Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో దర్బంగా పేలుడు మూలాలు

  • చీరెల పార్సిల్‌లో పేలుడు పదార్థాల సీసా
  • రైలును పేల్చేందుకు కుట్ర జరిగినట్లు నిర్ధారణ
  • ఘటనపై విచారణ సాగుతున్నదన్న సిపి అంజనీకుమార్‌

దర్బంగా పేలుడు కుట్రకు సంబంధించిన మూలాలు హైదరాబాద్‌లో వెలుగు చూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్బంగా పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతున్నదని సీపీ అంజనీ కుమార్‌ ‌పేర్కొన్నారు. సెంట్రల్‌ ఏజెన్సీతోపాటు సిటీ పోలీసుల కో ఆర్డినేషన్‌తో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నదని, విచారణ పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా..యూపీకి చెందిన ఇమ్రాన్‌, ‌నాసిర్‌ ‌హైదరాబాద్‌లో ఉంటున్నారు. జూన్‌ 15‌న సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌ ‌నుంచి దర్బంగాకు పార్శిల్‌ ‌వెళ్లింది. కొన్ని చీరల మధ్యలో ఒక బాటిల్‌ను ఇద్దరు సోదరులు అమర్చి ట్రైన్‌ ‌పేలుడుకు కుట్ర పన్నినట్టు సమాచారం. సికింద్రాబాద్‌లోని సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. యూపీలో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్ట్ ‌చేసింది. ఇమ్రాన్‌, ‌నాసిర్‌ను హైదరాబాద్‌ ‌నుంచి ఎన్‌ఐఏ ‌ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇండియన్‌ ‌ముజాహిద్దీన్‌తో సంబంధాలపై విచారణ కొనసాగుతున్నది. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా.. మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయనే అపవాదు ఒకప్పుడు భాగ్యనగరానికి ఉండేది.

దాదాపు దశాబ్దకాలంగా ఆ మచ్చ తొలిగిపోయిందనుకుంటున్న తరుణంలో తాజాగా బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. ఈ నెల 17న దర్భంగ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వద్ద.. సికింద్రాబాద్‌ ‌నుంచి వొచ్చిన రైలులోంచి ఓ వస్త్రాల పార్శిల్‌ను దింపుతుండగా.. పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవకున్నా..ఆస్తి, ప్రాణనష్టం లేకున్నా..ఉగ్రవాద కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ‌దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్శిల్‌ ‌దర్భంగకు చెందిన మహమ్మద్‌ ‌సూఫియాన్‌ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్‌ ‌సలీం ఖాసీం, మహమ్మద్‌ ‌కఫీల్‌ను అరెస్టు చేసింది. వీరిద్దరికీ పాకిస్థాన్‌ ‌నుంచి నిధులు బదిలీ అయినట్లు తేలింది. పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్‌ ‌ఖానా అనే వ్యక్తి వీరికి డబ్బు పంపినట్లు ఎన్‌ఐఏ ‌గుర్తించింది. ఇక్బాల్‌ ‌ద్వారా వీరిద్దరికీ హైదరాబాద్‌లో ఉంటున్న ఇమ్రాన్‌, ‌నాసిర్‌ ‌పరిచయమైనట్లు నిర్దారించింది.

అదే సమయంలో పేలుడుకు కారణమైన వస్త్రాల పార్శిల్‌ ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌నుంచి వొచ్చినట్లు గుర్తించింది. దీంతో బిహార్‌ ఏటీఎస్‌ అధికారులు ఓ బృందాన్ని సికింద్రాబాద్‌కు పంపారు. వారు తెలంగాణ కౌంటర్‌ ఇం‌టెలిజెన్స్ ‌సెల్‌ అధికారులతో కలిసి పలు ఆధారాలను సేకరించారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌కు వొచ్చిన ఇద్దరు యువకులు వస్త్రాల పార్శిల్‌ను రైల్వే కౌంటర్‌ ‌వద్ద అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వారిద్దరినీ సోమవారం అరెస్టు చేశారు. వారిని ఇమ్రాన్‌, ‌నాసిర్‌ అని, వారిద్దరూ అన్నదమ్ములని గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ కౌంటర్‌ ఇం‌టెలిజెన్స్ ‌సెల్‌లో..బిహార్‌ ఏటీఎస్‌ ‌నిర్బంధంలో ఉన్నారు. నేడో రేపో ఎన్‌ఐఏ ‌బృందాలు వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.

దర్భంగ రైల్వేస్టేషన్‌లో జరిగిన పేలుడుకు కారణమైన ద్రవ పదార్థం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. బీహార్‌ ఏటీఎస్‌ అధికారులు పేలుడు ఘటనాస్థలి నుంచి నమూనాలను అక్కడి ఫోరెన్సిక్‌ ‌సైన్స్ ‌ల్యాబ్‌కు తరలించారు. అయితే..ఆ పేలుడు పదార్థమేంటో అక్కడ నిర్దారణ కాలేదని సమాచారం. ఇదిలావుంటే ఉగ్రవాదులకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌ ‌పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌కలసిపోయాక పాతబస్తీ బాంబుల ఫ్యాక్టరీగా మారిపోయిందన్నారు. పాకిస్తాన్‌ ‌నుంచి వొచ్చే వారిపై నిఘా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ‌ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌ ‌విమర్శించారు.

Leave a Reply