన్నది. రాత రాత కోసమే తప్ప మరో ప్రయోజనం లేదనేది నేటి రాతలలో కొట్టచ్చినట్టు పలకరిస్తున్నాయి. రాయబడిన అంశం చదువరులకు సమాచారం మాత్రమే అందిస్తే చాలు అనుకోవటం సాహిత్యరచనల విషయంలో కుదరదు.

సాహితీ రచనా వ్యాసాంగంలో తప్పని సరిగా పదజాలం, భాషా, వ్యాకరణాంశాల ప్రాధాన్యతను త్రోసిపుచ్చలేము. కేవలం అధికార గణాల ప్రాపకం కోసం రాసే రాతలలో ఇవన్నీ వుంటాయని ఆశించలేము కానీ ఈ భజన పాటల పేరిట సాహిత్య ప్రయోజనాలను ఏలికల పాదాల వద్ద తాకట్టు పెట్టటం సరైంది కాదు. ఒక్కరే రాసి పది మంది పేరిట ముద్రింపజేయటం, ఒకే రచనను పలు పత్రికలకు పంపుకోవటం, ఇలాంటి చిత్రమైన వైఖరులకు దారి తీసే అవకాశాలు పెరగవచ్చును. అలాంటి విధానాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప సామాజిక ప్రయోజనాలను పట్టించుకోదు. సామాజిక మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏలికల భక్త సమాజాలు, భక్తులు, వారి అవసరాలు పెరిగిపోయాయి.ై‘‘దాల్చా’’ సాహిత్యం పెరిగి పోతూంది. పైగా ముద్రణలు, వాటి అనువాదాలు, అవిష్కరణలు, సత్కారాలు, చప్పట్లు, పరస్పర అభినందనలు అయితే వ్యక్తి ప్రయోజనాలు లేదా రాజకీయ ప్రయోజనాల కోసమే అని భావించక తప్పటం లేదు.

మహోన్నతమైన చరిత్ర లిఖించుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి ఊపిరులూదిన మన సాహిత్యం, కళలు వందల వేల కొత్త కలాలకు, గొంతుకలకూ పురుడు పోసింది. చీమలదండు లాగా జనాన్ని కదిలించిన సత్యానికి జేజేలు కొట్టిన ఏలికలు ఇప్పుడు ఆ సాహిత్యం, కళలను నిషేధం పాల్జేస్తూ, ఖైదు చేస్తూ తన నైజాన్ని చాటుకుంటున్నారు. సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు సాహిత్యమే జనాలను చైతన్య పరుస్తుందని తెలుసు కాబట్టే మళ్ళా గొంతు సవరించుకున్నారు. ఇటీవల కరోనా వ్యాధిపై జాగరూకత కోసం తెలంగాణ కళలు తమ సేవలను అందించాలని పిలుపు నిచ్చారు. ఈ ద్వంద్వ ప్రమాణాల నైజాన్ని గుర్తించటం మన తక్షణావసరం.
మన సాహిత్యం పోతన కాలం నాడే రాజుల ప్రాపకానికి తలవంచలేదు. నేడు తెలంగాణలో సాహిత్యం, కళలు వాటి పురుటి బంధం మరిచి వంధిమాగధ గేయాలు పాడటం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోవల్సిన అవసరముంది. భాష, సాహిత్యం, కళలు అస్థిత్వాన్ని కోల్పోయిన ఏ సమాజము తిరిగి ఊపిర్లూదుకోదనే సత్యం యాది మరువద్దు. ఏలికల యత్నాలకు తలవంచక నిలదీసి, నిలేసే క్రమంలో సామాజిక సమస్యలపై అవగాహన, అధ్యయనం పంచుకోలవటమే సరైన సాహిత్య సృజనకు దారులు వేస్తుందన్న సోయి పెంచుకోవాలె.

‘‘సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్’’! ‌మాగనే ఇనబట్టినవు గని, సాహిత్యం సామాజిక ప్రయోజనాల కోసమంటె రాషేటోళ్ళ ప్రయోజనాలు ఏం గావాలె? ఏది రాశినా, ఎట్ల రాశినా పెద్దల మెచ్చుకోళ్ళుంటానయి, పందిని సూత ‘‘నందిననే’’ సాహితీ మూర్తులున్నంక మామూలు జనం కోసం రాయటం అవుసరమా!’’? నా ప్రశ్నలకు జవాబులు జల్దిన జెప్పాలె! అని బెదిరియ్య బట్టిన భేతాళుని ఎప్పటి లాగనే భుజానెత్తుకొని ‘‘విను, భేతాళ్‌! ఇప్పుడు స్వప్రయోజనాలే పరమావధిగా రాసేటోళ్ళు ఎక్కువున్నరు, చరిత్రల వాళ్ళు ఏ విలువలను నమోదు చేసుకుంటారో ముందు సూపుండాలి. పందిని నందనెటోళ్ళ మెచ్చుకోళ్ళు గీటురాళ్ళు కాదు. రాత ఏ వర్గ ప్రయోజనాలు కాపాడుతుంది! అనే దానిపై ఆ రాత విలువలు ఆపాదించుకుంటుంది’’ అని జెప్పుకుంట ఇక్రమార్కుడు నడ్వబట్టిండు..నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply