Take a fresh look at your lifestyle.

త్వరలో మునిసిపాలిటీల్లో .. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం

  • పట్టణాలు ప్రణాళికాబద్దమైన అభివృద్ధిలో సాగాలి
  • ఆదాయవనరులు పెంచుకునే దిశగా అడుగులు వేయాలి
  • రిసోర్స్, ‌పవర్‌, ‌శానిటైజేషన్‌, ‌వాటర్‌ ఆడిట్‌ ‌తప్పనిసరిగా నిర్వహించాలి
  • తెల్ల కార్డుదారులకు నల్లా కనెక్షన్‌ ‌రూపాయికే
  • సిద్ధిపేట మునిసిపాలిటీని ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి కేటీఆర్‌
  • ‌గుణాత్మక మార్పుకు నాంది పలుకుతాం: మంత్రి హరీష్‌రావు
  • ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రులు హరీష్‌, ‌కేటీఆర్‌ ‌సమీక్ష

ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని మునిసిపాలిటీల అభివృద్ధిపై శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కల్వకుంట్ల తారకరామారావు సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ… త్వరలో మున్సిపాల్టీల్లో  ఉద్యోగాల ఖాళీలను   భర్తీ చేస్తామనీ, ఇందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందనీ,  త్వరలో నియామకాలు చేపడుతామన్నారు. రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలిలనీ, సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శ మునిసిపాలిటీ దీనిని నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం  ఎలాంటి ఎన్నికలు లేవనీ, మూడున్నరేళ్లు ప్రశాంతంగా ప్రణాలికాబద్దంగా అభివృద్ధి పనుల్లో నిమగ్నమవ్వాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 42  అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఓ అభివృద్ధి నమూనా పట్టిక తయారు చేశామన్నారు.

అందులో  ఆదర్శమున్సిపాలిటీగా మారాలంటే ఉండాల్సిన అభివృద్ధి, అవసరమైన పనులు, హంగులు ఉన్నాయనీ, వీటిని మున్సిపల్‌ ‌కమిషనర్లు, మున్సిపల్‌ ‌ఛైర్మన్లకు అందజేస్తామనీ, 42అంశాల్లో మీ మున్సిపాలిటీలో ఏమి ఉన్నాయి… ఏవి లేవు అన్నవి మీరు చెక్‌ ‌చేసుకోవాలన్నారు. మరో మూడున్నరేళ్లలో అభివృద్ధి పట్టికలో ఏ స్థానంలోకి తీసుకెళ్లాలి, ఏ పనులు ప్రాధ్యాన్యత క్రమంలో  చేపట్టాలి అనే ప్రణాళికను లక్ష్యంగా నిర్ణయించుకోండన్నారు.  డంప్‌ ‌యార్డు ఉందా?ఆన్‌ ‌లైన్లో బిల్డింగ్‌ ‌పర్మిషన్లు ఇస్తున్నామా? లేదా? ప్రజలకు తాగు నీరు ఎలా అందుతుంది?  అనే  42అంశాలు  ఈ జాబితాలో ఉంటాయన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌ప్లాన్‌ ‌యువర్‌ ‌విలేజ్‌, ‌ప్లాన్‌ ‌యువర్‌ ‌టౌన్‌, ‌ప్లాన్‌ ‌యువర్‌ ‌స్టేట్‌ అని చెబుతుంటారు. ఆయన ఆలోచన విధానంలో భాగంగా మన టౌన్‌ అభివృద్ధిని మనం ప్లాన్‌ ‌చేసుకోవాలనీ, అందుకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులను మున్సిపాలిటీలకు ఠంఛనుగా ఇస్తోందనీ, మీరు చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేయండన్నారు. మెదక్‌, ‌సంగారెడ్డి మున్సిపాల్టీలు జిల్లా కేంద్రాలు కూడా. ఇవి అన్ని రంగాల్లో సమగ్ర రీతిలో అభివృద్ధి చెందాలన్నారు.  రిసోర్సెస్‌  ఆడిట్‌, ‌పవర్‌ ఆడిట్‌, ‌శానిటైజ్‌ ఆడిట్‌, ‌వాటర్‌ ఆడిట్‌ ‌లను అన్ని మున్సిపాల్టీలు చేపట్టాలన్నారు. రిసోర్సెస్‌ ఆడిట్‌లో భాగంగా మున్సిపాల్టీ ఆదాయ, వ్యయాలపై అవగాహన పెంచుకోండి. ఆదాయ వనరులు ఎలా పెంచాలి అన్న అంశంపై దృష్టి సారించాలనీ,  ఇందు కోసం కొత్త మార్గాలు అన్వేషించాలనీ కేటీఆర్‌ ‌సూచించారు.

పవర్‌ ఆడిట్‌లో భాగంగా  మున్సిపాల్టీల్లో ఎన్ని సిమెంట్‌ ‌పోల్స్ ఉన్నాయి. ఎన్ని ఇనుప పోల్స్ ఉన్నాయి. కొత్తగా విలీనం అయిన ఎన్ని గ్రామాలను కవర్‌ ‌చేస్తున్నాం. అనే అంశాలను సమీకరించాలి. ఇనుప పోల్స్ ‌తొలిగించాలి. విద్యుత్‌ ‌బిల్లులు సక్రమంగా మున్సిపాల్టీలు చెల్లిస్తున్నాయా లేదా పరిశీలించాలి. ప్రతీ నెలా తప్పకుండా విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాల్సిందే. విద్యుత్‌ ‌పొదుపు పాటించాలి.  అవసరమైన చోట ఎల్‌.ఈ.‌డీ లైట్లు పెట్టించడం. మున్సిపాల్టీల్లో ఇంకా పని చేయని వి ద్యుత్‌ ‌బోర్ల కనక్షన్లు తీసివేయించడం, కెపాసిటర్లు వినియోగించడం ద్వారా విద్యుత్‌ ‌బిల్లలు తగ్గుతాయి .ఇలాంటి అంశాలు పరిశీలించాలన్నారు.  ఆగష్టు 15వ తేదీలోగా అన్ని మున్సిపాల్టీల్లో ప్రతీ వెయి మందికి ఒక టాయిలెట్‌ ఉం‌డేలా లక్ష్యంతో పని చేయాలి. ఇందులో  50 శాతం షీ టాయిలెట్లు ఉండాలనీ, ఇందుకు గానూ  400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామన్నారు.  ప్రతీ మున్సిపల్‌ ‌కమిషనర్‌, ‌ఛైర్మన్‌  ఉదయం ఐదున్నర గంటలకే ఫీల్డ్‌లో ఉండాలనీ, నల్లా కనెక్షన్‌ ‌తెల్ల కార్డు వారికి 1 రూపాయి, మిగతా వారికి 100 రూపాయలకు ఇవ్వాలి. రాష్ట్రమంతా ఇదే విధానం అనుసరించాలనీ కేటీఆర్‌ ‌చెప్పారు.

గుణాత్మక మార్పుకు నాంది పలుకుతాం: మంత్రి హరీష్‌రావు
ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో   రిసోర్స్, ‌పవర్‌, ‌శానిటైజ్‌, ‌వాటర్‌ ఆడిట్‌ ‌నిర్వహించి గుణాత్మక మార్పుకు నాంది పలుకుతామనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలనీ, ప్రతి మున్సిపాలిటీలో డంప్‌ ‌యార్డు ఉండాలి. ఆధునిక పద్ధతిలో నిర్వహించాలన్నారు. ప్రతీ వెయ్యి మందికి  ఒక టాయిలెట్‌  ఆగస్టు 15 కల్లా  ఉండేలా పని చేస్తామన్నారు.  డెబ్రిస్‌ ‌మెనేజ్‌ ‌మెంట్‌ ‌ప్రాజెక్టు, యానిమల్‌ ‌కేర్‌ ‌సెంటర్లు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో ఏర్పాటు చేస్తామనీ,  మూడు జిల్లాలో జిల్లాకు రెండు చొప్పున మొబైల్‌ ‌బస్‌ ‌షీ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో ఉంచుతామన్నారు.  ఆదాయ వనరులు పెంచుకుని మున్సిపాల్టీలు స్వయంసమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామనీ, వాటర్‌ ‌ట్యాక్స్ ‌వందకు వంద శాతం వసూలయ్యేలా చర్యలు చేపడతామన్నారు. సంగారెడ్డి, సదాశివపేట వంటి మున్సిపాల్టీల్లో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరిత గతన పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు.  పట్టణాల అభివృద్ధి, వాటిల్లో వచ్చే మార్పు నియోజకవర్గాలపైప్రభావం చూపుతుందనీ, గ్రామల నుంచి వచ్చే ప్రజలు పట్టణాలపై ఆధారపడతారు.  ఈ కారణం వల్ల పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సమీక్షలో ఎంపి బిబి.పాటిల్‌, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి,  మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి,  ఫరీదుద్దీన్‌, ‌వొడితెల సతీష్‌కుమార్‌(‌హుస్నాబాద్‌), ‌ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి(జనగాం), పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌,  ‌కలెక్టర్లు  పరపతి వెంకట్రామరెడ్డి, ధర్మారెడ్డి, హన్మంతరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్ధిపేట మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply